శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ttdj
Last Updated : మంగళవారం, 17 జనవరి 2017 (11:51 IST)

జల్లికట్టు క్రీడా పేరుతో జీవహింస.. కోర్టు ఆంక్షలు పట్టించుకునే నాథుడే లేరా?

సంక్రాంతి పండుగ వస్తేచాలు చిత్తూరు జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో హంగామా అంతాఇంతా కాదు.. పండుగ మూడురోజులూ చేసే వేడుకలు హోరెత్తుతాయి. అయితే కొన్ని గ్రామాల్లో జనం ఆనందానికి ఎద్దులు, ఆవులు బలైపోతున్నాయి.

సంక్రాంతి పండుగ వస్తేచాలు చిత్తూరు జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో హంగామా అంతాఇంతా కాదు.. పండుగ మూడురోజులూ చేసే వేడుకలు హోరెత్తుతాయి. అయితే కొన్ని గ్రామాల్లో జనం ఆనందానికి ఎద్దులు, ఆవులు బలైపోతున్నాయి. పశువుల పండుగ పేరుతో పూజించాల్సిన గోమాతలను చిత్రహింసలకు గురవుతున్నాయి. సుప్రీంకోర్టు నిషేధంతో తమిళనాడు జల్లికట్టుపై పెద్దచర్చే జరుగుతున్నా.. చిత్తూరు జిల్లా లోమాత్రం చాపకిందనీరులా చల్లా జరిగిపోతున్న రాక్షస క్రీడపై స్పెషల్ స్టోరీ.
 
ఆవు అమ్మవంటిదన్న చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. గోమాత సర్వదేవతా నిలయం అని పూజించుకుంటాం. ఏపండగొచ్చినా గోమాతను ఆరాధించుకుంటాం. అంతగా పవిత్రమైన గోవులు పండుగ పేరుతో చిత్రహింసలకు గురవుతున్నాయి. సంక్రాంతి పండుగ మూడవరోజున జరిగే పశువుల పండగ పేరుతో చిత్తూరు జిల్లాలో ఈ దారుణం బహిరంగంగానే జరుగుతోంది. రాజకీయనాయకులు దగ్గరుండిమరీ ఈ తతంగాన్ని ఆచారం పేరుతో నిర్వహంచడంతో అడ్డూ అదుపూలేకుండా జీవహింస ఏటా జరుగుతూనే ఉంది.
 
తమిళనాడులో జల్లికట్టును సుప్రీంకోర్టు నిషేధించడం అక్కడ పెద్ద చర్చనీయాంశంగా మారింది. రాజకీయరంగును కూడా పులుముకుంది. అయితే అక్కడి జల్లికట్టుకు చిత్తూరు జిల్లాలో జరిగే పశువుల పండగకు చాలా తేడాఉంది. గతంలో సంక్రాంతి మరుసటిరోజు పశువులకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం చిట్టపువ్వ అనే పేరుతో కంపచెట్టును గుట్టలుగా పోసి అంటించేవారు. అనంతరం ఎద్దుల కొమ్ములకు కొత్త వస్త్రాలు కట్టివదిలేవారు. ఆ వస్త్రాల కోసం ఎద్దులను అదుపుచేసి తీసుకునేవారు గ్రామస్థులు. అయితే ఆచారం కాలక్రమంలో మారి వస్త్రాల స్థానంలో చెక్కలు కట్టడం ప్రారంభమైంది. 
 
