బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By TJ
Last Modified: శనివారం, 18 మార్చి 2017 (16:57 IST)

అమరావతి రాజధాని... సీఎం చంద్రబాబు బురదలో కాలువేసినట్లుందా?

నవ్యాంధ్ర రాజధాని దేశంలోనే గొప్ప రాజధాని, ప్రపంచంలోనే అగ్ర రాజధాని అంటూ ఏపీ ప్రభుత్వ పెద్దలు భారీ ఎత్తున ప్రచారం చేస్తుంటే సహజంగానే ఎవరికైనా అక్కడ ఏదో జరిగిపోతోందన్న భావన కలుగుతుంది. అక్కడకు వెళ్లి స్వయంగా వీక్షించాలన్న ఆలోచన కలుగుతుంది. అలాగే నాకు క

నవ్యాంధ్ర రాజధాని దేశంలోనే గొప్ప రాజధాని, ప్రపంచంలోనే అగ్ర రాజధాని అంటూ ఏపీ ప్రభుత్వ పెద్దలు భారీ ఎత్తున ప్రచారం చేస్తుంటే సహజంగానే ఎవరికైనా అక్కడ ఏదో జరిగిపోతోందన్న భావన కలుగుతుంది. అక్కడకు వెళ్లి స్వయంగా వీక్షించాలన్న ఆలోచన కలుగుతుంది. అలాగే నాకు కూడా ఆసక్తి పెరిగింది. విజయవాడ నుంచి ప్రత్యేకంగా అక్కడకు వెళ్లాను విజయవాడ నుంచి సుమారు 25 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే కానీ ప్రభుత్వం నిర్మించిన తాత్కాలిక సచివాలయ, తాత్కాలిక అసెంబ్లీ ప్రాంగణం చేరుకోలేం. ప్రకాశం బ్యారేజీ దిగగానే కుడివైపు సన్నదారిలో కృష్ణ కరకట్ట మీదుగా ప్రయాణం చేస్తూ వెళితే, అక్కడ, అక్కడ పోలీస్ పోస్టులు కనిపిస్తాయి. అలాగే కృష్ణానది ఒడ్డున గతంలో ఇదే ప్రభుత్వం ప్రకటించిన అక్రమ నిర్మాణాలు కనిపిస్తాయి. 
 
అప్పట్లో నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఈ అక్రమ కట్టడాలుగా ఉన్న భవంతులన్నిటిని కూల్చి వేస్తామని, నదిని పరిరక్షిస్తామని హూంకరించారు. కానీ ఆ భవంతులు అలానే చెక్కుచెదరకుండా వున్నాయనుకోండి. వాటికి సమీపంలోనే సీఎం చంద్రబాబు నాయుడు భవంతి కూడా వుంది. ఆ ఇల్లు దాటుతూ ముందుకు వెళితే ఒక గ్రామం వస్తుంది. ఈ మొత్తం దారి అంతా చిన్న సింగిల్ రోడ్డే. గ్రామం మధ్య గుండా మరికొంత దూరం వెళితే సచివాలయం, అసెంబ్లీలు కనిపిస్తాయి. దారిలో కొన్ని భూములలో పంటలు ఉన్నాయి. 
 
మరికొన్ని భూములలో పంటలు లేవు. వాటి గురించి వాకబు చేస్తే భూములు ఇవ్వని రైతులు తంటాలు పడి కోర్టు ఆర్డర్ తెచ్చుకుని సాగు చేస్తున్నారని చెపుతున్నారు. ఇక ప్రభుత్వ అధీనంలో ఉన్న భూములలో పిచ్చి మొక్కలు మొలుస్తున్నాయి. వాటిని ఎప్పటికప్పుడు కొట్టించడానికి ప్రభుత్వానికి భారీగానే ఖర్చు అవుతోందట. కొద్ది దూరంలో ఎక్స్‌ప్రెస్‌ వే వేయడానికి మట్టి తోలి కనిపిస్తుంది. అది పూర్తయితే అక్కడ వాతావరణం కాస్త మెరుగు అవుతుందేమో మరి! మరోదారి మంగళగిరి నుంచి కూడా ఉంది. అది కొంత డబుల్ రోడ్డుగా ఉంది. నిజానికి ప్రభుత్వం ఏర్పాటు చేసే సచివాలయం సామాన్య ప్రజలందరికి అందుబాటులో ఉండాలి. కానీ ఇది ప్రజలు ఎవరికి అందుబాటులో లేకుండా కట్టారన్న అభిప్రాయం కలుగుతుంది. ఎవరైనా ఇతర జిల్లాల నుంచి ప్రజలు విజయవాడ లేదా గుంటూరుకు చేరుకుని, అక్కడ నుంచి ప్రయాసలకు ఓర్చితే కానీ సచివాలయం చేరుకోలేరు. మూడు పంటలు పండే భూములు తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా తప్పు చేశారని గతంలో విమర్శలు వచ్చాయి. 
 
