గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : శుక్రవారం, 9 డిశెంబరు 2016 (14:30 IST)

జయలలితకు స్లో పాయిజన్ ఇచ్చారా..? జవాబు లేని ప్రశ్నలెన్నో...

తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఈనెల 5వ తేదీ సోమవారం అర్థరాత్రి కన్నుమూశారు. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచినట్టు ఎయిమ్స్ వైద్యులు ధృవీకరించారు.

తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఈనెల 5వ తేదీ సోమవారం అర్థరాత్రి కన్నుమూశారు. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచినట్టు ఎయిమ్స్ వైద్యులు ధృవీకరించారు. అయితే ఆమె మరణంపై ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కొన్ని ప్రశ్నలపై ప్రజల్లో ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఆమెకు స్లో పాయిజన్ ఇచ్చారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. పైగా, ఈ సందేహాలను నివృత్తి చేయాలంటూ నటి గౌతమి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఓ లేఖ రాయడం కూడా ఇపుడు చర్చనీయాంశంగా మారింది. అయితే, ఆ ప్రశ్నలకు ఎవరు సమాధానమిస్తారో తెలియదు కానీ.. ఆ ప్రశ్నలేంటో ఓ సారి పరిశీలిద్ధాం. 
 
గత సెప్టెంబర్ 22వ తేదీ జయలలిత జ్వరం, డీహైడ్రేషన్‌తో బాధపడుతూ అపోలో ఆస్పత్రిలో చేరారు. సరిగ్గా ఆమె ఆస్పత్రిలో చేరిన రెండో రోజు, అంటే సెప్టెంబర్ 23న అపోలో ఆస్పత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. జయలలిత జ్వరం, డీహైడ్రేషన్ సమస్యతో బాధపడుతున్నారని, ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని, అబ్జర్వేషన్‌లో ఉంచామనేది నోట్ సారాంశం. జ్వరం, డీహైడ్రేషన్ మాత్రమే అయితే 75 రోజులు ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి ఉందా? అనేది మొదటి ప్రశ్న.
 
అదే రోజున ఆస్పత్రి ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. ఆమెకు జ్వరం తగ్గిపోయిందని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని అందులో ఉంది. ఆమె సాధారణ స్థితిలోనే ఉంటే ఎందుకు ఎవర్ని ఆస్పత్రిలోకి అనుమతించలేదనేది రెండో ప్రశ్న.
 
నవంబర్ 19వ తేదీన అన్నాడీఎంకే అధికారిక ట్విట్టర్ ఖాతాలో పురుట్చితలైవి అమ్మను ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు మార్చారని, ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని పేర్కొంది. ఇదే నిజమైతే జనరల్ వార్డుకు తరలించిన కొద్దిరోజులకే మళ్లీ ఆరోగ్యం ఇంతలా క్షీణించిందా అనేది మూడో ప్రశ్న.
 
జయలలిత ఆస్పత్రిలో చికిత్ప పొందుతున్న ఫోటో ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ ఫోటో హల్‌చల్ చేసింది. ఆ తర్వాత అది ఫేక్ అని తేలింది. 75 రోజులు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ముఖ్యమంత్రికి సంబంధించిన ఏ ఒక్క ఫోటోను కూడా విడుదల చేయకపోవడానికి కారణం ఏంటనేది నాలుగో ప్రశ్న.
 
ఓ పాపులర్ తమిళ ఛానల్ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో జయలలిత చనిపోయారంటూ ట్వీట్ చేసింది. ఆ తర్వాత కొన్ని ఒత్తిళ్లకు తలొగ్గి ఆ ట్వీట్‌ను తొలగించింది. ఆమెకు ఏ హాని జరగకపోతే ఈ ఛానల్ చెబుతుంది అబద్ధం... వాస్తవమిది అని జయకు సంబంధించిన ఏ ఒక్క ఆధారాన్ని ఎందుకు చూపించలేకపోయారనేది ఐదో ప్రశ్న.
 
జయలలిత క్షేమంగానే ఉండి ఉంటే అన్నాడీఎంకే నేతలు ముందుగానే ఓ.పన్నీరు సెల్వంను తమ ముఖ్యమంత్రిగా ఎలా ఎన్నుకుంటారు.? అంటే పార్టీలోని కొంతమంది పెద్ద నేతలకు మాత్రం జయలలిత చనిపోయిన విషయం ముందే తెలుసా అనేది ఆరో ప్రశ్న.
 
జయలలితకు స్లో పాయిజన్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే.. ఆస్పత్రి వైద్యులు, నర్సులు, శశికళ మాత్రమే జయలలిత వెంటను నిత్యం పర్యవేక్షిస్తూ వచ్చారు. అలాంటపుడు.. జయలలితకు  శశికళనే స్లోపాయిజన్ ఇచ్చారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. 
 
ఇవన్నీ పక్కనబెడితే... జయలలిత మేనకోడలు దీపా జయకుమార్‌ను అపోలో ఆస్పత్రిలోకి అనుమతించలేదు. అంటే జయలలిత ఏ స్థితిలో ఉందన్న విషయాన్ని రక్తసంబంధీకులకు సైతం తెలుపకుండా అత్యంత రహస్యంగా ఉంచాల్సిన అవసరమేంటి? కానీ, జయలలిత అన్న కుమారుడు దీపక్‌ను మాత్రం అంత్యక్రియల సమయంలో పక్కన బెట్టుకుని శశికళ ఆ తతంగం పూర్తి చేయడానికి కారణమేంటి?
 
జయలలిత ఆరోగ్య విషయాన్ని అపోలో ఆస్పత్రి అత్యంత గోప్యంగా ఉంచింది. మరి... జయ చనిపోయిన తర్వాత ఆమె చికిత్సకు సంబంధించిన చిత్రాలను కానీ, సీసీ టీవీ పుటేజిలను కానీ విడుదల చేయడంలో అపోలో ఆస్పత్రికున్న అభ్యంతరాలేంటనేది ఎనిమిదో ప్రశ్న. అయితే, ఎందుకు సీసీ టీవీ ఫుటేజిలను విడుదల చేయాలనే ప్రశ్న తలెత్తొచ్చు. ప్రజల్లో ఉన్న సందేహాల తొలగాలంటే ఖచ్చితంగా చికిత్సకు సంబంధించిన దృశ్యాలను విడుదల చేయాల్సిందేనని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానం లభించినట్టయితే ఖచ్చితంగా జయలలిత మృతిపై ఉన్న అనుమానాలు చాలామేరకు నివృత్తి అయ్యే అవకాశం ఉంది.