శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: సోమవారం, 13 జులై 2015 (17:34 IST)

ఇక ఇక్కడేం చేస్తాం... గులాబీ కారెక్కెళ్లిపోదాం... అయ్యొయ్యో అక్కడా కాంగ్రెస్ ఖాళీయేనా...?!!

కాంగ్రెస్ పార్టీకి ఇక తెలుగు నేలలో నూకలు లేనట్లే పరిస్థితులు కనబడుతున్నాయి. తెలంగాణ ఇస్తే తెలంగాణ నేలలో కాంగ్రెస్ పార్టీ నాటుకుపోతుందనీ, అమ్మ సోనియా గాంధీ వద్ద గట్టిగా వాదించి మరీ తెలంగాణ తెచ్చేశారు. కానీ సీనియర్ నాయకుడు డి. శ్రీనివాసరావు మొన్న గులాబీ కండువా కప్పుకుంటూ... తెలంగాణ క్రెడిట్ అంతా కె. చంద్రశేఖర రావుదేనని చెప్పేశారు. ఇచ్చింది సోనియా గాంధీ అయినప్పటికీ తేవడమే గొప్ప కనుక తెచ్చినోళ్లో చాలా గొప్ప అని చెప్పేసి గులాబీ కండువా కప్పుకుని కారు ఎక్కేశారు.
 
డీఎస్ అలా కారెక్కి వెళ్లిపోయినా కాంగ్రెస్ పార్టీకి పోయేదేమీ లేదని ఉత్తమకుమార్ రెడ్డి చెప్పుకున్నారు. కానీ పోయేది ఎక్కువే అన్నట్లు ప్రస్తుత పరిస్థితులు కళ్లకు కడుతున్నాయి. సీనియర్, ప్రముఖ నేతలు మెల్లమెల్లగా గులాబీ కండువాలు కప్పుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం వస్తోంది. తాజాగా మాజీ మంత్రి కె. జానారెడ్డి కుమారుడు కూడా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారని చెప్పుకుంటున్నారు.
 
ఐతే ముందుగా జానా చేరకుండా ఆయన కుమారుడు, కాంగ్రెస్ పార్టీ లెజిస్ట్లేటివ్ పార్టీ అధ్యక్షుడు కూడా అయిన ఆయన త్వరలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారనే ప్రచారం జోరందుకుంది. ప్రస్తుతానికి జానారెడ్డిస్థాయికి ఇప్పుడు పార్టీ మారితే బాగుండదు, పైగా ఆయనకు క్యాబినెట్ ర్యాంకు పదవి ఉంది. ఇప్పుడు డీఎస్ మాదిరిగా జంప్ చేస్తే తెరాసలో ఆయనకు ఉన్నఫళంగా ఏ పదవీ రాదు. కాబట్టి ముందుగా తనయుడిని చేర్పించేద్దామని అనుకుంటున్నట్లు తెలంగాణ సమాచారం.
 
ఇదేంటి... మీ అబ్బాయి గులాబీ కండువా కప్పుకున్నారని అడిగితే... అదేమీ నాకు తెలియదు. నా కుమారుడు వేరు.. నేను వేరు అని ఇదివరకూ చాలామంది చెప్పారు కదా. ఆ మాటకొస్తే పిల్లనిచ్చిన మామయ్యది ఓ పార్టీ పిల్లను చేసుకున్న భర్తది మరో పార్టీ. ఇది రాజకీయ రంగులరాట్నం. ఎలా కావాలంటే అలా తిరిగేయచ్చు.. తిప్పేయవచ్చూ.