గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Selvi
Last Updated : సోమవారం, 19 అక్టోబరు 2015 (12:38 IST)

జగన్ కంటే కేసీఆరే బెటర్: శంకుస్థాపనకు వెళ్ళకపోతే.. జగన్ ఒంటరే!

అమరావతి రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని ఇద్దరు చంద్రుల్ని కలిపింది. శంకుస్థాపన కార్యక్రమానికి రావాల్సిందిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించడం శుభపరిణామంగా మారింది. అయితే వీరిద్దరి కలయిక వల్ల వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఒంటరి అయ్యాడు. అమరావతి శంకుస్థాపనకు పిలిచినా రానని జగన్ చెప్పడంతో ఆయనపై ప్రజా వ్యతిరేక భావాలు ఏర్పడిపోయాయని.. అదే కేసీఆర్ చంద్రబాబు పిలవడమే తరువాయిగా తప్పకుండా వస్తానని చెప్పడం ద్వారా ఇరు రాష్ట్రాల మధ్య భవిష్యత్తులో సత్సంబంధాలు ఏర్పడే సూచనలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
 
పక్క రాష్ట్రంతో మంచి సంబంధాల్ని మెరుగుపరుచుకోవడం ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు సులభంగా పూర్తవుతాయని వారు చెప్తున్నారు. చారిత్రాత్మక ఈ ఘట్టంలో జగన్ పాలుపంచుకోకపోతే.. తప్పకుండా చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడని ఇప్పటికే టీడీపీ మంత్రులు మండిపడుతున్న తరుణంలో.. చంద్రబాబు, కేసీఆర్ ఏకమైతే జగన్ రాజకీయ భవిష్యత్తుకు ఎసరు తప్పదని విశ్లేషకులు సూచిస్తున్నారు. 
 
ప్రతిపక్ష నేతగా తప్పులు కనిపెట్టుకుంటూ కూర్చుని.. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు వంత పాడకపోతే.. ఆయనకు కష్టకాలం తప్పదని.. విపక్ష నేత హోదాలో అమరావతి శంకుస్థాపనకు వెళ్ళడమే ఆయనకు మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు. లేకుంటే ఆయన ఒంటరిగా మిగిలిపోవడం ఖాయమన్నారు. 
 
ఏపీ ప్రజల కోసమైనా శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్ళాలని.. అలా వెళ్ళకపోతే.. జగన్ రాష్ట్రానికి, అభివృద్ధికి వ్యతిరేకంగా వ్యవహరించినట్లే అవుతుందని రాజకీయ పండితులు అంటున్నారు. కానీ అమరావతి శంకుస్థాపనకు వస్తానని కేసీఆర్ చెప్పడం ద్వారా జగన్ కంటే బెటరనే మంచి పేరు కొట్టేశారు. ఆంధ్రుల్ని తిట్టినా.. మంచి కార్యం జరుగుతుంటే.. అదీ చంద్రబాబు వచ్చి ఆహ్వానిస్తే వెంటనే వచ్చేస్తానని సానుకూలంగా స్పందించారు. దీన్ని బట్టి జగన్ కంటే కేసీఆరే బెటరని అందరూ అంటున్నారు. మరి జగన్ అమరావతి కార్యక్రమానికి వెళ్తారో? లేదో? వేచి చూడాల్సిందే.