శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : శనివారం, 21 నవంబరు 2015 (13:20 IST)

చీకటి ఖండంలో అత్యంత పేద దేశం మాలీపై ఉగ్రవాదుల టార్గెట్‌కు కారణమిదే!

చీకటి ఖండం ఆఫ్రికాలో (పశ్చిమ ఆఫ్రికా) అత్యంత పేద దేశాల్లో ఒకటి మాలీ. సహారా ఎడారిని ఉత్తర సరిహద్దుగా కలిగిన దేశం. 14వ శతాబ్దంలో కళలు, గణితం, సాహిత్యం, ఖగోళ శాస్త్ర నిపుణులతో వెలుగొందిన దేశం... ఇప్పుడు కడు పేదరికంలో మగ్గుతోంది. 12.4 లక్షల చదరపు కిలో మీటర్ల విస్తీర్ణం గల ఈ దేశ జనాభా 1.45 కోట్లు. వీరందరికీ నైగర్‌, సెనెగల్‌ అనే రెండు నదులే జీవనాధారం. ప్రధాన వృత్తి వ్యవసాయం. 
 
ఆఫ్రికా ఖండంలో బంగారం నిల్వలు పుష్కలంగా ఉన్న దేశం.. బంగారాన్ని ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో ఒకటి. ఈ దేశ ప్రధాన ఆర్థిక వనరు ఖనిజపు గనులే. అయినా దేశంలో సగం మందికి పైగా కటిక దరిద్రంలో జీవిస్తున్నారు. 19వ శతాబ్దంలో 55 ఏళ్లకు పైగా ఫ్రెంచ్‌ పాలనలోనే ఉంది. దీంతో వీరి ప్రధాన భాషగా ఫ్రెంచ్‌ భాషే స్థిరపడి పోయింది. ఒకప్పుడు ఈ దేశంలో బానిసల వర్తకం కూడా చట్టం అనుమతించేది. ఇటువంటి మాలిపై ఉగ్రవాదులు దాడి చేయడానికి కారణం లేకపోలేదు. 
 
1905 నుంచి 1960 వరకు ఫ్రెంచ్‌ వారే పాలించారు. 1960 జూన్‌లో స్వాతంత్య్రం పొందిన మాలీ మూడు దశాబ్దాల పాటు ఏక పార్టీ పాలనలో మగ్గిపోయింది. 1991లో ప్రజల చేసిన పోరాట ఫలితంగా ప్రజాస్వామ్య పాలనకు బీజం పడింది. అప్పటి నుంచి కొత్త రాజ్యాంగానికి అనుగుణంగా ఎన్నికైన ప్రభుత్వం పాలన సాగింది. 
 
కానీ 2012లో ఉగ్రవాదులు అంతర్యుద్ధం సృష్టించారు. నేషనల్‌ మూవ్‌వెంట్‌ ఫర్‌ లిబరేషన్‌ ఆజాద్‌ పేరుతో టావ్‌రెడ్‌ రెబల్స్‌.. మాలే ప్రభుత్వంపై దాడికి తెగబడ్డారు. అన్సర్‌ డైన్‌, అల్‌-ఖైదా ఇన్‌ ఇస్లామిక్‌ మఘరెబ్‌ ఉగ్రవాద సంస్థలు వారికి అండగా ఉండటంతో మాలీ ప్రభుత్వం వారిని అణిచివేయలేకపోయింది. దీంతో అక్కడి ప్రభుత్వం ఫ్రాన్స్‌ను సాయం కోరడంతో 2013 జనవరిలో ఫ్రెంచ్‌ ఆర్మీ రంగంలోకి దిగి, ఉగ్ర చెర నుంచి విడిపించింది. 2015 ఫిబ్రవరి 20న మాలే దేశ ప్రభుత్వానికి, ఆరు తిరుగుబాటు గ్రూపులకు మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. తిరిగి మార్చి 6న తిరుబాటుదారులు దాడులకు దిగారు. దీంతో మళ్లీ ఫ్రెంచ్‌ దళాలు అక్కడ శాంతి పునరుద్ధరణకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ దేశ ప్రభుత్వ పాలనలో ఫ్రాన్స్ పాత్ర ఇప్పటికీ కీలకంగా ఉంది. 
 
ఈ పరిస్థితుల్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల తిరుగుబాటుతో అంతర్యుద్ధంలో చిక్కుకున్న సిరియాలో ఫ్రాన్స్ తలదూర్చింది. ఇక్కడున్న ఇసిస్ తీవ్రవాదులను ఏరివేసే పనిలో నిమగ్నమైంది. దీంతో ఇసిస్ తీవ్రవాదులు ఫ్రాన్స్‌ను తమ ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫలితంగా సుందర నగరం పారిస్‌పై నరమేధం సృష్టించారు. దీనిపై చర్చ సద్దుమణగకముందే.. ఆల్‌ఖైదా అనుబంధ తీవ్రవాద సంస్థ మాలిని లక్ష్యంగా ఎంచుకుంది. వీరికి ఇసిస్ తీవ్రవాదులకు సంబంధాలు ఉన్నాయి. ఐఎస్ సూచన మేరకే ఉగ్రవాదులు ఈ దేశంపై దాడికి తెగబడ్డారు.