శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: మంగళవారం, 25 నవంబరు 2014 (20:30 IST)

విశ్వసనీయత : జగన్ మోహన్ రెడ్డిని జనం నమ్ముతున్నారా...?!!

విశ్వసనీయత.. నమ్మకం.. మాట తప్పని మడమ తిప్పని లాంటి మాటలను వైసిపి నాయకులు ఎప్పటి నుంచో సొంతం చేసుకున్నారు. అవి తమకు ఆస్తి అన్నట్టు వ్యవహరిస్తుంటారు. జనంలో విశ్వసనీయత కలిగిన పార్టీ ఏదైనా ఉందంటే అది తమ పార్టీనేనని.. చంద్రబాబు రైతులను మభ్య పెట్టి.. డ్వాక్రా మహిళలను ఆకర్షించి అధికారంలోకి వచ్చారని ఆయన పచ్చి మోసగాడని పదేపదే చెబుతున్నారు. విశ్వసనీయత అంటే తమదేనని వల్లె వేస్తున్నారు. ఇంతకీ జగన్‌ను జనం నమ్ముతున్నారా.. అలా ఎక్కడైనా అనిపిస్తోందా? రాష్ట్ర పరిస్థితులను పరికించి చూస్తే ఎక్కడా.. ఏ కోశానా.. ఆ పరిస్థితులు కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. జగన్ వేరు... వైఎస్ రాజశేఖర్ రెడ్డి వేరనే విషయం ఆ పార్టీ నుంచి ఇటీవల వెలికి వచ్చిన నాయకులే చాటి మరీ చెప్పారు.

 
 
రాష్ట్రానికి భిన్న పరిస్థితులలో ఎన్నికలు జరిగాయి. అప్పటివరకూ జగన్ మోహన్ రెడ్డికే పక్కా లబ్ది చేకూరే అవకాశాలు నూటికి నూరు శాతం ఉన్నాయి. అంపశయ్యపై చంద్రబాబు రాజకీయ భవితవ్యం ఉండిపోయింది. ఎక్కడా నోరు తెరవలేని స్థితిలో చాలాకాలం ఆయన ఉండిపోయారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పార్లమెంటులో ప్లకార్డు చేతపట్టి.. ఓదార్పు యాత్రతో ఐదేళ్ళ పాటు జనంలో ఉన్న జగన్ ఎందుకు గెలవలేకపోయారు? అంటే అందుకు చాలానే కారణాలున్నాయి. దాని లోతుల్లోకి వెళ్ళకపోయినా కొంచెం గుర్తు చేసుకుందాం. జనమంతా జగనే.. జగనే జనం అనే భ్రమల్లో ఉన్న వైసిపి నాయకుడు జగన్మోహన్ రెడ్డి వైపుకు జేసీ దివాకర్ రెడ్డి, గంటా శ్రీనివాసరావు, రాయపాటి, కావూరిలాంటి ఉద్దండులు ఒక దశలో వస్తామన్న ప్రచారం సాగినా వారిని దరిదాపులకు కూడా రానివ్వలేదనే వాదనలున్నాయనుకోండి.
 
30 ఏళ్ళపాటు తిరుగులేని రాజకీయాలు నడిపి జాతీయ పార్టీని రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి తెచ్చిన ఘనత రాజశేఖర్ రెడ్డిది. ఇందుకు భిన్నంగా చేతిలో ఉన్న నాయకులను జార విడుచుకున్నా వచ్చే నాయకులను వద్దని రాజకీయాలు చేసిన నేత జగన్మోహన్ రెడ్డి. ఆ పర్యావసానాన్ని ఓటమిపాలుతో అనుభవించాల్సి వచ్చింది. అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోని నేతలు ఎవరైనా ఉంటారంటే బహుశా అందులో ప్రథముడు జగన్మోహన్ రెడ్డి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికీ తాను ముఖ్యమంత్రి పీఠానికి కేవలం 5 లక్షల ఓట్ల దూరంలో ఉన్నాననే భ్రమల్లో జగన్ ఉన్నారని అంటున్నారు. 
 
