శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By JSK
Last Modified: గురువారం, 14 జులై 2016 (12:56 IST)

కృష్ణా పుష్కరాలు విజయవాడలో వద్దు... కర్నూలుకు మార్చమంటున్న వేద‌పండితులు... ఎందుకు?

కృష్ణా పుష్కరాలు సాంప్రదాయకం, శుభ‌ప్రదం కావాలంటే ప్రధాన ఉత్సవాన్ని విజయవాడ నుంచి కర్నూలు జిల్లాకు మార్చడం ఉత్తమం. కోట్లాది మంది ప్రజలు 12 సంవత్సరాలకొకసారి సాంప్రదాయకంగా, పుష్కరుడికి ధ‌న్యవాదాలు జరిపే ఉత్సవమే పుష్కరం. భారతదేశంలో ఉన్న పెద్ద నదులలో ఒకటి

కృష్ణా పుష్కరాలు సాంప్రదాయకం, శుభ‌ప్రదం కావాలంటే ప్రధాన ఉత్సవాన్ని విజయవాడ నుంచి కర్నూలు జిల్లాకు మార్చడం ఉత్తమం. కోట్లాది మంది ప్రజలు 12 సంవత్సరాలకొకసారి సాంప్రదాయకంగా, పుష్కరుడికి ధ‌న్యవాదాలు జరిపే ఉత్సవమే పుష్కరం. భారతదేశంలో ఉన్న పెద్ద నదులలో ఒకటి కృష్ణా నది. నాలుగు రాష్ట్రాలకు జీవనాదారంగా ఉన్నది కృష్ణానది. ఈ నదికి 2016 ఆగస్టున పుష్కరాలు రానున్నాయి. పట్టిసీమ ద్వారా కృష్ణలోకి గోదావరి జలాలను కలపడం వలన వివాదం రాజుకుంటుంది. వివాదాలకు దూరంగా, సాంప్రదాయకం గానూ, సౌకర్యవంతం గాను పుష్కరాలు జరగాలంటే అధికారికంగా ప్రభుత్వం నిర్వహించే ప్రధాన ఉత్సవాన్ని విజయవాడ నుంచి కర్నూలు జిల్లాకు మార్చడం ఉత్తమం.
 
పుష్కరం అంటే నీటి చుట్టూ సమాజం, మనిషి జీవితం ఆధారపడి ఉంటుంది. భూభాగంలో 3వ వంతు నీరు ఉంటుంది. మనిషిలో సైతం నీటి శాతం ఎక్కువగానే ఉంటుంది. నీటి శాతం మనిషిలో తగ్గితే ఎంత ప్రమాదమో భూమిపై సైతం నీటి లభ్య‌త‌ తగ్గితే కూడా సమాజ మనుగడకే ప్రమాదం. అలా మనిషికి, సమాజానికి విడదీయరాని అనుభంధం నీరు. అంతేకాదు నాగరిక సమాజం అభివృద్ది చెందినదే నదీ పరివాహక ప్రాంతంలోనే. వేదాల ప్రకారం నదిని సంరక్షించే బాద్యత పుష్కరుడిది. దైవాంస సంభూతుడైనా పుష్కరుడు నదిలో ప్రవేశించడంతో పుష్కరాలు ప్రారంభ‌మవుతాయి. పుష్కరుడు 12 రోజులు నదిలో ఉంటాడు. 
 
దైవాంస కాబట్టి పుష్కరుడి ప్రవేశం కారణంగా నదికి పవిత్రత వస్తుంది. కనుక ఆ 12 రోజులు సంబంధిత నదిలో స్నానం చేస్తే పుణ్యం వస్తుందని ప్రజల విశ్వాసం. నదిని సంరక్షించేది కూడా పుష్కరుడే కాబట్టి వారకి ధన్యవాదాలు చెప్పినట్లు కూడా ఉంటుందన్నది ప్రజల విశ్వాసం. 2016 ఆగస్టు 12న కన్యారాశి నందు పుష్కరుడు కృష్ణానది ప్రవేశం చేయడం ద్వారా కృష్ణా పుష్కరాలు రానున్నాయి. అందుకు గాను ఏపి ప్రభుత్వం సారధ్యంలో విజయవాడ కేంద్రంగా పుష్కర ఏర్పాట్లు జరుగుతున్నాయి.
 
