బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By chj
Last Modified: బుధవారం, 11 జనవరి 2017 (15:37 IST)

తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టు.... ఈ సంవత్సరమైనా అనుమతి ఇచ్చేనా?

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని తమిళనాడు ప్రాంత ప్రజలు సంప్రదాయంగా జరుపుకునే క్రీడ జల్లికట్టు. తమిళుల సాహసం - వీరత్వానికి ప్రతీకగా, సంప్రదాయ క్రీడగా జల్లికట్టు ప్రసిద్ధి చెందింది. జల్లికట్టు అంటే రంకెలు వేస్తూ దూసుకెళ్లే కోడెలను వీరోచితంగా అణచ

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని తమిళనాడు ప్రాంత ప్రజలు సంప్రదాయంగా జరుపుకునే క్రీడ జల్లికట్టు. తమిళుల సాహసం - వీరత్వానికి ప్రతీకగా, సంప్రదాయ క్రీడగా జల్లికట్టు ప్రసిద్ధి చెందింది. జల్లికట్టు అంటే రంకెలు వేస్తూ దూసుకెళ్లే కోడెలను వీరోచితంగా అణచివేసే క్రీడ. ఇందులో గెలిచే వీరులకు కానుకగా ఇచ్చేందుకు 50 ఏళ్ల కిందట ఓ గుడ్డసంచిలో ఉంచిన ‘సల్లికాసు’ అనే భారతీయ నాణేలను కోడెల కొమ్ముకు కట్టేవారు. ఎద్దును లొంగదీసుకున్న ధీరునికే దాని కొమ్ముకు కట్టిన సల్లికాసుల మూట దక్కుతుంది. అయితే అంత సులభంగా ఈ గుడ్డసంచిని ఎవరూ తీసుకోకుండా ఉండేందుకు ఎద్దులకు ముందు నుంచే ప్రతిఘటించడంపై తర్ఫీదు ఇచ్చేవారు. 
 
సల్లికాసులు కట్టడం వలన ఈ క్రీడకు సల్లికట్టు (సల్లికాసులు కట్టడం) అనే పేరు రాగా కాలక్రమంలో అది జల్లికట్టుగా మారిందనే అభిప్రాయం ఉంది. అందుకు ముందు ‘ఏరు తళువల్‌’ అనే పేరుతో ఈ క్రీడ కొనసాగినట్లు శిలాశాసనాలు తదితర పురాతత్వ ఆధారాల ద్వారా తెలుస్తోంది. అప్పట్లో కోడెలను అణచిన వీరులకు బహుమతులు ప్రదానం చేసేవారు. సల్లికాసులు కట్టక ముందు వరకు కోడెల మెడకు చింత కొమ్మలతో అల్లిన వలయాన్ని వేసేవారు. ప్రస్తుతం జల్లికట్టు అనే పేరు విస్తృతంగా ప్రచారంలో ఉంది. దీనిని కొన్ని ప్రాంతాల్లో ‘మంజు విరట్టు’, ‘వేలి మంజు విరట్టు’, ‘వడం మంజు విరట్టు’ అనే పేర్లతో పిలుస్తున్నారు. 
 
ఓ మైదానంలో స్వేచ్ఛగా వదిలిపెట్టిన కోడెలను పలువురు యువకులు తరుముకు వెళ్లడం ‘వేలి మంజు విరుట్టు’ కాగా కోడె మెడకు కట్టిన తాళ్లతో రెండువైపులా దానిని పలువురు లాగిపట్టుకోగా దాని కొమ్ముకు ఉన్న బహుమతి నగదును పొందడానికి కొందరు ప్రయత్నించడం ‘వడం మంజువిరట్టు’గా పిలుస్తున్నారు. జల్లికట్టును రక్తి కట్టించడం కోసం పండగకు కొద్ది నెలలకు ముందు నుంచే కోడెల ఆహారం, తర్ఫీదులో వాటి యజమానులు ప్రత్యేక దృష్టి సారించేవారు. కోడెల కొమ్ములను చురకత్తుల్లా బాగా నునుపు చేసేవారు.
 
