గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : మంగళవారం, 24 మే 2016 (17:25 IST)

'యాపిల్‌'ను ఒడిసిపట్టిన 'సాఫ్ట్' మాటల మాంత్రికుడు కేటీఆర్.. తెలంగాణ ఐటీ సిగలో ఉపాధి గని

తెలంగాణ రాష్ట్ర ఐటీ ముఖ చిత్రాన్ని మార్చేసిన భారీ ఐటీ కంపెనీ యాపిల్. ఈ సంస్థ భారత్‌లో ఏర్పాటు చేయదలచిన డెవలప్‌మెంట్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఇటీవల ప్రారంభించింది. అయితే, ఈ సంస్థ హైదరాబాద్ నగరాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తనయుడు, ఆ రాష్ట్ర ఐటీ మంత్రి కె.తారక రామారావు అలియాస్ కేటీఆర్. ఈయన కృషి ఫలితంగానే యాపిల్ సంస్థ తన డెవలప్‌మెంట్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. ప్రపంచంలోని అనేక దేశాలతో పాటు భారత్‌లోని అనేక నగరాలను పరిశీలించిన యాపిల్ సంస్థ చివరకు హైదరాబాద్ నగరం తనకు అనుకూలమైనదిగా భావించి, దాన్ని ఎంచుకుంది. అసలు హైదరాబాద్ ఎంపిక నేపథ్యాన్ని ఓసారి పరిశీలిస్తే... 
 
భారత్‌లో సింగిల్ బ్రాండ్ లైసెన్స్ కోసం యాపిల్ సంస్థ దరఖాస్తు చేసుకుంది. ఇందుకోసం డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని భావించింది. దీంతో దేశంలోని అనేక నగరాలను పరిశీలించి చివరగా హైదరాబాద్ నగరాన్ని ఎంచుకుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో పాటు స్థానిక పరిస్థితులను బేరీజు వేసి... 2.5 లక్షల చదరపు అడుగుల స్థలంలో ఈ కేంద్రాన్ని నెలకొల్పేందుకు యాపిల్ సంస్థ ముందుకు వచ్చింది. ఈ కేంద్రం నిర్వహణ కోసం 2500 మందిని నియమించుకోనుంది. ఈ సెంటర్ నిర్మాణం కోసం ఏకంగా 150 కోట్ల రూపాయలను యాపిల్ ఖర్చు చేయనుంది. 
 
ఈ సెంటర్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఏకంగా 20 వేల మందికి ఉపాధి లభించనుంది. ఇందులో ప్రత్యక్షంగా 5 వేల మందికి, పరోక్షంగా 15 వేల మందికి ఉపాధి లభించనుంది. గత ఆర్థిక సంవత్సరంలో యాపిల్ అమ్మకాలు భారత్‌లో 6800 కోట్ల రూపాయలు దాటాయి. అందువల్లే తమ వ్యాపార విస్తరణకు యాపిల్ ప్రధాన కేంద్రంగా ఎంచుకుంది. ప్రస్తుతం ఈ సంస్థ స్మార్ట్ ఫోన్లు, లాప్‌టాప్‌, డెస్క్‌టాప్, స్మార్ట్ వాచీలు, ఐప్యాడ్‌లు, మ్యూజిక్ ప్లేయర్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్న విషయం తెల్సిందే.
 
 
ఈ కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అమెరికా వెలుపల హైదరాబాద్ నగరంలో యాపిల్ సంస్థ అతిపెద్ద అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే తమ ప్రభుత్వం ఐటీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నదని, ఆవిష్కర్తలకు పట్టం కట్టేందుకు వీలుగా ప్రతిష్టాత్మక ఇంక్యుబేటర్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి స్టార్టప్‌లకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నట్టు గుర్తు చేశారు. ఇలాంటి ఐటీ కంపెనీలు తమ కేంద్రాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తే ప్రభుత్వ పరంగా మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. కాగా, తెలంగాణ ఉద్యమ సమయంలో పరుష పదజాలంతో, సీమాంధ్రుల మనస్సులు గాయపడే విధంగా మాటలతూటాలు పేల్చిన కేటీఆర్... తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై, ఐటీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పూర్తిగా మారిపోయి.. తన సాఫ్ట్ మాటలతో హైదరాబాద్‌ను ఐటీ నగరంగా అభివృద్ధి చేస్తున్నారు.