బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By JSK
Last Modified: బుధవారం, 3 ఆగస్టు 2016 (17:41 IST)

జ‌గ‌న్ గుడ్ టైం రాబోతుందా...? ఆ రోజులు ద‌గ్గ‌ర‌లోనే ఉన్నాయా? ఎప్పుడు?

విజ‌య‌వాడ ‌: వైసీపీ నుంచి ఒక్కో ఎమ్మెల్యే వెళ్ళిపోతుంటే, జ‌గ‌న్ ఒంట‌రి అయిపోతున్నాడ‌ని అంద‌రూ భావించారు. ఇక వైసీపీ ఖాళీ అయిన‌ట్టే అని వ్యాఖ్యానించారు. కొంద‌రైతే, అస‌లు ఇంత జ‌రుగుతున్నా జ‌గ‌న్ కిమ్మ‌న‌కుండా ఎందుకు చేష్ట‌లుడిగి చూస్తూ ఉండిపోయార‌ని ఆశ్

విజ‌య‌వాడ ‌:  వైసీపీ నుంచి ఒక్కో ఎమ్మెల్యే వెళ్ళిపోతుంటే, జ‌గ‌న్ ఒంట‌రి అయిపోతున్నాడ‌ని అంద‌రూ భావించారు. ఇక వైసీపీ ఖాళీ అయిన‌ట్టే అని వ్యాఖ్యానించారు. కొంద‌రైతే, అస‌లు ఇంత జ‌రుగుతున్నా జ‌గ‌న్ కిమ్మ‌న‌కుండా ఎందుకు చేష్ట‌లుడిగి చూస్తూ ఉండిపోయార‌ని ఆశ్చ‌ర్యం కూడా వ్య‌క్తం చేశారు. అయితే ఇప్పుడు క్ర‌మేపీ జ‌గ‌న్ వ్యూహం ఫ‌లించే రోజు ద‌గ్గ‌ర‌ప‌డింద‌ని వైసీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. 
 
ఏడాది గ‌డిచినా నియోజ‌క‌వ‌ర్గాల అభివృద్ధికి నిధులు రావట్లేద‌ని వైసీపీ ఎమ్మెల్యేలు... అభివృద్ధి కోసం అంటూ టీడీపీలోకి చెక్కేశారు. ఇందులో కొంద‌రు జ‌గ‌న్ మోహన్ రెడ్డిని అడిగి మ‌రీ వెళ్ళార‌నే వ్యాఖ్య‌లు కూడా అప్ప‌ట్లో విన‌ప‌డ్డాయి. కానీ, ఇపుడు టీడీపీ ప్ర‌భుత్వం రెండేళ్ళు పూర్తి చేసుకుని, ఎన్నిక‌ల సంవ‌త్స‌రానికి ద‌గ్గ‌ప‌డుతున్న‌త‌రుణంలో ప్ర‌త్యేక హోదా వివాదం ఎదురైంది. 
 
కేంద్రంలోని బీజేపీ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వం, ఏపీకి హోదా లేద‌ని తెగేసి చెప్పడంతో, టీడీపీ ప‌రిస్థితి ముందు నుయ్యి... వెనుక గొయ్యిలా మారింది. హోదా కోసం వీధుల్లో పోరాడాలంటే, బీజేపీతో తెగ‌తెంపులు చేసుకోవాలి. కేంద్ర ప్ర‌భుత్వం నుంచి వైదొల‌గాలి. ఇదే జ‌రిగితే, బీజేపీ రాష్ట్రంలో కొత్త భాగ‌స్వామ్యం కోసం య‌త్నించ‌వ‌చ్చు. దీనికి ఏకైక పార్టీగా వైసీపీ, స‌త్తాగ‌ల నాయ‌కుడిగా జ‌గ‌న్ ఏకైక ప్ర‌త్యామ్నాయం అవుతార‌ని వైసీపీ నేత‌లు ఆశిస్తున్నారు. ఈ దిశ‌గా కేంద్రంలో ఒక లాబీయింగ్ కూడా జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది. 
 
మ‌రోప‌క్క ఫిరాయింపుల చ‌ట్టానికి ప‌దును పెట్టి, గోడ దూకిన ఎమ్మెల్యేల‌పై స్పీక‌ర్ కాకుండా... న్యాయ‌స్థాన‌మే వేటు వేసేలా చూడాల‌ని వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి కేంద్రంతో మంత‌నాలు జ‌రుపుతున్నారు. విజ‌య‌సాయి లాబీయింగ్‌కు భ‌య‌ప‌డి, టీడీపీ ఢిల్లీలో ఒక ప్ర‌త్యేక నిఘా వ్య‌వ‌స్థ‌ను కూడా ఏర్పాటు చేసుకునే ప‌రిస్థితి ఏర్ప‌డిందని అంటున్నారు. 
 
ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఇక గెల‌వ‌లేరు!
వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన ఎమ్మెల్యేలు వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచే ప్ర‌స‌క్తే ఉండ‌ద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యేల‌కు ఎన్నో ఆశ‌లు పెట్టి టీడీపీ ఆక‌ర్షించింది. ముఖ్యంగా స్థానిక టీడీపీ నేత‌ల నుంచి అస‌మ్మ‌తి, వ్య‌తిరేక‌త ఎదురైనా చంద్ర‌బాబు ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించారు. నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య పెరుగుతుంద‌ని, అంద‌రికీ అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని టిక్కెట్లు, స్థానం క‌ల్పిస్తామ‌ని ఇపుడు అదే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఫిరాయించిన ఎమ్మెల్యేల‌కు ఎదురుదెబ్బ అవుతుంద‌ని పేర్కొంటున్నారు. 
 
సిట్టింగ్ ఎమ్మెల్యేగా వారికి టిక్కెట్ ఇవ్వ‌క త‌ప్ప‌దు... దీనితో టీడీపీ అస‌మ్మ‌తి నేత‌లు స‌హ‌క‌రించ‌క‌, వైసీపీ అభ్య‌ర్థి సునాయాసంగా విజ‌యం సాధిస్తార‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఇందుకే జ‌గ‌న్ ఫిరాయించిన ఎమ్మెల్యేల కోసం పాకులాడ‌లేద‌ని పేర్కొంటున్నారు. మొత్తంమీద బీజేపీతో టీడీపీ తెగ‌తెంపులు ఎంత త్వ‌ర‌గా చేసుకుంటే, అంత త్వ‌ర‌గా జ‌గ‌న్ వ్యూహం ఫ‌లిస్తుంద‌ని భావిస్తున్నారు.