శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: మంగళవారం, 15 సెప్టెంబరు 2015 (12:22 IST)

కేసీఆర్ షాక్... ఆంధ్రకు 2వ స్థానమా...? తెలంగాణకు 13 స్థానమా... అరె ఏందిర భయ్ ఇది...?!!

ప్రపంచ బ్యాంకు ర్యాంకింగులతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు షాక్ తినే ఉండవచ్చు. ఆదాయంలో గుజరాత్ రాష్ట్రం తర్వాతి స్థానాన్ని ఆక్రమించిన తెలంగాణ, పెట్టుబడులు పెట్టేందుకు అనువైన రాష్ట్రాల జాబితా విషయానికి వచ్చేసరికి 13వ స్థానానికి పడిపోయింది. అలాగే విభజన దెబ్బతో ఆదాయంలో అధఃపాతాళానికి పడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడుల అనుకూలత కలిగిన రాష్ట్రాల్లో రెండో స్థానంలో నిలిచి ఆశ్చర్యపరిచింది. 
 
ఇపుడీ స్థానాలను చూసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టలేని ఆనందంతో ఉన్నారు. ఐతే అదేసమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం షాక్ తిన్నట్లు సమాచారం. ఇప్పుడిప్పుడే పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇమేజ్, ప్రపంచ ర్యాంకింగుల జాబితా డ్యామేజ్ చేసేట్లుగా ఉన్నదన్న చర్చ జరుగుతోంది. అత్యుత్తమ పారిశ్రామిక పాలసీ తమదే అంటూ చెప్పుకుంటున్న కేసీఆర్‌కు ఇది గట్టి దెబ్బే అని అంటున్నారు. 
 
చెైనా పర్యటన ముగించుకుని వస్తున్న కేసీఆర్‌ను ఈ జాబితా వెక్కిరించేదిగా ఉన్నదని చెప్పక తప్పదు. దేశంలో పరిశ్రమల స్థాపనకు అనువుగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణకు 13వ స్థానం ఇవ్వడాన్ని చూస్తే కేసీఆర్ కేవలం మాటలకే పరిమితమయ్యారు తప్ప చేతల్లో పగడ్బందీగా చేసింది లేదన్న వాదనలు వినబడుతున్నాయి. ఇదిలాగే కొనసాగితే తెలంగాణకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని విశ్లేషకులు అంటున్నారు. మరి రాబోయే జాబితాల్లో అయినా తెలంగాణ తన స్థానాన్ని మెరుగుపరుచుకుంటుందేమో చూద్దాం.