గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By IVR
Last Modified: గురువారం, 10 జులై 2014 (16:35 IST)

ఖమ్మం జిల్లాలో చక్రం తిప్పుతున్న గులాబి బాస్... తెదేపాకు దెబ్బ తప్పదా...

ఖమ్మం జిల్లా రాజకీయాలలో మార్పులు రానున్నాయా? ముఖ్యంగా కొత్తగూడెం నియోజకవర్గ తెలుగు తమ్ముళ్ళ చూపు కారు వైపు మళ్ళుతుందా? మొదట నుండి పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న కోనేరు కుటుంబం గులాబీ కండువా కప్పుకోవాలని చూస్తున్నారా? నామా వర్గంతో కలిసి నడుస్తున్న కోనేరు వర్గం ఇప్పుడు ఎందుకు టిడిపిని వీడాలని అనుకుంటున్నారు? అసలు ఖమ్మం రాజకీయం ఎటువైపు వెళుతుంది? అన్నది జిల్లా రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. 
 
ఖమ్మం జిల్లా తెలుగుదేశం రాజకీయాలు కాస్త కొత్తగా ఉంటాయి. నిజానికి అక్కడ టిడిపి సీనియర్ నేతలు నామా నాగేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు, కోనేరు నాగేశ్వరరావు ముగ్గురు ఎవరికివారు రాజకీయాలను నడపడంలో దిట్ట. అయితే జిల్లా సంగతి ఎలా ఉన్నా కొత్తగూడెం నియోజకవర్గం జిల్లాలో చాలా కీలకంగా ఉంటుంది.
 
అంతకుముందు పాల్వంచ నియోజకవర్గంలో ఉన్న కొత్తగూడెం 1978లో కొత్త నియోజకవర్గంగా మారింది. 1978 నుంచి కొత్తగూడెం నియోజకవర్గానికి ఏడుసార్లు ఎన్నికలు జరగ్గా.. టిడిపి పక్షాన కోనేరు నాగేశ్వరరావు మూడుసార్లు గెలుపొందారు. 1985లో జరిగిన ఎన్నికల్లో కోనేరు నాగేశ్వరరావు టీడీపీ తరపున పోటీచేయగా, ఆయన సమీప అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి సుధాకర్‌రెడ్డిపై విజయం సాధించారు. 
 
ఆ తరవాత 1989లో ఓడిపోగా 1994లో కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావుపై భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత కోనేరుకు పార్టీ టిక్కెట్ దక్కలేదు. మళ్ళీ 2004లో ఓడిపోయినా కోనేరుకి అక్కడ నుండి రాజకీయంగా ఆధిపత్యం కోల్పోయారు. ఇక 2009లో పొత్తులో కొట్టుకుపోగా మొన్నటి ఎన్నికలలో కోనేరు తనయుడు కోనేరు సత్యనారాయణకు(చిన్ని) టీడీపీ టిక్కెట్ ఇచ్చారు. అయితే కుమారుడు కూడా ఓడిపోయాడు.
 
ఎన్టీఆర్ హయాంలో ఓ వెలుగు వెలిగిన కోనేరు వర్గం 1989లో అన్నగారి క్యాబినెట్‌‌లో మంత్రిగా పనిచేశారు. 1995లో తెలుగుదేశం సంక్షోభ సమయంలో కూడా ఎన్టీఆర్ పక్షాన ఉన్న కోనేరు ఎన్టీఆర్ తెలుగుదేశం పక్షాన ఖమ్మంలో లోక్‌ సభకు పోటీచేసి ఓడిపోగా.. ఆ తర్వాత తిరిగి అధికార తెలుగుదేశంలో చేరిపోయారు. అయితే కాలం గడిచేకొద్ది పార్టీలో నామా, తుమ్మల హవా కొనసాగడంతో పాటు 2004 నుండి కోనేరు పార్టీలో ప్రభావం కోల్పోతూ వచ్చారు. 
 
మొన్నటి ఎన్నికల సమయంలో కూడా కోనేరు వర్గం నామా వర్గంలో కలిసి తుమ్మల మీద రాజకీయ ఆధిపత్యం కొనసాగించాలని చూశారు. అయితే ఇంత చేసినా పార్టీ అధిష్టానం వద్ద తుమ్మల, నామాల రాజకీయాలను తట్టుకోలేకపోయారు. అయితే ఇప్పుడు తెరాస పార్టీ ఖమ్మంలో పాగా వేయడానికి కోనేరును తనవైపుకు తిప్పుకోవడానికి ప్రయత్నాలను చేస్తుంది. సీనియర్ నేతగా.. ఎన్టీఆర్ హయాం నుండి వ్యక్తిగా ఓ ఇమేజ్ ఉన్న కోనేరును పట్టి పార్టీని పటిష్టం చేయాలన్నది గులాబీ నేతల ఆలోచన. కెసిఆర్ ఇప్పటికే ఆ దిశగా పావులు కదపడానికి ప్రయత్నాలు మొదలుపెట్టడంతో జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఇదే జరిగితే టిడిపికి కొంత దెబ్బతప్పదనే చెప్పాలి!