కృష్ణానది మహరాష్ట్రలో పుట్టి కర్ణాటక మీదుగా తెలంగాణ, రాయలసీమ ద్వారా నాగార్జున సాగర్ మార్గంలో విజయవాడకు చేరుకుంటుంది. ప్రకాశం బ్యారేజి ద్వారా బంగాళాఖాతంలో కలుస్తుంది. దాదాపు 29 ఉపనదుల సంగమంతో 1300 కీ మీ ప్రవహిస్తుంది. అలాంటి నదికి మన రాష్ట్రంలో విజయవాడ కేంద్రంగా ప్రధాన ఉత్సవం జరుగనున్నది. ఈ మధ్య‌నే బాబుగారి ప్రభుత్వం పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని విజయవాడ పైభాగాన కృష్ణానదిలో కలిపింది. అంటే పులిచింతల దగ్గర నుంచి ప్రకాశం బ్యారేజి ద్వారా సముద్రంలో కలిసిపోయే ప్రాంతం వరకు గోదావరి నీరు కలిసింది అన్నది పండితుల వాదన. 
 
ఆ కారణంగా విజయవాడ ప్రాంతంలో ఉన్న కృష్ణా తన స్వభావాన్ని కోల్పోయింది అన్నది ప్రధాన వాదన. అంతేకాదు గత ఏడాది గోదావరి పుష్కరాలు జరిగినాయి. నేటికి ఏడాది పూర్తి  అవుతుంది. సహజంగా పుష్కరుడు ఒక నది ప్రవేశంతో పుష్కరాలు ప్రారంభ‌మవుతాయి. అలానే పుష్కరుడు ఏడాది చివరన‌ అదే నదిలో ప్రవేశిస్తాడు దాన్నే అంత్య పుష్కరాలు అంటారు. అలా ఇప్పుడు పుష్కరుడు గోదావరిలో ఉన్నట్లు లెక్క. మరి గోదావరి, కృష్ణా అనుసంధానం అయిన విజయవాడ ప్రాంతములో ఇప్పుడు పుష్కరుడు ఉన్నట్లే కదా మరి అదే ప్రాంతంలో ఆగస్టు నెలలో పుష్కరుడు కృష్ణానదిలో ప్రవేశించిన కారణంగా వచ్చే పుష్కారాలను విజయవాడ కేంద్రంగా జరపడం సరికాదు అన్నది పండితుల ప్రధాన వాదన.
 
మతం, ఆచారాలు కేవలం నమ్మకం, ప్రజల విశ్వాసాల ప్రాతిపదికనే జరుగుతాయి. ప్రజల నమ్మకాలను, పండితుల అభిప్రాయాలను గౌరవించడం ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వం పట్టింపులకు పోకుండా కొంత శ్రద్ధ పెట్టి ఆలోచిస్తే అదే కృష్ణానది రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు జిల్లాలో 120 కీ మీ ప్రవహిస్తుంది. కనుక ప్రభుత్వం నిర్వహించే ప్రధాన ఉత్సవాన్ని విజయవాడ నుంచి కర్నూలు జిల్లాను కేంద్రంగా మార్చుకుంటే సాంప్రదాయబద్దంగాను, సౌకర్యవంతంగానూ ఉంటుంది.
 
