శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pyr
Last Updated : గురువారం, 27 ఆగస్టు 2015 (14:55 IST)

ఆ ఇద్దరిదీ ఒకటే ఆందోళన....! వారిద్దరిపై తెలుగుదేశం స్పందనే వేరు.. ఎవరా ఇద్దరు?

ఆ ఇద్దరు ఒకే లక్ష్యంతో ఆందోళన చేస్తున్నారు. వారు చెప్పేదల్లా ఒకటే బలవంతంగా భూములు లాక్కోవద్దని.. వారిద్దరు ఎవరో ఇప్పటికే అర్థం అయిపోయి ఉంటుంది. వారిలో ఒకరు వైఎస్ఆర్‌సీపీ నేత జగన్ మరోకరు జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్.. కానీ వీరిద్దరు రైతులకు అనుకూలంగా, భూముల కోసం పోరాటం చేస్తున్నప్పటికీ తెలుగుదేశం వారిపై చేసే వ్యాఖ్యానాలే వేరుగా ఉన్నాయి. రాజకీయ కోణం స్పష్టంగా కనిపిస్తోంది. పవన్‌పై ఆచితూచీ మాట్లాడుతుంటే... జగన్‌పై విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. 
 
రాజధాని భూసేకరణ విషయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళన చేపట్టారు. రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కోవడానికి లేదంటూ ధర్నా చేపట్టారు. రైతుల సమ్మతి లేకుండా భూ సేకరణ జరపరాదని ఆందోళనకు దిగారు. తాము అధికారంలోకి వచ్చాక రైతుల భూములు తిరిగి ఇచ్చేస్తామని చెప్పారు. దీనికి రెండు రోజుల ముందు జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ రాజధాని పర్యటన చేశారు. ఆయన కూడా దాదాపుగా అదే చెప్పారు. బలవంతంగా భూమిని లాక్కోవద్దని ఆయన చంద్రబాబు ప్రభుత్వానికి హితవు పలికారు. ఇంకా చెప్పాలంటే పవన్ కాస్తంత ఘాటుగానే స్పందించారు. 
 

అయితే ఈ ఇద్దరు ఒక విధంగా ఆందోళన చేసినా తెలుగుదేశం 
నాయకులు మాత్రం రెండు రకాలుగా స్పందిస్తున్నారు. జగన్‌పై తెలుగుదేశం నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇక మంత్రి ఉమామహేశ్వర రావు అయితే జగన్‌ను ఏకంగా పిట్టల దొరతో పోల్చుతూ విమర్శలు చేయడం విశేషం. ఇక వరుసగా పల్లె రఘునాథ రెడ్డి, కేఈ కృష్ణమూర్తిలు కూడా అంతే సీరియస్‌గా స్పందించారు. దీనికి కారణాలను పరికించి చూస్తే ఆయన నేరుగా రాజకీయ శత్రువు. ఏనాడైనా తెలుగుదేశం పార్టీకి దెబ్బ. అందుకే ఆయనపై విరుచుకుపడుతున్నారు. జగన్‌ విమర్శలకు ప్రతివిమర్శలు చేస్తూ సయ్.. అంటున్నారు. 
 
కానీ అదే అభిప్రాయాన్ని, ఆందోళనను వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్‌పై నోరు మెదపరేం.? అంటే సమీప భవిష్యత్తులో పవన్ నేరుగా రాజకీయాలలోకి వచ్చే పరిస్థితి లేదు. ఆయన వచ్చి పార్టీని పూర్తి స్థాయిలో నడుపుతారో లేదో కూడా తెలియదు. ఇప్పటి వరకూ ఆయన కేవలం ప్రశ్నించడానికే పరిమితమయ్యారు. ఇలాంటి పరిస్థితిలలో ఆయనపై విమర్శలు చేయడం వలన రాజకీయ లాభం లేదని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. 
 
ఆయన ఎన్ని విమర్శలు చేసినా గుక్క అణుచుకుని వెళ్ళుతున్నారు. ఇందుకు మంత్రి నారాయణ, కేఈల కామెంట్లే తార్కాణం, ఒకరేమో పవన్ సూచనలను పాటిస్తామని చెబితే, మరొకరు పవన్ తెలుగుదేశం పార్టీకి శత్రువు కాదని వ్యాఖ్యానించారు. అంటే రాజకీయాలలో సమస్యలను అనుసరించి కాకుండా ఓట్లు, సీట్లను అనుసరించి స్పందనలుంటాయన్నమాట.