శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : శుక్రవారం, 2 అక్టోబరు 2015 (13:35 IST)

గవర్నర్‌తో కేసీఆర్ వరుస భేటీల పర్వం.. పలువురు మంత్రులపై వేటుకేనా?

తన మంత్రివర్గంలోని కొందరు మంత్రుల పనితీరు పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల్లో చిన్నపాటి సమస్యను కూడా సమర్థవంతంగా డీల్ చేయలేక పోతున్నారనే అభిప్రాయంతో ఉన్నారు. దీంతో అలాంటి మంత్రులపై వేటు వేసేందుకు ఆయన నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగానే గవర్నర్ నరసింహన్‌తో ఆయన వరుస భేటీలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. 
 
నిజానికి ఇప్పటివరకు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆది నుంచి అధికార పార్టీ పైచేయి సాధిస్తూ వచ్చింది. మొదట ఐదు రోజులే సభను నిర్వహించాలని అధికార పార్టీ భావించినా.. ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి రాకముందే... పది రోజులు అసెంబ్లీ నిర్వహించటానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. ప్రతిపక్షాలు ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు సభ నిర్వహించి తీరుతామంటూ ప్రకటన చేసీ మరీ దూకుడుగానే వ్యవహరించింది.
 
అంతేకాదు బీఏసీ సమావేశాల్లో ప్రతిపక్షాలు అజెండా కోసం పట్టుబడతాయి. కానీ సీఎం కేసీఆర్ రావటం రావటమే.. ఏ రోజు ఏం చర్చిద్దాం... రైతుల సమస్యల మీద చర్చిద్దాం.. మొదటి రెండు రోజులు ఇదే అంశం పెట్టేయండి అని స్పష్టంచేశారు. అధికార పార్టీ దూకుడు చూసి ప్రతిపక్షాలు విస్మయాన్ని వ్యక్తం చేశాయి కూడా. 
 
రెండు రోజుల చర్చ తర్వాత ప్రతిపక్షాలు... పంట రుణాల్ని ఒకే సారి మాఫీ చేయాలన్న డిమాండ్ చేస్తూ నిరసనలకు దిగాయి. సభ వాయిదా పడినా... సభలోనే అన్ని పార్టీలు కలిసి నిరసన స్వరం వినిపించాయి. ఈ విషయంలో తెరాస మంత్రులంతా విఫలమయ్యారు. పైగా.. ఒకేసారి రుణమాఫీ సాధ్యం కాదని సీఎం కేసీఆర్ ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం విపక్ష సభ్యులను మంత్రులు సరిగా డీల్ చేయలేకపోయారన్న భావనలో కేసీఆర్‌లో పడింది. అన్ని రకాలుగా ప్రభుత్వం ముందుకు వచ్చినా... ప్రతిపక్షాలను కట్టడి చేయటంలో విఫలమయ్యారన్న భావనలో ఉన్నట్టు తెలిసింది. 
 
చివరికి ఓ పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానం విషయంలో కూడా మంత్రులు అనుకున్నంత ప్రతిభను ప్రదర్శించలేక పోయారనే భావనలో ఉన్నట్టు తెలుస్తోంది. రుణమాఫీపై బీజేపీ నేతలను తెరాస మంత్రులు ప్రశ్నించటం... దీనికి ప్రతిగా మీరు మమ్మల్ని అడిగి రుణమాఫీ చేస్తామన్నారా అని బీజేపీ సభ్యులు నిలదీయడంతో తెలంగాణ సర్కారు ఇరకాటంలో పడినట్టయింది. 
 
ఇలాంటి అనేక విషయాలు కేసీఆర్‌కు అసంతృప్తిని కలిగించినట్టు సమాచారం. అందుకే అలాంటి మంత్రులపై వేటు వేయాలని నిర్ణయానికి వచ్చారని, అందుకే గవర్నర్‌తో వరుస భేటీలు నిర్వహిస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదేసమయంలో సోమవారం వరకు అసెంబ్లీకి సెలవు కావడంతో ఈ లోపు ఎలాంటి పరిణామాలు అయినా చోటుచేసుకోవచ్చని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.