స్వయంగా ఆ ప్రాంతాన్ని చూసిన తర్వాత నాకు కూడా చంద్రబాబు నాయుడు తప్పు చేశారేమోనన్న భావన కలిగింది. ఎందుకంటే మంగళగిరికి సమీపంలోనే ఐదువేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందట. లేదా నాగార్జున యూనివర్శిటీ పెద్ద ఆవరణ ఉంది. వీటిని కాదని ముఖ్యమంత్రి కొత్తగా పంటలు పండేభూములు తీసుకోవడం ఒక సమస్య అయితే, ప్రధాన రహదారికి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో సచివాలయం ఏర్పాటు చేయడం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ మాట అంటే ఏలినవారికి కోపం రావచ్చు. 
 
మంగళగిరి, యూనివర్శిటీ లేదా గన్నవరం విమానాశ్రయానికి ఎదురుగా ఉన్న మెట్ట ప్రాంతాలను చంద్రబాబు ఎంపిక చేసుకుని ఉంటే ఆ ప్రాంతం అంతా బాగా అబివృద్ధి చెందే అవకాశం ఉండేది. ఆయనకు మంచి పేరు వచ్చేది. కానీ ఆయన అలా చేయకుండా నదికి దక్షిణాన, రెండు నగరాల మధ్య 30 వేల ఎకరాల భూములను ఎంపిక చేసుకున్నారు. ఆయనకు వాస్తు నమ్మకమో, మరే కారణమో కానీ ఆయన అలా చేయడం వల్ల నగరం సహజసిద్ధంగా ఎదగడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయన్న అభిప్రాయం కలుగుతుంది. 
 
ప్రభుత్వం రూపొందించే రకరకాల నగరాల నిర్మాణాలు జరిగితే ఎలా ఉంటుందో కానీ, అవన్నీ అంత తేలిక కాదనిపిస్తుంది ఇక్కడి పరిస్థితి చూసిన తర్వాత. 150 గజాలలో ఒక ఇల్లు కట్టాలంటే మనకే సంవత్సరం దాటిపోతుంది. మరలాంటప్పుడు ఒక నగరాన్ని నిర్మించాలంటే ఎంత సమయం కావాలి...? ఎందుకంటే ఇప్పటికే రెండున్నరేళ్లు గడిచిపోయాయి. ఇక మిగిలింది మరో రెండేళ్లే. ఆ తర్వాత 6 నెలల్లో ఎన్నికలు వచ్చేస్తాయి. అప్పుడు గెలిచేదెవరో ఓడేదెవరో తెలీదు. ఇకపోతే అమరావతి రాజధాని విషయానికి వస్తే... ఇప్పటికిప్పుడు రెండు, మూడు లక్షల మంది జనం వచ్చి అక్కడ భవంతులు కట్టే పరిస్థితి ఉందా అన్నది సందేహమే. ఇదో సమస్య అయితే సచివాలయ భవనాలు పల్లంగా ఉన్నాయని అంటున్నారు.
 
వరద వస్తే ఆ ప్రాంతం అంతా చిత్తడి అవుతుంది. ఈ ప్రాంతాన్ని ఎత్తు చేస్తే చుట్టు పక్కల గ్రామాలు ఇబ్బంది పడతాయి. వీటికోసం మళ్లీ మరో 250 కోట్లతో వరదనీటీని తోడే మోటార్లను ఏర్పాటు చేస్తారట. అడుసు తొక్కనేల, కాలు కడగనేల అన్న సామెతగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయం బురదలో కాలువేసినట్లుగా ఉంది. చంద్రబాబు అమరావతి బ్రాండ్ కోసం ఈ పని చేశారా అన్నట్లుగా అగుపిస్తుంది. ఆ బ్రాండ్ అయితే తన పేరు గుర్తు ఉంటుందని ఆయన భావన కావచ్చు.
 
