శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Eswar
Last Modified: గురువారం, 10 జులై 2014 (20:52 IST)

మానని గాయం... నిప్పుల కుంపటిపై కోనసీమ...

నగరం గ్యాస్ పైపులైన్ పేలుడు ఘటనలో ఆరని మంటలు, మానని గాయాలు, నేటికి భయంతో  వణికిపోతున్నా ప్రజలు. కంటిపై కనుకు లేకుండా గడుపుతున్న రాత్రులు, 12 రోజులు గడిచినా  ఆనాటి మృత్యు ఘోష కళ్ల ముందే కదలాడుతోంది. గ్యాస్ పైపులైన్ పేలుడు ఘటనతో నేటికి వణికిపోతూ నిప్పు కుంపటిపై ఉన్న కోనసీమపై వెబ్ దునియా స్పెషల్ రిపోర్టు.
 
కొనసీమ వ్యాప్తంగా సుమారు 275 గ్రామాలు ఉన్నాయి. ఇవి ఈ ప్రాంతంలో దాదాపు 2వేల కిలో మీటర్ల మేర ఉన్నాయని అంచనా. నివాస స్థలాల మధ్య పాఠశాలలకు, ఇళ్లకు సమీపంగా పైపులైన్లు ఉన్నాయి. 20 ఏళ్ల కాలం నాటి వైపులైన్లే నేటికి వినియోగిస్తున్నారు. వీటికి ఎక్కడైనా  లీకులు ఏర్పడితే, అదీ గ్యాస్ వాసన వస్తుందని గ్రామస్తులు పలుమార్లు చెబితే తప్ప మరమ్మతులు చేస్తున్నారు తప్ప కొత్తవి ఏర్పాటు చేయడంలేదు.
 
ఈ మంటలు ఆగేదెన్నడు 
1992లో మలికిపురం మండలం శంకరగుప్తంలో చమురు సంస్థలకు చెందిన గొట్టం లీకై ఆవిరి  పైకి ఎగజిమ్మింది. 1993లో మామిడికుదురు మండలం కొమరాడలో పెద్ద బ్లో అవుట్ జరిగింది.  1995లో అల్లవరం మండలం దేవర్లంకలో పాశర్లపూడి బావిలో జరిగిన బ్లో అవుట్ ప్రపంచంలోనే  అతిపెద్ద రెండో బ్లో అవుట్‌గా చరిత్రకెక్కింది. సుమారు 65 రోజుల పాటు పెద్దఎత్తున మంటలు  ఎగసిపడ్డాయి. 1997లో రావులపాలెం మండలం దేవరపల్లిలో, 2005లో అమలాపురం మండలం తాండవపల్లిలో బ్లో అవుట్‌లు సంభవించాయి. 
 
2007, 2009లో మామిడికుదురు, సఖినేటిపల్లి, మలికిపురం మండలాల్లో పెద్దఎత్తున గ్యాస్ పైపులైన్లు లీకేజీలు ఏర్పడ్డాయి. తిరిగి 2010లో  రాజోలు మండలం పొన్నమండలంలో ఆయిల్ పైపులైన్ లీకై పెద్దఎత్తున మంటలు చెలరేగాయి.  తరువాత 2012 తాటిపాక గెయిల్‌కు సమీపంలోనే పైపులైన్లు లీకయ్యాయి. ఇలా నిత్యం ఏదో ఒక మూలన లీకవుతూ కోనసీమ  ప్రజలను భయాభ్రాంతులకు గురిచేస్తున్నాయి. 
 
