శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: మంగళవారం, 28 అక్టోబరు 2014 (12:17 IST)

చిదంబరం కొడుకుతో రజినీకాంత్ చర్చలు... భాజపాకు సూపర్ షాక్

కమలనాధులు ఉత్తరాదిన మహా పవర్ ఫుల్ గా ముందుకు వెళ్లగలుగుతున్నారు కానీ దక్షిణాదిలో మాత్రం వల్లకావడంలేదు. కర్నాటకలో పాగా వేసినప్పటికీ మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప మైండ్ గేమ్ తో చేతులారా పీఠాన్ని వదిలేసుకోవాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు వారి చూపు దక్షిణాదిలో అత్యధిక పార్లమెంటు స్థానాలు కలిగిన తమిళనాడుపై పడింది. మరీ ఇప్పుడు జయలలిత కోర్టు కేసుల్లో ఇరుక్కుని విలవిలలాడుతుండగా, డీఎంకే చుక్కాని లేని నావలా నడిసముద్రంలో ఉన్నట్లు ఉంది. 
 
ఈ స్థితిని తమకు అనుకూలంగా మలచుకోవాలని కమలనాధులు ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తమిళనాట టాప్ ఫాలోయింగ్ ఉన్న రజినీకాంత్ తో అనుకున్నది నెరవేర్చుకోవాలని కలలు కంటున్నారు. కానీ రజినీకాంత్ మాత్రం తనదైన శైలిలో వారికి ఎంతమాత్రం అర్థంకావడంలేదు. మాజీ ముఖ్యమంత్రి ఆస్తుల కేసులో బెయిలుపై తిరిగి రాగానే అందరికంటే ముందుగా ఓ ఉత్తరం రాశారు. 
ఆమె ఆయురారోగ్యాలతో వర్థిల్లాలంటూ కోరుకున్నారు. దాన్ని లైట్‌గా తీసుకున్న భాజపా రజినీకాంత్ పై అలాగే ఆశలు పెట్టుకుంది. ఐతే తాజాగా రజినీకాంత్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, గత యూపీఎలో హోంమంత్రిగా చేసిన చిదంబరం కుమారుడు కార్తీని పిలుపించుకుని చర్చలు జరపడంతో భాజపా నాయకులు రజినీ వైఖరితో విసిగివేసారి పోయినట్లు సమాచారం. ఇక రజినీకాంత్ ఊసే ఎత్తకూడదన్న నిర్ణయానికి వచ్చినట్లు చెపుతున్నారు. 
 
సుబ్రహ్మణ్యస్వామి అయితే ఇకనైనా రజినీకాంత్ జపం చేయడం మానేయండి అంటూ భాజపా రాష్ట్ర నాయకులకు సూచన చేశారు. మొత్తమ్మీద రజినీకాంత్ వ్యవహారం భాజపాకు మింగుడుపడటంలేదు. మరి దక్షిణాది తమిళనాడులో 2016 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఎలాంటి వ్యూహరచన చేస్తారో వేచి చూడాల్సిందే.