గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pyr
Last Updated : శుక్రవారం, 25 సెప్టెంబరు 2015 (10:26 IST)

వైఎస్‌కు కేవీపీ ఒక్కడే ఆత్మ.. చంద్రబాబుకు ఎన్ని ఆత్మలు..? ఆ ఆత్మలే ఆడిస్తున్నాయా...!

వైఎస్ రాజశేఖర్ రెడ్డితన ఆత్మ కేవీపీ రామచంద్రరావుమని చెబుతూ వచ్చారు. తన ఆత్మ మిత్రుడుగా ముద్రపడిన కేవీపీ చాలా కీలక పరిణాలలో ప్రధాన భూమిక పోషించారనే విషయం జగమెరిగిన సత్యం. అలాంటి.. ఆత్మలు, పరమాత్మలు చంద్రబాబు దరిదాపులలో ఉండవని చెప్పేవారు. ఆయన తన మాట వేదంగా నడిచేవారని పేరు. అదంతా ఒకప్పటి మాటనే వాదన వినిపిస్తోంది. వైఎస్‌కు ఒక ఆత్మ అయితే చంద్రబాబుకు చాలా ఆత్మలు ఉన్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు సింగపూర్ జపమైనా, విజయవాడలో మకాం వేయడమైనా ఆత్మల పనేననే తెలుస్తోంది. 
 
ఈ మధ్యలో చంద్రబాబు నాయుడు వారంలో మూడు రోజుల పాటు విజయవాడలో ఉంటానని మిగిలిన సమయమంతా హైదరాబాద్‌లోనే ఉంటానని ప్రకటించారు. అయితే ఆయన ఎక్కువ సమయం విజయవాడలోనే ఉంటున్నారు. వాస్తవానికి తెలంగాణలో పార్టీని కాపాడుకోవడానికి ఆయన తను హైదరాబాద్‌లోనే ఎక్కువ సమయం గడపాలని అనుకున్నారు. అక్కడ నుంచే వీలైనంత ఎక్కువ కాలం పాలన సాగించాలని భావించారు. అయితే క్రమ క్రమేణా ఆయన విజయవాడ జపం చేస్తున్నారు. రాజధాని ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి లేదు. 
 
కేంద్రం నుంచి ఒక్కపైసా నిధులు రాలేదు. వచ్చినా అసెంబ్లీలోనో, సచివాలయానికి సరిపోతుంది. మిగిలిన వ్యాపారాలు, వాణిజ్యాల పరిస్థితి ఏంటి.? అన్నింటికి మించి రాజధానిని, విజయవాడను, తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న ఆత్మల పరిస్థితి ఏంటి? ఇదే ప్రధానాంశంగా ఆత్మలన్నీ చంద్రబాబు చుట్టూ చేరాయట. ఆయనను ఆవహించాయట. వాస్తవానికి విజయవాడలోనూ, రాజధాని అమరావతిలోనూ అనుకున్నంత వేగంగా పనులేమి జరగడం లేదు. దీంతో రియల్ ఎస్టేట్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. మూడడగులు ముందుకు నడిస్తే... ఆరడగులు వెనక్కి వస్తోంది. 
 
ఇక ఆత్మలన్నీ వెళ్ళి చంద్రబాబు వద్ద ఘోషించాయట. ఏదోకటి చేయకపోతే పార్టీని నమ్ముకుని కొనుగోళ్ళు చేసిన తాము దివాలా తీయక తప్పదని వాపోయారట. అందుకే చంద్రబాబు విజయవాడ, రాజధాని జపం చేస్తూ ఆ ప్రాంతంలో ఎక్కువ హడావుడీ చేసి ఆత్మల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఆక్సిజన్ ఎక్కిస్తున్నారట. ప్రతీ రోజు ఏదోక కార్యక్రమాన్ని విజయవాడలో జరుపుతూ, ఎక్కువ కాలం అక్కడ రియల్ ఎస్టేట్ కార్యకలాపాలను సజీవంగా ఉంచేందుకు తపన పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నారు. ప్రధాన ఆత్మలు కొన్ని ఆయన మంత్రి వర్గంలోనే తిరుగుతున్నాయి.