గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pyr
Last Modified: మంగళవారం, 5 మే 2015 (14:03 IST)

మెహర్బానీ విరాళాలు.. ప్రకటించింది 14 కోట్లు చేతికొచ్చింది రూ.3.5 కోట్లు

గత మహనాడులో తెలుగుదేశం పార్టీ భజనపరులు రూ. 14 కోట్ల విరాళాలు ప్రకటిస్తే చేతికొచ్చింది మాత్రం 3.54 కోట్లంటే 3.54 కోట్లే. ఏం మిగిలిన సొమ్మంత ఏమైంది..? పార్టీ సంక్షేమ కన్వీనర్ నొక్కేశారు. అయ్యోయ్యో అంత మాట అనకంటి నాయకులే మాట తప్పారు. ఇవన్నీ పార్టీ కార్యకర్తల సంక్షేమ కన్వీనర్ హోదాలో నారాలోకేష్ స్వయంగా చెప్పిన విషయం. మొన్న శనివారం పొలిట్‌బ్యూరో సమావేశానికి హాజరై తన కార్యకలాపాల వివరాలతోబాటు మొత్తం లెక్కా పత్రాలన్నీ సమర్పించారు. ఈ పత్రాల్లో తేలిన లెక్కలవి... ఏం పాపం.. ! బాబుగారి మీద నమ్మకం తగ్గిందా.. అంటే అవుననే చెప్పాలి. అసలేం జరిగింది. 
 
బాబుగారు అధికారంలో వచ్చారు. బాబు గారి దృష్టిలో పడితే అంతకు మించిన అదృష్టం మరోటి ఉండదనుకున్న నాయకులు మహనాడు సందర్భంగా పోటీ పడి మరీ విరాళాలు ప్రకటించారు. పార్టీ అధికారంలోకి వచ్చేసింది. అక్కడా ఇక్కడా కాంట్రాక్టులు దక్కించుకుంటే ప్రకటించిన విరాళానికి నాలుగింతలు సొమ్ము చేసుకోవచ్చునని అనుకున్నారు. కానీ కథ అడ్డం తిరిగింది. చంద్రబాబు వారిని మించిన వాడు కావడంతో అన్ని అంతర్జాతీయ సంస్థలతోనే బేరసారాలు ఆడుకుంటూ స్థానిక పార్టీ సానుభూతిపరులైన వ్యాపారులను విస్మరించారు. 
 
తెలివైన బాబుగారు మనల్ని వాడుకోవడం మినహా మనకు ఉపయోగపడేదేమీ లేదని అర్థం చేసుకున్నారు. అందుకే చెప్పిన విరాళాలు ఇవ్వడంలో కూడా తూచ్... మేము చెప్పిన విరాళం ఇవ్వలేం అంటూ చేతులెత్తేశారు. చిన్నచిన్న నేతలు, క్రియాశీలక కార్యకర్తలను పక్కనబెడితే పెద్దమొత్తాల్లో హామీలిచ్చిన నేతలు, వ్యాపారస్తుల గురించి అక్కడ సెటైర్లు పేలుతున్నాయి. తమకిస్తానన్న పదవులు రాకపోవడం, పార్టీపరంగా ఆశించిన లబ్ది చేకూరకపోవడంతో సదరు వ్యక్తులు తామిస్తామన్న విరాళాలపై మిన్నకుండిపోయారని తెలుస్తోంది.
 
ప్రకటించిన 14 కోట్ల విరాళాలతోపాటు అప్పటికే తమదగ్గరున్న 6 కోట్ల రూపాయల పార్టీ నిధులతో కార్యకర్తల సంక్షేమ ఫండ్‌ను ఏర్పాటు చేయాలని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నిర్ణయించారు. ఆశించిన మొత్తం చేతికి అందకపోవడంతో వచ్చిన 3.50 కోట్ల విరాళాలు, తమదగ్గరున్న 6 కోట్లతోనే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నది చినబాబుగారి వివరణ. ఇక అమెరికాలో ఎంత మటుకు రాలుతాయో వేచి చూడాల్సిందే.