ఇప్పటికీ తనను జనం విశ్వసిస్తున్నారనే ఊహల్లో విహరిస్తున్నారనే వ్యాఖ్యానిస్తున్నారు. ‘నేను నిద్రపోను... మిమ్మల్ని నిద్రపోనివ్వను’ అని చంద్రబాబు అంటుంటే, జగన్ మాత్రం ఆయన కళ్లు తెరవరు.. ఇంకొకరిని తెరవనివ్వరు అనే విధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా వినవస్తున్నాయి. ఇంకా జనమంతా తనతోనే ఉన్నట్లు పగటి కలలు కంటున్నారనే వ్యాఖ్యలు చేస్తున్నారు.
 
రాజశేఖర్ రెడ్డి నుంచి తిన్న దెబ్బలతో గుణపాఠం నేర్చుకున్న చంద్రబాబు ఎన్నికలకు ముందు రైతు రుణాలపై చంద్రబాబు మాట్లాడని సభ లేదు. డ్వాక్రా రుణాలపై హామీ ఇవ్వని ర్యాలీ లేదంటే ఆశ్చర్యం కలగక మానదు. ఉచిత విద్యుత్తుపై రాజశేఖర్ రెడ్డి హామీ ఇస్తే నాడు చంద్రబాబు కరెంటు తీగలపై దుస్తులు ఆరేసుకోవాల్సి వస్తుందని వెటకారం చేశారు. దీనికి పర్యావసానంగా ఆయనను జనం ఎన్నికలలో ఓడించి గుణపాఠం చెప్పారు. ఫలితంగా పదేళ్ళపాటు చంద్రబాబు జనానికి దూరమయ్యారు. 

 
తండ్రిబాటలో నడవాల్సిన జగన్... చంద్రబాబు బాటలో బాబు ఇచ్చిన రుణమాఫీ హామీపై అమలు సాధ్యం కాదని లెక్కలేసి మరీ చెప్పారు. అక్కడే జగన్ రైతు కుటుంబాలలో సగం నమ్మకం కోల్పోయారు. గెలిచిన తరువాత చంద్రబాబు ఇచ్చిన రైతు రుణమాఫీని ముక్కలుముక్కలు చేసి ఇస్తారో లేదో తెలియని స్థితికి తీసుకువచ్చారు. ఆయన హామీ నెరవేర్చక పోవడం వలనం రైతు రుణాల రీషెడ్యూల్, ఇనపుట్ సబ్సిడీ, కొత్త రుణాలను కోల్పోయారు. 
 
అధిక వడ్డీలతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. తన అధికారం కోసం చంద్రబాబు రైతులను రెంటికి చెడ్డరేవడిలా తయారు చేశారని మండిపడుతున్నారు. ఇక డ్వాక్రా మహిళలైతే అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. తాము దాచుకున్న పొదుపు డబ్బు పోయి బ్యాంకులు పీడిస్తున్నాయి. ఇటు ఉచిత వడ్డీకి అర్హులుకాలేక అటు కొత్త రుణాలు రాక నానా అవస్థ పడుతున్నారు. అంటే జనం తీవ్రమైన అసంతృప్తితో రగిలిపోతున్నారు. అయినా సరే పోరుబాట పట్టలేకున్నారు. 
 
అంటే ప్రతిపక్షం పట్ల రైతులలో, డ్వాక్రా మహిళలలో నమ్మకం లేదనే విషయం చెప్పకనే చెబుతున్నాయి. జగన్ కూడా ఈ పరిస్థితులను సొమ్ము చేసుకుని జనానికి అండగా నిలబడే గట్టి ప్రయత్నాలు చేయడం లేదనే వాదనలున్నాయి. అమలు చేయలేము కాబట్టే హామీ ఇవ్వలేదనే సిద్ధాంతాన్ని పదేపదే చెపుతున్నారు. రుణమాఫీ చేయమని వారు చేసే డిమాండుకు రైతుల్లో విశ్వసనీయత రావడం లేదు. దీంతో ఆయన పిలుపులకు స్పందించడం లేదనే వాదనలు వినబడుతున్నాయి. సాధారణంగా అయితే ఉద్యమాన్ని నడిపే వారిపై నమ్మకం ఉంటే ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వాలు కూలినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాని చంద్రబాబు తన ప్రభుత్వాన్ని సాఫీ నడిపేస్తున్నారు.