గుంపులుగా ఒకేసారి సమూహంగా ఉన్న మనుషుల మధ్యలో పశువులను వదలి వాటికి కట్టిన చెక్కలు తీసినవారు విజేతలుగా ప్రకటిస్తున్నారు. అయితే ఒకప్పుడు గ్రామాల్లో ఎద్దులు ఎక్కువగా ఉండేవి. బలిష్టమైన ఎద్దులు అదుపుచేసిన యువకుల్ని మోనగాళ్లుగా ప్రకటించేవారు. అయితే ట్రాక్టర్ల వాడకం పెరగడంతో పాటూ కరవుతో ఎద్దులు కళేబరాలకు వెళ్లిపోయాయి. ప్రస్తుతం జల్లికట్టు నిర్వహించే రంగం పేటతో పాటూ పరిసర గ్రామాల్లో వేళ్లమీద లెక్కించే సంఖ్యలో మాత్రమే ఎద్దులు ఉన్నాయి. మిగిలినవన్నీ పాల కోసం పెంచే బక్కచిక్కిన ఆవులూ, దూడలే. అయితే పశుల పండుగ పేరుతో ఈ ఆవులను, దూడలనూ చిత్రహింసలకు గురిచేసి ఆనందిస్తున్నారు. భయంతో పారిపోతున్న బలహీన గోవులపై మూకుమ్మడిగా దాడి చేసి హింసించడంలో ఏం హీరోయిజం ఉందనేది ప్రతి ఒక్కరికీ తెలిసిందే. 
 
పవిత్రంగా పూజించాల్సిన వాటిని కాళ్లతో తన్నుతూ, కర్రలతో కొడుతూ, క్రిందపడేసి చావగొడుతన్నారు. దీంతో పూజలు అందుకోవాల్సిన రోజే గోమాతలు తీవ్రగాయలు పాలవుతున్నాయి. కొన్ని చనిపోయిన సందర్భాలూ ఉన్నాయి. జల్లికట్టుపై సుప్రీంకోర్టు నిషేధం కేవలం తమినాడుకు మాత్రమే పరిమితం కాదని.. సుప్రీం ఆదేశాలు దేశవ్యాప్తంగా వర్తిస్తాయంటున్నారు న్యాయనిపుణులు. దీంతో రంగంపేటలో జల్లికట్టుతరహాలో జరిగే పశువుల పండుగ కూడా అలాంటిదేనంటున్నారు. పండుగ పేరుతో పశువులను హింసించడం సరికాదంటున్నారు. 
 
వాస్తవానికి తమిళనాడులో జల్లికట్టును ఈ యేడాది మాత్రమే నిషేధించింది కోర్టు. అయితే ఏపీలోని చిత్తూరు జిల్లాలో మాత్రం పశువులు పండుగ పేరుతో జరిగే జీవహింస ఎప్పటినుంచో అధికారికంగా నిషేధం ఉంది. ప్రతి ఏడాది పోలీసులు పశువుల పండగ ముందురోజు గ్రామాల్లో నిషేధానికి సంబంధించిన నోటీసులు అంటించడం.. హెచ్చరికలు జారీచేయడం చేస్తారు. అయితే అధికార పార్టీల నేతలే దగ్గరుండి మరీ వీటిని జరుపుతుండటంతో ఆ నిషేధం పోలీసులు కూడా ఏమీచేయలేని పరిస్థితి ఎదురవుతోంది. ఇటు మనుషులు, అటు జంతువుల ప్రాణానికి ప్రమాదంగా మారుతున్న రాక్షస క్రీడ ఆగే పరిస్థితి మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. పశువులకు గాయాలైతే ఆసుపత్రికి తీసుకువెళ్తామే తప్ప అనాదిగా వస్తున్న ఆచారాన్ని మాత్రం పోలీసులు, కోర్టులు చెప్పినా వదులుకునేది లేదంటున్నారు గ్రామస్థులు.
 
పండుగ పేరుతో గోవులను హింసస్తూ పొందుతున్న పైశాచిక ఆనందానికి ఇప్పటికైనా ముగింపు పలకాలని జంతుప్రేమికులు కోరుతున్నారు. పాలిచ్చే ఆవులను పండుగ పేరుతో హింసించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు. కొందరు పవిత్రమైన గోమాతలకు మద్యం తాగించి వదులుతుంటారు. ఆమత్తులో ఎటుపరుగెడుతున్నాయో తెలియక వాటి కిందపడి చనిపోయిన ఘటనలూ ఉన్నాయి. ఇప్పటికైనా ఆచారం పేరుతో జరుతున్న రాక్షసక్రీడకు ముగిపుపలకాల్సి ఉంది. గ్రామాల్లో కౌన్సిలింగ్‌ల ద్వారా కొంతైనా మార్పు తీసుకువచ్చే అవకాశం ఉంటుంది.