శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pyr
Last Modified: సోమవారం, 27 ఏప్రియల్ 2015 (20:00 IST)

గోవిందా.. గోవిందా...! కొండపై ఇక అందరూ విఐపీలే.. ఒత్తిళ్లకు తలొగ్గిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ భారీ పాలకమండలిని తిరుమల తిరుపతి దేవస్థానం నెత్తిన పెట్టింది. సాధారణంగా సభ్యులు తక్కువగా ఉన్నప్పుడే విఐపిల తాకిడిని తట్టుకోవడానికి అధికారులు నానా అగచాట్లు పడేవారు. ఇక జంబో బోర్డు ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందో చూస్కోండి. జంబో బోర్డును చూస్తే చంద్రబాబుపై తీవ్ర ఒత్తిడి వచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇటు వ్యాపార వర్గాలు, రాజకీయ వర్గాల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగానే జంబో బోర్డును నియమించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. 
 
తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నియామకం చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోంది. సాధారణంగా ఇందులో 11 మంది సభ్యులు ఉంటారు. వీరు కాకుండా తుడా ఛైర్మన్, దేవదాయ శాఖకు చెందిన అధికారులు, టిటిడి ఈవోలు కూడా సభ్యులుగా చేరిపోతారు. ఇఫ్పటికే 22 సభ్యులతో కూడా బోర్డును ప్రభుత్వం ప్రకటించనుంది. చైర్మన్గా టీడీపీ మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తిని నియమించనున్నారు.
 
మరో 22 మంది సభ్యుల పేర్లను ప్రకటించనున్నది. వీరు కాకుండా ఎక్స్ అఫిసియో కింద తుడ ఛైర్మన్, మెంబర్ సెక్రటరీ కింద టిటిడి ఈవో, దేవాదాయ శాఖ నుంచి ఒకరు సభ్యులుగా ఉంటారు. వీరందరూ, ఛైర్మన్తో 25 మంది బోర్డులో సభ్యులుగా ఉంటారు. ఒత్తిడిన తప్పించుకోవడానికన్నట్లు చంద్రబాబు చాలా కాలం బోర్డు నియామకాన్ని వాయిదా వేశారు. అయితే జాప్యం చేసే కొద్ది ఆయనపై మరింత ఒత్తిడి పెరిగి, టిటిడి బోర్డు కొండవీటి చాంతాడంత అయిపోయింది. సోమవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మేరకు ఉత్వర్వులు జారీ చేసింది. 
 
టీటీడీ కార్యవర్గంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత్రి నీతా అంబానీకి చోటు కల్పించారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే భారతీయ జనతాపార్టీతో తమ సంబంధాలు ఎలా ఉంటాయోనని బోర్డు నియామకాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. దీంతో సొంత పార్టీ నుంచి కూడా ఒత్తి పెరిగి పోవడంతో చివరకు బోర్డును ప్రకటించనున్నారు. అయితే బోర్డు కాల పరిమితి మాత్రం ఏడాదికి మాత్రమే పరిమితం చేశారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కారణంగా చదలవాడకు చంద్రబాబు ఛైర్మన్ పదవి ఇవ్వక తప్పలేదు.
 
అయితే ఇక్కడ మిగిలిన సభ్యులను గమనిస్తే, ఎక్కవగా వ్యాపార, రాజకీయ రంగాలకు చెందిన వారికే ఎక్కువగా ప్రాధాన్యత కల్పించినట్లు ప్రత్యేకంగా ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేకుండా తెలిసిపోతుంది. రిలయన్స్ అధినేతలకు సాధారణంగా రెడ్ కార్పెట్ పరిచి దర్శనం కల్పిస్తారు. అయితే ఇక్కడ ఆలయ దర్శనంలో ఉన్న అర్థం పరమార్థం ఏంటో వారికి స్పష్టంగా తెలుసు. కాబట్టి అంబానీలు నేరుగా ఛైర్మన్ గిరికే ఎసరు పెట్టారు. అయితే రాజకీయ ఒత్తిళ్తతో చంద్రబాబు వారిని కేవలం సభ్యత్వానికి మాత్రమే పరిమితం చేయగలిగారు. 
 
ఇక భారతీయ జనతా పార్టీ నుంచి కూడా భారీ ఎత్తున ఒత్తిడి రావడంతో బోర్డును 11 నుంచి ఏకంగా 21 పెంచేశారు. ఛైర్మన్ కాకుండా మరో పది మందికి బోర్డులో స్థానం కల్పించి అందరిని సంతృప్తి చేసే ప్రయత్నం చేశారనేది స్పష్టం అవుంతోంది. 
 
టీటీడీ సభ్యులు వీరే: నీతా అంబానీ, బాల వీరాంజనేయ స్వామి, పిల్లి అనంతలక్ష్మి, కోళ్ల లలిత కుమారి, రవి నారాయణ్, శ్యాం సుందర్ శివాజీ, వై. శ్రీనివాస స్వామి, బోండా ఉమామహేశ్వర రావు, గన్ని ఆంజనేయులు, పి.రమణ, హరిప్రసాద్, ఆకులు సత్యనారాయణ (బీజేపీ), భాను ప్రకాశ్ (బీజేపీ), కే రాఘవేంద్రరావు, దండు శివరామరాజు, శేఖర్, వైటీ రాజా, సుధాకర్ యాదవ్,  తెలంగాణ నుంచి.. చింతల రామచంద్రా రెడ్డి (బీజేపీ), గడ్డం సాయన్న, సండ్ర వెంకట వీరయ్య, తమిళనాడు నుంచి కృష్ణమూర్తిలను నియమించినట్టు సమాచారం.