జల్లికట్టు క్రీడ పుట్టుపూర్వోత్తరాలలోకి వెళ్లినట్లయితే... తమిళులు అనాదిగా ఈ క్రీడను నిర్వహిస్తూ వస్తున్నారు. తమిళ సాహిత్యాన్ని అనుసరించి ఎద్దు కొమ్ములు వంచినవాడిని మాత్రమే వివాహమాడటానికి యువతులు ముందుకు వచ్చేవారు. పురాతనకాలంలో జీవితాన్ని పణంగా పెట్టి ఎద్దు కొమ్ములను వంచేందుకు ప్రజలు సాహసించేవారు. మొహంజొదారో మరియు హరప్ప నాగరికతలు వెలుగు చూసినప్పుడు ఈ క్రీడ తాలూకు ఆనవాళ్లు బయటపడ్డాయి.
 
తమిళనాడులోని మదురై జిల్లా అలంగానల్లూర్‌, పాలమేడు, అవనియాపురం, పెరైయూర్‌, శివగంగై జిల్లాలోని శిరావయల్‌, సింగంపుణరి, పుదూర్‌, అరళిపారై, పుదుకోట్టై జిల్లాలోని నార్దామలై ప్రాంతాలతో పాటు తిరుచ్చి, తేని వంటి దక్షిణాది జిల్లాల్లోనూ జల్లికట్టు క్రీడను ఘనంగా నిర్వహించేవారు. అయితే అలంగానల్లూర్‌లో జరిగే జల్లికట్టు క్రీడ ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందింది. ఏటా ఇక్కడ జరిగే క్రీడను తిలకించడానికి రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి యువకులతో పాటు విదేశీయులు కూడా తరలిరావడం విశేషం. వేలాది మంది సందర్శకుల మధ్య ఈ క్రీడ వైభవోపేతంగా జరిగేది.
 
జల్లికట్టు క్రీడలో కోడెలను హింసిస్తున్నట్లు ఆరోపిస్తూ 2008 జనవరిలో పొంగల్‌ పండగకు కొన్ని రోజుల ముందు జంతుసంక్షేమ మండలి ద్వారా మేనకాగాంధీ వ్యాజ్యం వేయగా జల్లికట్టు క్రీడను సర్వోన్నత న్యాయస్థానం నిలిపివేసింది. అంతకు ముందే బ్లూక్రాస్‌, పెటా తదితర సంస్థలు సైతం సర్వోన్నత న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు దాఖలు చేశాయి. కొన్ని నిబంధనలతో జల్లికట్టు నిర్వహణకు అనుమతించాలని తమిళనాడు ప్రభుత్వం కోరగా న్యాయస్థానం సూచనల మేరకు ‘తమిళనాడు జల్లికట్టు రెగ్యులేషన్‌ యాక్ట్‌ 2009’ని రూపొందించింది. ఇది జల్లికట్టు నిర్వాహకులు అనుసరించాల్సిన నిబంధనలను సూచిస్తోంది. తర్వాత సర్వోన్నత న్యాయస్థానం నుంచి జల్లికట్టుకు అనుమతి పొందింది. 
 
2011 జులైలో అప్పటి కేంద్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి జైరాం రమేష్‌ జారీ చేసిన ఆదేశాలు జల్లికట్టు నిషేధానికి తలుపులు తెరిచాయి. బోన్లలో బంధించి, బహిరంగ ప్రదేశాల్లో ఉంచి గారడీ చూపించకూడదనే జాబితాలో ఎద్దును సైతం చేర్చడమే అందుకు కారణం. అయినా 2012లో అప్పటి తమిళనాడు ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానం సూచించిన 77 నిబంధనలకు లోబడి జల్లికట్టును నిర్వహించింది. ఆ విధంగా రెండేళ్ల పాటు నిర్వహించినా ఎద్దులను హింసిస్తున్నారంటూ జంతు సంక్షేమ మండలి దాఖలు చేసిన పిటిషన్‌పై జల్లికట్టును పూర్తిగా నిషేధిస్తూ 2014 మే 7న సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీంతో ప్రస్తుతం జల్లికట్టు క్రీడకు అడ్డంకి ఏర్పడటంతో నిషేధం ఎత్తివేతకు చట్టపరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్రప్రభుత్వంతో పాటు అఖిలపక్షాలు, తమిళనాడు ప్రజలూ కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ సంప్రదాయ క్రీడ కొనసాగించాలని తమిళనాడు ప్రజలు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ కేంద్ర తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.