గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : మంగళవారం, 17 మే 2016 (13:32 IST)

తమిళనాడు పోల్ రిజల్ట్స్ : పోలింగ్ వాయిదా పడిందంటే అధికార మార్పిడి తథ్యం.. అదే చెపుతున్న ఎగ్జిట్ పోల్స్‌

తమిళనాడు రాష్ట్ర శాసనభ ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఈనెల 19వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ ఫలితాల్లో అధికార మార్పిడి తథ్యమని పోలింగ్ ముగిసిన తర్వాత వెలువడిన అన్ని ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు పేర్కొంటున్నాయి. అంటే.. అన్నాడీఎంకే అధికారాన్ని కోల్పోయి.. ప్రతిపక్ష డీఎంకే అధికారంలోకి వస్తుందని ఈ సర్వే ఫలితాలు చెపుతున్నాయి. 
 
ఇదిలావుండగా, రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో భాగంగా, ఏదేని ఒక అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు నిర్వహించకుండా వాయిదా వేసినా అది అధికార మార్పిడికి సంకేతమేనని ఆ రాష్ట్ర గత అసెంబ్లీ ఎన్నికల చరిత్రను పరికిస్తే తెలుస్తోంది. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన, ఓటర్లకు విచ్చలవిడిగా డబ్బు పంపిణీ వంటి చర్యల కారణంగా కరూర్ జిల్లాలోని అరవకుర్చి, తంజావూరు జిల్లాలోని తంజావూరు సెగ్మెంట్లకు ఈనెల 16వ తేదీన జరగాల్సిన పోలింగ్‌ను ఈనెల 23వ తేదీకి వాయిదా వేశారు. ఇది అధికార మార్పిడికి ముందస్తు సంకేతంగా ఆ రాష్ట్ర ఓటర్లు చెపుతున్నారు. దీనికి గత చరిత్రను వారు ఉదహరిస్తున్నారు. 
 
గత 1989లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు మరణించిన కారణంగా మరుంగాపురి, ముసిరి, మదురై స్థానాల ఎన్నికల పోలింగ్‌ను వాయిదా వేశారు. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే అధికారం కోల్పోయి, డీఎంకే అధికారంలోకి వచ్చింది. అలాగే, 1991 ఎన్నికల్లో కూడా ఎగ్మోర్ స్థానంలో స్వతంత్ర అభ్యర్థి మరణించడంతో ఎన్నికను వాయిదా వేశారు. ఈ సమయంలో కూడా డీఎంకే అధికారాన్ని కోల్పోయి.. అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చింది. 
 
1996 ఎన్నికల్లో నొయ్యాల్ నది సమస్యను పరిష్కరించనందుకు నిరసనగా మొడకురిచ్చి స్థానంలో 1450 మంది రైతులు నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో బ్యాలెట్ పత్రం తయారు చేయడం అసాధ్యమని పేర్కొంటూ పోలింగ్‌ను వాయిదా వేశారు. ఈ ఎన్నికల్లో కూడా అధికారంలో ఉన్న అన్నాడీఎంకే అధికారాన్ని కోల్పోయి, ప్రతిపక్షంగా ఉన్న డీఎంకే అధికారంలోకి వచ్చింది. 2016 ఎన్నికల్లో కూడా ఇదే సెంటిమెంట్ పునరావృత్తమయ్యే అవకాశం ఉంది. 
 
ఇపుడు కూడా అరవకుర్చి, తంజావూరు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల పోలింగ్‌ను వాయిదా వేశాయి. పైగా.. పోలింగ్ ముగిసిన వెంటనే వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు కూడా డీఎంకే అధికారంలోకి వస్తుందని పేర్కొంటున్నాయి. ఒక్స సీఓటర్ సంస్థ మాత్రమే అన్నాడీఎంకే అధికారాన్ని నిలబెట్టుకుంటుందని చెపుతోంది. మొత్తం మీద.. ఎన్నిక వాయిదా పడితే అధికార మార్పిడి తథ్యమనే సెంటిమెంట్ ఈ ఎన్నికల్లో పని చేస్తుందో లేదో ఈనెల 19వ తేదీన తేలిపోనుంది.