శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Selvi
Last Modified: సోమవారం, 12 అక్టోబరు 2015 (20:36 IST)

జగన్‌ను చంద్రబాబు పట్టించుకోవట్లేదా? దీక్షలోనూ రాజకీయాలా? ఏంటిది?

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక దీక్ష ఆరో రోజుకు చేరుకుంది. రోజులు గడుస్తున్నకొద్దీ జగన్ ఆరోగ్యం ఆందోళనకరంగా మారటం ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. మొదటి నాలుగు రోజులకు విరుద్ధంగా ఆది, సోమవారాల్లో జగన్ ఆరోగ్యం భారీగా క్షీణించినట్లు వైద్యులు చెప్పారు. అయితే జగన్మోహన్ రెడ్డి చేపట్టిన దీక్ష దొంగ దీక్షని, ఆయన్ని నిరవధిక దీక్ష చేయమని ఎవరు చెప్పారని టీడీపీ నేతలు నిర్లక్ష్యంగా విమర్శలు గుప్పించడంపై వైకాపా నేతలు మండిపడుతున్నారు. 
 
తెలుగుదేశం పార్టీ నేతలు, మంత్రులు వైకాపా అధినేత జగన్ దీక్ష కపట వేషమని.. ఆయన దీక్షతో ఒరిగేది లేదని.. ప్రాణత్యాగం కోసం కూర్చుని ప్రస్తుతం డాక్టర్లు రాలేదంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. వైకాపా నేతలు, కార్యకర్తలు, జగన్ కుటుంబీకుల్లో మాత్రం జగన్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన మొదలైంది. దీక్షా శిబిరానికి జగన్ చెల్లెలు షర్మిల, తల్లి విజయమ్మ చేరుకోనున్నారు. 
 
ఈ నేపథ్యంలో జగన్ చేపట్టిన నిరాహార దీక్ష శిబిరం వద్ద ఒక యువకుడు సోమవారం ఆత్మాహత్యాయత్నం చేయటం కలకలం రేపింది. తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించడంతో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. దీంతో.. ఆ యువకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజా ఘటన నేపథ్యంలో... జగన్ దీక్షా శిబిరం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
 
మరోవైపు ఆరు రోజుల దీక్షతో జగన్ బరువు తగ్గారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రానికి ఆయన 200 గ్రాముల బరువు తగ్గారు. ఇక.. ఆయన ఆరోగ్య పరిస్థితి చూస్తే.. బీపీ 130/90 కాగా.. పల్స్ రేట్ 80కి పడిపోయింది. ఆరో రోజుకు చేరుకున్న జగన్ దీక్షతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణిస్తోంది. ఆయన మరింత నీరసంగా ఉండటంతో కూర్చునే ఓపిక లేక పడుకునే ఉంటున్నారు. ముఖ్యనేతలు కొందరు దీక్ష విరమించే విషయంపై మాట్లాడుతున్నా.. జగన్ మాత్రం ససేమిరా అంటున్నారు. 
 
అసెంబ్లీలో కూర్చుని మాట్లాడకోని ప్రతిపక్ష నేత ప్రత్యేక హోదా గురించి ఇలా దీక్ష చేయడం తన ఉనికిని కాపాడుకునేందుకేనని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక సీఎం చంద్రబాబు అయితే అమరావతి శంకుస్థాపన పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. జగన్‌ దీక్ష గురించి పట్టించుకునే టైమ్ కూడా ఆయనకు లేదు. అమరావతి శంకుస్థాపన అనే మంచి కార్యక్రమం జరుగుతుంటే.. జగన్ ఇలా దీక్షకు కూర్చోవడం ఏమిటని టీడీపీ నేతలే ప్రశ్నలపై ప్రశ్నలేస్తుండటంతో వైకాప నాయకులు మరింత మండిపడుతున్నారు. ఏదేమైనా ప్రతిపక్ష నాయకుడి ఆరోగ్యంపైనా అధికార పక్షం ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉందన్న వాదనలు వినబడుతున్నాయి. జగన్ దీక్షను భగ్నం చేసైనా ఆయనను వైద్య చికిత్సలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.