గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By PYR
Last Updated : బుధవారం, 1 జులై 2015 (16:30 IST)

కేసీఆర్ గప్‌చుప్...! ఎందుకు..? అసలుకే ఎసరు వస్తుందనా...!?

కేసిఆర్ అంతటివారు లేరు. ఆయన పట్టుకుంటే దేనిని వదలరు. ఎదుటి వారిని ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించగలరనే పేరుంది. మరి ఎందుకు ఓటుకు నోటు కేసులో ప్రస్తుతం మౌనం పాటిస్తున్నారు. అయితే ఫామ్ హౌజ్, లేదంటే క్యాంపు కార్యాలయానికే పరిమితమయ్యారు. చేతికి చిక్కిన బాబును ఏమీ చేసుకోలేక ఢీలా పడిపోయనట్లు కనిపిస్తున్నారు. దీని వెనుక కారణమేంటి. రాజకీయ అభినవ చాణుక్యుడు చంద్రబాబు తన అస్త్రాలకు పని చేప్పారా...! కేసీఆర్‌ను చక్రబంధంలో ఇరికించారా...! నోరు తెరిస్తే అసలుకే మోసం వచ్చేలా చేశారా...? పరిస్థితులు చూస్తుంటే అదేననిపిస్తోంది. 
 
అధికారం వుంది కదా అన్నీ జరిగిపోతాయని కేసీఆర్ అనుకున్నట్లున్నారు. అక్కడే చంద్రబాబును తక్కువ అంచనా వేసారు. బాబు శక్తియుక్తులను బేరీజు వేసుకోవడంలో పొరబడ్డట్లుంది. ఏదో చంద్రబాబు నాలుగు మాటలు మాట్లాడిన ఆడియో రికార్డింగ్ దొరికిందని, రూ.యాభై లక్షలు పట్టుకుని, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వీడియో సాక్షిగా దొరికేసాడు కదా..ఇంకేముంది.. అంతా అయిపోయిందని టీఆర్ఎస్ అనుకుంది. అదే సమయంలో తన అనుచరగణమే కాకుండా ఆయన కూడా హద్దులు మీరి మాట్లాడారు. అంతకుమించి ఆడియో, వీడియో టేపులను విడుదల చేశారు. అదే వారిని మరింత మేలుకొనేలా చేసింది. 
 
ఎక్కడో టూర్‌లో రాజధాని నిర్మాణం కోసం బిజీబిజీగా ఉన్న చంద్రబాబును కదిపారు. ఆయన నేరుగా ఉమ్మడి రాజధాని, దేశరాజధానిల మధ్య రెండు పర్యటనలు చేయడమే ఆలస్యం. సెక్షన్ 8, ట్యాపింగ్ పావులను కేసీఆర్ ముందు పెట్టారు. దీంతో కేసీఆర్ వెనుకడగు వేయాల్సి వస్తోంది. ఇక అప్పటినుంచి కేసీఆర్ నోట మాట రావడం లేదు. అంతకు మునుపు ఆంధ్రోళ్లు, ఆంధ్రోళ్లు అని రెచ్చిపోయిన కేసీఆర్ మాట్లాడలేకున్నారు.. ఎందుకు..? 
 
అంటే హైదరాబాద్‌లో అల్లర్లు మొదలైతే అందుకు ఎవరిది బాధ్యత? తెలంగాణ ప్రభుత్వం చేతగాని తనమే అవుతుంది. పోనీ ఉద్యమాలు చేస్తే అధికారంలో ఉండి ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఉద్యమం చేసినట్లు అవుతుంది. పోనీ చంద్రబాబు నోటీసులిస్తే సెక్షన్ 8, షెడ్యూల్ 9,10 మరింత ఊపందుకుంటాయి. ఇవన్నీ కేసీఆర్ చుట్టూనే తిరుగుతాయి. ఇలాంటి పరిస్థితులో కేసీఆర్ నోరు మెదపలేక ఇటు ఫామ్‌హౌజ్‌లో అల్లం సాగుకో... క్యాంపు కార్యాలయంలో సాదాసీదా రాజకీయాలకు పరిమితం కాకతప్పలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.  
 
తెలంగాణ ఏసీబీ అరిచి గీపెట్టుకున్నా రేవంత్ రెడ్డి బెయిల్‌పై బయటకు వచ్చేశాడు. కేసుల్లో కీలకమైన మత్తయ్య ఏమయ్యాడో కనుక్కోవడం వీలుకాలేదు. సండ్ర తిన్నగా ఇప్పుడు హాజరవుతానంటూ లేఖ రాశారు. మరీ ఈ స్థితిలో ఏం చేయాలి? పోనీ చంద్రబాబు మీదకు దూకుదామంటే సెక్షన్ 8తో అసలు మీకు లా అండ్ ఆర్డర్ పవర్స్ లేకుండా చేస్తా అన్నట్లు హడావుడి చేసారు. ట్యాపింగులపై సిట్ ఏర్పాటు చేసి అంతు తేలుస్తామంటున్నారు.  దీంతో ఇదేదో మొదటికే మోసం వచ్చేట్టు వుంది అని కేసిఆర్ మిన్నకుండిపోయారనే వాదన వినిపిస్తోంది.