విదేశాల్లో పటిష్టమైన చర్యలు 
చమురు క్షేత్రాలకు ప్రసిద్ధి చెందిన గల్ఫ్ దేశాల్లో సహజ వాయువుల వెలికితీత  పెద్దఎత్తున  కొనసాగుతున్నప్పటికీ, అక్కడ ప్రమాదాలు కేవలం రెండు శాతం మాత్రమే అంటే  ఆశ్చర్యపోవాల్సిందే. అక్కడ కోకొల్లలుగా బావులపై నిత్య పర్యవేక్షణతో ప్రమాదాల స్థాయిని  బాగా తగ్గించాయి. కోనసీమలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రధానంగా చమురు సంస్థల  నిర్లక్ష్యం మూలంగా లీకేజీలు, ప్రమాదాలు నష్టాలు నిత్యకృత్యమవుతున్నాయి. స్థానికంగా ఆ  పరిస్థితి చెయ్యి దాటి ప్రాణాలు హరించే స్థాయికి చేరింది. ఈ పరిస్థితి కోనసీమలో మరీ  దారుణంగా ఉంది. 
 
నిబంధనలు అతిక్రమణ 
నిబంధనలు ప్రకారం గొట్టాల ప్రమాణం, వాటిలో  సరఫరా అయ్యే పీడనం ఆధారంగా 1 పాయింట్ 5 అడుగుల నుంచి 5 అడుగుల లోతున భూమిలో ఏర్పాటు చేయాలి. కానీ తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం అనేకచోట్ల ఇవి భూ ఉపరితలంపైన, తక్కువ లోతులోనే ఉన్నాయి. దీంతో  గ్రామాల్లో వ్యవసాయ పనులు, కాల్వ పనులు, పంట పొలాల పనులు చేస్తున్న సమయంలో  గొట్టాలు బయటపడుతున్నాయి.
 
దీంతో అవి లీకేజీలకు గురవుతున్నాయి. పైకి కనిపిస్తున్న గొట్టాల నుంచి చమురును చోరీ చేసే  ముఠాలు కూడా కోనసీమలో ఎక్కువగా విస్తరిస్తున్నాయి. గొట్టాల్లో తీవ్రమైన పీడనంతో సరఫరా  అవుతున్న సమయంలో అటువంటి చోట్ల ముడి చమురు ఒత్తిడికి లోనై దానికి రెండింతల 
శక్తితో లీకవుతూ ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి.
 
పాపం రైతన్నలు 
మలికిపురం. సఖినేటిపల్లి, మామిడికుదురు, అల్లవరం, రాజోలు మండలాల్లో సరుగుడు, కొబ్బరి తోటలు, వరి పొలాల మధ్యగా పైపులైన్లు వెళ్లడంతో ఆయా ప్రాంతాల్లో రైతులు సాగు చేసేందుకు భయపడుతున్నారు. దీంతో ఏటా 50 కోట్ల రూపాయాల పైబడి దిగుబడి తగ్గుతుందని అంచనా.  కోనసీమలోని సముద్ర తీరప్రాంతంలో 16 గ్రామాల్లో సుమారు 10 వేల ఎకరాల మేర  సరుగుడు  తోటలు విస్తరించి ఉన్నాయి. చమురు సంస్థల కార్యకలాపాల వల్ల ఏటా కనీసం 5 వందల ఎకరాల్లో సరుగుడు తోటలు ఎందుకు పనికిరాకుండా పోతున్నాయని ఒక అంచనా.
 
20 ఏళ్ల నుంచి ఆయా చమురు సంస్థలకు లీకేజీల వల్ల ఏర్పడిన నష్టం 6 వందల కోట్ల  రూపాయాలు దాటితే.. కోనసీమ  ప్రాంతానికి చెందిన నిపుణులు, రైతులు, ప్రజలు, అంచనా  వేసిన నష్టం 2 వేల కోట్ల రూపాయాల పైబడి ఉంటుందని అంటున్నారు. 
 
భయం గుప్పెట్లో కోనసీమ ప్రజలు 
నగరంలో గెయిల్ గ్యాస్ పైపులైన్ పేలుడు ఘటన జరిగి పన్నెండు రోజులు దాటినా ఇంకా ఈ  ప్రాంతంలో శోకాగ్ని ఆరలేదు. ఆనాటి మృత్యుఘోష స్థానికుల కళ్ల ముందే కదలాడుతోంది. పైకి  ఎగిసిపడిన అగ్నికీలలు, దహనమవుతున్న ఇళ్లు, కొబ్బరి చెట్లు, రోడ్ల పక్కనే సజీవ దహనమైన పడి ఉన్న మృతదేహాలు. ఇలా ఆనాటి భయానక దృశ్యాలు ప్రతి మదిని తొలిచేస్తున్నాయి. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 21 మంది చనిపోయారు.
 
