గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : శుక్రవారం, 12 ఫిబ్రవరి 2016 (13:17 IST)

సవాళ్లకు ఎదురెళ్లిన సాహసి.. కావాలనే కష్టమైన విధుల్లోకి.. ఇదీ వీరసైనికుడి హనుమంతప్ప జీవితగాథ

భారత సైన్యం ఓ అరుదైన సాహసికుడుని కోల్పోయింది. క్లిష్ట పరిస్థితులు, సవాళ్ళకు ఎదురెళ్ళి విధులు నిర్వహించడమంటే మహా సరదా కలిగిన ఆ సాహస వీర సైనికుడి పేరు లాన్స్‌నాయక్ హనుమంతప్ప. భారత ఆర్మీలో మొత్తంలో మొత్తం 14 ఏళ్ల సర్వీసులో పదేళ్ళ పాటు అత్యంత క్లిష్ట సవాళ్ళ మధ్యే అకుంఠిత దీక్షతో విధులు నిర్వహించాడంటే.. అతని సాహసానికి ప్రత్యేకించిన కొలమానమేదీ అక్కర్లేదు. 
 
భూమట్టానికి 19600 వేల అడుగుల ఎత్తులో అత్యంత ప్రమాదకరమైన చోట విధులు నిర్వహించడమంటే ఏ జవాన్ కూడా సాహసం చేయరు. మైనస్ 55 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలను.. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వీచే చలిగాలులను తట్టుకుంటూ సైనికులు అక్కడ విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఇలాంటి చోటుకు ఏ జవాను కూడా వెళ్లరు. ఒకవేళ పై అధికారులు బలవంతంగా అక్కడ డ్యూటీ వేసినా.. ఏదో మెడికల్ సర్టిఫికేట్ సమర్పించి.. అక్కడ విధుల నుంచి తప్పించుకుంటారు. కానీ, హనుమంతప్పకు మాత్రం... అలాంటి చోటే.. అత్యంత ప్రమాదకర ప్రాంతాల్లో విధులు నిర్వహించడమంటే మహా సరదా. కావాలనే సియాచిన్‌లో విధులు నిర్వహించేందుకు తనకు డ్యూటీ వేయాలంటూ బలవంతం చేసుకునీ మరీ సియాచిన్ మంచుపర్వతాలపైకి వెళ్లి... ఇపుడు మృత్యువు ఒడిలోకి జారుకున్నాడు.
 
 
ఈ నెల 3న మంచు తుఫానులో చిక్కుకున్నాడు. ఇందులో హనుమంతప్ప ఆరు రోజులపాటు మంచు గడ్డల కింద సుమారు 25 అడుగుల లోతున మృత్యువుతో పోరాడి కొన ఊపిరితో బయటపడ్డారు. ఆయన్ను ఈ నెల 9వ తేదీన ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చి అండ్‌ రెఫరల్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మల్టిపుల్‌ ఆర్గాన్స్‌ ఫెయిల్యూర్‌ కారణంగా ఆయన ఆరోగ్యం క్రమేపీ క్షీణించి.. గురువారం మధ్యాహ్నం కన్నుమూశారు. కర్ణాటకకు చెందిన 33 ఏళ్ల హనుమంతప్ప మద్రాస్‌ రెజిమెంట్‌ 19వ బెటాలియన్‌ తరపున గత యేడాది డిసెంబర్ నెల నుంచి సియాచిన్‌లో సేవలు అందిస్తూ వస్తున్నారు. 
 
తన 19 యేటలోనే భారత ఆర్మీలో చేరిన లాన్స్‌ నాయక్‌ హనుమంతప్ప జీవితమంతా పోరాడాలతోనే గడిచింది. ఎంత అకుంఠిత దీక్షాపరుడో అంతే మృదుస్వభావి కూడా. తన 14 ఏళ్ల సర్వీసులో 10 ఏళ్లపాటు ఒక సవాల్‌గా జీవితాన్ని గడిపారు. ఈశాన్య భారతం, జమ్మూకాశ్మీర్‌, సియాచిన్ వంటి చోట్ల హనుమంతప్ప కావాలనే కష్టమైన పోస్టింగులను వేయించుకొనేవాడు. ఈ క్రమంలో 2003 నుంచి 2006 వరకు ఒక పర్యాయం, 2008 నుంచి 2010 వరకు మరో పర్యాయం.. కాశ్మీర్‌ లోయలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో హనుమంతప్ప పాల్గొన్నారు. 2010 నుంచి 2012 వరకు అసోంలో బోడో, ఉల్ఫా తీవ్రవాదాన్ని గట్టిగా ఎదుర్కొన్నారు. ఇలా ప్రమాదాలకు ఎదురెళ్లడం, ఎంతటి కష్టానికీ వెరవకపోవడమనే స్వభావం హనుమంతప్పకు బాల్యంలోనే అలవడిందని చిన్ననాటి స్నేహితులు గుర్తు చేసుకొంటున్నారు.
 
హనుమంతప్ప పుట్టుపూర్వోత్తరాలు ఇవే... 
కర్ణాటకలోని ధార్వాడ జిల్లా బెటాదూర్‌ గ్రామంలో ఓ రైతాంగ ఓ రైతు కుటుంబంలో హనుమంతప్ప జన్మించారు. మంచి బరువుతో జన్మించడం వల్ల.. హనుమంతప్ప అని పేరు పెట్టినట్టు తల్లిదండ్రులు చెపుతారు. ఈ గ్రామం నుంచి ఆరుగురు సైన్యంలో ఉన్నారు. వీరి ప్రభావంతో హనుమంతప్ప.. తానూ ఆర్మీలో చేరాలని చిన్నప్పటి నుంచి కలలుకన్నాడు. పొలం పనులు చేయడంతోపాటు రోజూ యోగా చేయడం ద్వారా శరీరదారుఢ్యాన్ని పెంచుకున్నాడు. కష్టపడి చదువుకున్నాడనే మాటకు.. హనుమంతప్ప నిలువెత్తు నిదర్శనం. రోజూ స్కూలుకు ఆరు కిలోమీటర్లు నడిచివెళ్లేవారు.
 
ఆ తర్వాత ఆర్మీలో చేరే విషయంపై గురిపెట్టారు. వరుసగా మూడుసార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. అయినా, నిరుత్సాహపడక, మరింత మరింత కష్టపడ్డారు. 2002లో ఎట్టకేలకు సైన్యంలోకి ప్రవేశించారు. 19వ మద్రాస్‌ రిజిమెంట్‌లో చేరి.. చరమాంకం వరకూ దేశ సేవకే అంకితమయ్యాడు. నాలుగేళ్ల క్రితం మహాదేవితో హనుమంతప్పకు వివాహం జరిగింది. వారికి ముగ్గురు కుమార్తెలు. ఆరు నెలల క్రితం చివరిసారిగా గ్రామానికి వచ్చినప్పుడు మూడో కుమార్తె, రెండేళ్ల నేత్రతో ఎక్కువసేపు గడిపాడని కుటుంబ సభ్యులు గుర్తు చేసుకొంటున్నారు.