బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : సోమవారం, 11 ఏప్రియల్ 2016 (13:02 IST)

తమిళనాడు ఎన్నికలు.. అందరి అస్త్రం మద్యపాన నిషేధమే!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలకు ఒకే ఒకటి ప్రధాన అస్త్రంగా మారింది. అదే సంపూర్ణ మద్యపాన నిషేధం. ఫలితంగా.. ఆ రాష్ట్ర ఎన్నికల ప్రచారం ఈ నినాదాన్ని కేంద్రంగా చేసుకునే సాగుతోంది. గత కొంతకాలంగా రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం విధించాలని అధికార అన్నాడీఎంకే మినహా ఇతర పార్టీలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో జరుగనున్న ఎన్నికల్లో ఈ అంశమే అధిక ప్రభావం చూపుతుందని భావించిన ముఖ్యమంత్రి జయలలిత కూడా ఇదే బాటను ఎంచుకున్నారు. ఫలితంగా ఈ ఒక్క అంశం రాష్ట్ర రాజకీయాలను అనూహ్య మలుపు తిప్పింది. 
 
ఈ వ్యవహారంలో అన్ని పార్టీల అభిప్రాయపరంగా ఒకే నిర్ణయం తీసుకోవడంతో ఎవరికివారు తమ వైవిధ్యాన్ని చూపడానికి నేతలు ఎత్తుగడలు వేస్తున్నారు. ఇదే వారి ఎన్నికల ప్రచారశైలిపై ఆసక్తి కలిగిస్తోంది. ఈ శాసనసభ ఎన్నికల్లో సంపూర్ణ మద్యనిషేధం అంశాన్ని ప్రధానాస్త్రంగా చేసుకోవాలని ఏడాది క్రితమే అన్ని రాజకీయపార్టీలూ సన్నాహాలు చేసుకున్నాయి. 
 
మద్యనిషేధం డిమాండ్‌తో గాంధేయవాది శశిపెరుమాళ్‌ ఉద్యమం చేపట్టి అనూహ్యంగా ప్రాణాలు విడవటంతో అధికారపార్టీపై చెలరేగిన వ్యతిరేకతను తమకు సానుకూలంగా మార్చుకోవాలని డీఎంకే సహా అన్ని పార్టీలూ భావించాయి. ఈ నేపథ్యంలో శనివారం ప్రచారాన్ని ప్రారంభించిన జయలలిత సంపూర్ణ మద్యనిషేధానికి తాను వ్యతిరేకిని కాబోనని, దశలవారీగా అమలు చేస్తానని ప్రకటించడంతో ప్రతిపక్షాల అమ్ములపొదిలోని బలమైన ఓ అస్త్రాన్ని నిర్వీర్యం చేసినట్లయింది. 
 
ఇప్పుడు అధికార పార్టీ సహా దాదాపు అన్ని పార్టీలూ ఇదే అంశంతో ప్రజల ముందుకు వెళ్లినట్లయింది. వైవిధ్యం ప్రదర్శించడం కోసం అన్ని పార్టీలూ తమదైన శైలిలో విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడానికి సిద్ధమయ్యాయి. జయలలిత నోటి నుంచి మద్యనిషేధం మాట రావడం ఇప్పుడు ప్రతిపక్షాలను డీలా పరిచింది. ఈ వ్యవహారంలో ప్రజల పక్షానికి అన్నాడీఎంకేను దూరంగా ఉంచడానికి కరుణానిధి మొదటి నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు. 
 
ఎన్నికలకు భయపడి మద్యనిషేధం అంశాన్ని జయలలిత ప్రకటిస్తారంటూ, అన్నాడీఎంకే మేనిఫెస్టోలో ఆ అంశం ఉన్నా ఆశ్చర్యపోనక్కరలేదంటూ వ్యూహాత్మకంగా కరుణ ప్రకటనలు చేశారు. అయినా ఆ తంత్రం ఫలించకపోవడంతో ఇప్పుడు ఇదంతా రాజకీయ స్టంట్‌, ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆమె దాన్ని మర్చిపోతారంటూ ఆరోపిస్తున్నారు. మద్యనిషేధం అంశాన్ని రాజకీయ లబ్ధికోసమే అన్నాడీఎంకే ప్రస్తావించినట్లు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.