శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By PNR
Last Updated : సోమవారం, 6 జులై 2015 (11:43 IST)

వ్యాపం స్కామ్ అంటే ఏంటి.. మధ్యప్రదేశ్‌ను కుదిపేస్తున్న క్రైమ్‌ అండ్‌ హారర్‌ స్కామ్‌!

మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని క్రైమ్ అండ్ హారర్ స్కామ్ కుదిపేస్తోంది. స్కామ్ అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నివేదిక ఇచ్చిన మరుసటి రోజు నుంచే వరుసగా ముగ్గురు అనుమానాస్పదంగా మృత్యువాతపడటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. తొలుత ఓ విలేఖరి చనిపోగా, ఆదివారం మెడికల్ కాలేజీ డీన్ చనిపోయారు. సోమవారం మహిళా ట్రైనీ ఎస్సై చెరువులో అనుమానాస్పదంగా శవమై తేలింది. దీంతో ఈ కేసులో అనుమానాస్పద మృతుల సంఖ్య 46కు చేరింది. 
 
మధ్యప్రదేశ్‌లో మెడికల్‌ కాలేజీల్లో అడ్మిషన్లు, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో అక్రమాలు, అవకతవకలకు సంబంధించిన భారీ కుంభకోణం ఇది. దశాబ్ద కాలంనుంచీ సాగుతున్న వేల కోట్ల స్కామ్‌. రాజకీయ నాయకులు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, వ్యాపారవేత్తల భాగస్వామ్యంతో అంతులేని క్రైమ్‌ అండ్‌ హారర్‌‌గా మారింది. మధ్యప్రదేశ్‌ విద్యాశాఖ మాజీ మంత్రి లక్ష్మీకాంత్‌ శర్మతోపాటు మరో 25 మంది ప్రముఖులు ఈ కేసులో నిందితులు. మొత్తంమీద ఇప్పటి దాకా 129 మంది అరెస్టయితే, ఏకంగా 720 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులపైనా కేసులు నమోదై ఉన్నాయి. 
 
మధ్యప్రదేశ్‌లో ప్రొఫెషనల్‌ ఎగ్జామినేషన్‌ బోర్డ్‌ (ఎంపీపీఈబీ) అని ఉంది. దీన్నే రాష్ట్రంలో ‘వ్యావసాయిక్‌ పరీక్షా మండల్‌’ (వ్యాపం‌) అంటారు. రాష్ట్రంలో వైద్య ఇంజనీరింగ్ ప్రవేశాలకే కాకుండా పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరిధిలో లేని ఉద్యోగ నియామకాలకు పరీక్షలు నిర్వహిస్తూంటుంది. ఇది నిర్వహించే ప్రీ మెడికల్‌ టెస్ట్‌ (పీఎంటీ)లో అవకతవకలున్నట్లు 2009 నుంచే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో 300 మందికిపైగా అనర్హులు మెరిట్‌ జాబితాలో చోటు దక్కించుకున్నారని ఇండోర్‌లో డాక్టర్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ ఆనంద్‌ రాయ్‌ 2013లో తొలుత బయటపెట్టారు. 
 
ఈ స్కామ్‌లో ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ బంధువుల పాత్రే అధికంగా ఉందని సామాజిక కార్యకర్త ఆశిష్‌ చతుర్వేది ఆరోపించారు. దీంతో కలకలం రేగగా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను (ఎస్టీఎఫ్‌)ను నియమిస్తున్నట్లు సీఎం అసెంబ్లీలో ప్రకటించారు. మరోవైపు దీనిపై సమగ్ర దర్యాప్తు కోరుతూ హైకోర్టు ఇండోర్‌ బెంచ్‌లో కొందరు ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. దాంతో ఎస్టీఎఫ్‌ విచారణను పర్యవేక్షించేందుకు హైకోర్టు ‘ప్రత్యేక దర్యాప్తు బృందం’ (సిట్‌) ఏర్పాటైంది. 
 
మెడికల్‌ ప్రవేశాల్లో అక్రమాలపై ఎస్టీఎఫ్‌ చేపట్టిన విచారణతో డొంక కదిలింది. అడ్మిషన్లే కాకుండా ఉద్యోగ నియామకాల్లోనూ లెక్కలేనన్ని అక్రమాలు చోటుచేసుకున్నట్టు తేలింది. ఐదేళ్లలో వైద్య కళాశాలల్లో 1100 మందికిపైగా అనర్హులు సీట్లు పొందినట్లు తేలింది. ఇక టీచర్లు.. పోలీసులు.. ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు.. ఆయుర్వేద డాక్టర్లు.. ఇలా వేలమంది అడ్డదారిలో ఉద్యోగాలు దక్కించుకున్నట్టు ఈ విచారణలో తేలింది. అసలు అభ్యర్థి పేరు, మరొకరి ఫొటోతో పరీక్షరాయించడం, తర్వాత ఫొటోలు మార్చేయడం, నకిలీ అభ్యర్థుల జవాబు పత్రాలను మిగిలినవారు చూసి రాసే ఏర్పాట్లు చేయడం, ఖాళీ ఓఎంఆర్‌ షీట్లు తీసుకుని ఆ తర్వాత పూరించడం... ఇలా రకరకాల క్షుద్ర పద్ధతులన్నీ అమలు చేశారు. 
 
ఇలా ఐదేళ్లలోనే ఈ కుంభకోణంలో రూ.2 వేల కోట్లకుపైగా చేతులు మారినట్లు ఎస్టీఎఫ్‌ గుర్తించింది. ఇక ఎస్టీఎఫ్‌ ఇప్పటివరకు 2 వేల మందిని అరెస్టు చేసింది. విద్యాశాఖ మాజీ మంత్రి లక్ష్మీకాంత్‌ శర్మ, ఆయన ఓఎస్డీ ఓపీ శుక్లా, సీఎం చౌహాన్‌ సన్నిహితుడు సుధీర్‌ శర్మ, గవర్నర్‌ రామ్‌ నరేశ్‌ యాదవ్‌ ఓ ఎస్డీ ధనరాజ్‌ యాదవ్‌, డీఐజీ ఆర్కే శివహరితోపాటు వ్యాపం అధికారులున్నారు. ఈ కేసులో ఆ రాష్ట్ర గవర్నర్‌, ఆయన కుమారుడిపై కూడా ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన కుమారుడు రాజ్‌భవన్‌లోనే అనుమానాస్పదంగా చనిపోయాడు. అలా ఇప్పటివరకు 46 మంది చనిపోయారు.