పోనీ నిజంగానే అమరావతి అంటే అంత విశ్వాసం ఉంటే నిజంగా ఆ పట్టణం ఉన్న చోటుకు, అక్కడి దేవాలయానికి వెళ్లడానికి, అలాగే నాగార్జునుడి పేరిట ఉన్న యూనివర్శిటీలోకి వెళ్లడానికి పాలకులు భయపడతారట. ఇక రైతుల నుంచి తీసుకున్న భూములకు ప్లాట్లు ఇవ్వడం, అందులో ఏవో అక్రమాలు జరుగుతున్నాయన్న వార్తలు రావడం వంటివి జరుగుతున్నాయి. పంట భూములు తీసుకోవడం ఎందుకు, రైతులకు పరిహారం ఇవ్వడం ఎందుకు? ప్రభుత్వ భూములను, అటవీ భూములను వదలి భూ సేకరణ పేరుతో రైతులను ఇబ్బందుల పాలు చేయడం ఎందుకు? ప్రభుత్వంలో అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరగడం కష్టం. అంతదాకా ఎందుకు తాత్కాలిక సచివాలయానికి ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఏడెనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టారు కదా? అయినా నిజానికి అసెంబ్లీలో సదుపాయాలు అంతంతమాత్రంగానే ఉన్నాయనినిపించింది. గ్యాలరీలు సరిపోని పరిస్థితి ఉంది. నిజానికి వీటినే శాశ్వత ప్రాతిపదికన ఇంకా కొంచెం పెద్ద భవనం, అన్ని హంగులతో ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది. 
 
పాలకుల్లోని కొందరు పెద్దలే పొలాలలో ఈ భవనాలను నిర్మించామని, బయటకు వస్తే పాములూగీములూ వస్తాయేమోనని భయం వేస్తుంటుందని అంటున్నారు. మరోవైపు ఇది ప్రపంచంలోనే అత్యంత గొప్ప రాజధాని అవుతుందని అంటారు. దశాబ్దాల తర్వాత ఏమవుతుందో తెలియదు కానీ ఇప్పటికైతే సామాన్యుడికి అందుబాటులో లేని విధంగా రాజధాని నిర్మాణం చేపట్టారన్న అభిప్రాయం కలుగుతుంది. రియల్ ఎస్టేట్ వెంచర్ చేశారా? ఇందులో కుంభకోణాలు జరిగాయా? లేదా ? ఇతరత్రా సమస్యలు వాటన్నిటిని పక్కన బెడితే చంద్రబాబు ఏకపక్షంగా చేసిన రాజధాని ఎంపిక సరైనది కాదన్న అభిప్రాయం కలిగింది. నా భావన తప్పు అయితే సంతోషిస్తాను. కానీ సామాన్యుడికి అందుబాటులో లేకుండా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఏమి సాధిస్తారో, ప్రజలకు ఇది ఎంతమేరకు సాయపడుతుందో తెలియదు.
 
అందుకే చంద్రబాబు చేసిన రాజధాని స్థలం ఎంపిక తప్పేమోనన్న భావన కలిగింది. ఇప్పటికైనా దానిని సరిదిద్దుకునే అవకాశం ఉందని అనిపిస్తుంది. సేకరించిన భూములను పరిశ్రమలు, ఉద్యోగులు, అధికారుల ఇళ్ల నిర్మాణాలు వంటివాటికి వాడుకుని, జాతీయ రహదారికి, ఒకటిరెండు కిలోమీటర్ల దూరంలో సచివాలయం, ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు, హైకోర్టు వంటివి ఏర్పాటు చేస్తే సామాన్యులకు కూడా అందుబాటులో ఉంటుంది. మంత్రిమండలిలోని మంత్రుల్లో కొందరు సచివాలయం పట్ల చిర్రుబుర్రులాడినట్లు వార్తలు కూడా వస్తున్నాయి. మంత్రులకే అలా అసౌకర్యంగా అనిపిస్తే... ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఆలోచిస్తారని మనవి.
 
- ఓ అమరావతి చోదకుడు