మరో 16 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీనితో వీరి కుటుంబీకులు, బంధువులు  ఆందోళన చెందుతున్నారు. ఏ సమయాన ఏ దుర్వార్త వినాల్సి వస్తుందోనన్న ఆవేదన వారిలో  కనిపిస్తోంది. ఘటన జరిగిన రోజు చెట్టుకొక్కరు, పుట్టకొక్కరు వెళ్ళిన వారు మళ్ళీ గూటికి  చేరలేదు. కొందరు సజీవ దహనం కాగా, మరికొందరు కాలిన గాయాలతో  హాస్పటల్స్ లోనే గడుపుతున్నారు. ఇంతవరకు ఒక్క కుటుంబం కూడా ఇక్కడకు తిరిగి రాలేదు. వారు మళ్ళీ  అక్కడ ఇల్లు కట్టుకుని ఉండలేని పరిస్థితి. ఆ రోడ్డువైపు వెళితేనే భయం. ప్రభుత్వమే తమను  ఆదుకోవాలని కోరుతున్నారు.
 
 
ఆ మూడు కుటుంబాల్లో ఏ ఒక్కరూ మిగల్లేదు 
ఈ దుర్ఘటనలో మూడు కుటుంబాలకు చెందిన ఏ ఒక్కరూ మిగల్లేదు. ఈ కుటుంబాలకు  చెందిన మొత్తం 13 మందిని మృత్యు అగ్ని కబళించింది. మరో ఎనిమిది మంది కాలిన  గాయాలతో చికిత్స పొందుతూ మృత్యువాతపడ్డారు. వీరంతా నిరుపేదలు. మృతుల్లో 11 మంది ఇతర గ్రామాల నుంచి పొట్ట చేతపట్టుకుని ఉపాధి కోసం వచ్చినవారే. భోజనం హోటళ్లు  పెట్టుకుని పొట్టపోసుకుంటున్న వారు కొందరైతే..  సోడా బడ్డీల ద్వారా ఉపాధి పొందేవారు మరికొందరు. గెయిల్‌లో పనిచేసేందుకు ఇతర జిల్లాలు, మండలాల నుంచి వచ్చిన ఇంకొందరు.  మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం అందించారు. తీవ్రంగా గాయపడిన వారికి కూడా పరిహారం ఇచ్చారు. పేలుడు వలన నష్టపోయిన బాధితులకు తాత్కాలిక  గృహాలు  నిర్మించేందుకు గెయిల్ ఏర్పాట్లు చేస్తోంది. అయినా బాధిత కుటుంబాలకు స్వాంతన చేకూర్చలేకపోతున్నారు. ఈ కుటుంబాలను ఓదార్చడం ఎవరితరమూ కావడంలేదు. ఎవరిని   కదిలించినా కన్నీటి ధారలే దర్శనమిస్తున్నాయి. తీరని ఆవేదన కనిపిస్తోంది. 
 
గెయిల్ గ్యాస్ పైపులైన్లు జన నివాసాలకు దూరంగా సముద్రతీరంకు తరలించాలని డిమాండ్  చేస్తున్నారు. గ్యాస్ సరఫరాలో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించాలని కోరుతున్నారు. ఘటనకు బాధ్యులైన గెయిల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నగరంలో ఇంకా సాధారణ పరిస్థితులు ఇప్పటిలో వచ్చేలా కనిపించడంలేదు. గ్యాస్ పైపు లైన్  లీకు వార్త వినపడితేనే జనం భయపడిపోతున్నారు. ఆనాటి దుర్ఘటనతో మళ్ళీ నివాసాలు  ఏర్పాటుచేసుకునే సాహసం ఎవరూ చేయడంలేదు.