రాయలసీమ ప్రాధాన్యత కృష్ణానది మహరాష్ట్రలో పుట్టి, కర్ణాటక, తెలంగాణ తర్వాత ఏపిలో ప్రవేశించేది రాయలసీమలోని కర్నూలు ప్రాంతంలోనే. ఇదే ప్రాంతంలో దాదాపు 120 కీ మీ ప్రవహించి శ్రీశైలం చేరుకుంటుంది. శ్రీశైలం ద్వారా నీటిని విడుదల చేస్తేనే సాగర్ ద్వారా విజయవాడకు చేరుకుంటుంది. శ్రీశైలంలోని పాతాళ‌గంగ అత్యంత ప్రాచీనమైనది. శివుడు నీటి ప్రవాహన్నీ ఆపింది ఇక్కడే అన్నది నానుడి. గ్రామ దేవతలైన అక్కగార్లు కొలువైన ప్రాంతం. సిద్దేశ్వరం దగ్గర ప్రాచీనమైన సంఘమేశ్వరాలయం ఉన్న ప్రాంతం, అన్నింటికన్నా మచ్చుమర్రి ప్రాంతం చాలా కీలకం. విశాలమైన ప్రాంతం దాదాపుగా 6 కీ మీ ఘాట్ల నిర్మాణం చేపట్టవచ్చు. అలా ఈ ప్రాంతం శైవ క్షేత్రాలకు, పురాతన దేవాలయాలకు నిలయం. 
 
ముఖ్యంగా విజయవాడ ప్రాంతంలో నదిలో నీటి నిల్వ ఉంటుంది. వేలాది మంది స్నానం చేస్తే ఇబ్బందులు కూడా వస్తాయి. అదే రాయలసీమ ప్రాంతంలో నీటి నిల్వకు శ్రీశైలం ప్రాజెక్టులో తప్ప ఎక్కడా అవకాశం లేదు. అంటే నది ప్రవాహంలోనే ఉంటుంది కనుక నిత్యం క్రొత్త నీరు వస్తుంటుంది. అందువలన ప్రజల‌కు సౌకర్యంగా ఉంటుంది. అందుకే ప్రభుత్వం పండితుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని రాయలసీమలోని ముచ్చిమర్రి, సంఘమేశ్వరం, శ్రీశైలం ప్రాంతంలో ప్రధాన ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం సాంప్రదాయకం గాను, ప్రజలకు సౌకర్యంగానూ ఉంటుంది.
 
రాయలసీమలో నిర్వహించాల్సిన ఆవశ్యకత పుష్కరాలకు పెద్ద చరిత్రనే ఉంది కాని గత కొంతకాలంగా పుష్కరాల చుట్టూ రాజకీయ, పర్యాటక ప్రాధాన్యత నెలకొంటుంది. కోట్లాది మంది ప్రజలు వస్తారు కనుక వారికి చక్కటి ఏర్పాట్లు చేయడం ద్వారా ప్రజలలో అభిమానం సంపాదించు కోవడం, భారీ సంఖ్యలో వచ్చే జనానికి మౌలిక వసతుల కల్పన ద్వారా ఆ ప్రాంతం పర్యాటకంగా అభివృద్దికి ఆస్కారం ఏర్పడుతుంది. విజయవాడ చుట్టూ అమరావతి రాజధాని ఏర్పాటు జరుగుతుంది కనుక అక్కడ ఎలాగో అభివృద్దికి అవకాశం ఏర్పడింది. అనేక పర్యాటక ప్రాంతాలు, శైవక్షేత్రాలు, కృష్ణానది ఉన్నా వెనుకబడిన రాయలసీమలో పుష్కరాలు నిర్వహించితే వివాదానికి దూరంగా ఉండటంతో బాటు వెలుగు చూడని చారిత్రక ప్రాంతాలను ప్రపంచం ముందు ఉంచినట్లు అవుతుంది. 3 ప్రాంతాలలో రోడ్లు, ఘాట్లు ఇతర మౌలిక వసతుల కల్పనకు నోచుకుంటుంది. పలితంగా భ‌విష్యత్‌లో ఈ ప్రాంతం పర్యాటకంగా వేగంగా అబివృద్ధి చెందుతుంది. అది రాయలసీమకే కాదు రాష్ట్రానికి కూడా మంచిదే.