శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: శనివారం, 24 అక్టోబరు 2015 (17:42 IST)

ఏపీ కాంగ్రెస్ 'మట్టి' సత్యాగ్రహం... మైలేజ్ కోసం హస్తం పాట్లు

ఉప్పు సత్యాగ్రహం మనకు బాగా తెలిసిందే. ఇప్పుడిలాంటిదే ఏపీ కాంగ్రెస్ చేయబోతోంది. దానిపేరు 'మట్టి' సత్యాగ్రహం. ఈ మట్టి సత్యాగ్రహం ఎందుకంటే ఏపీ ప్రత్యేక హోదా సాధించడం కోసం అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ రఘువీరా రెడ్డి అంటున్నారు. ఐతే రాష్ట్ర విభజన సమయంలో ఏపీ కాంగ్రెస్ నాయకులు విభజనను ఆపలేకపోయారన్న కోపాన్ని ఆంధ్ర ప్రజలు ఎన్నికల సమయంలో చూపించారు. ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కకుండా భూస్థాపితం చేసేశారు. 
 
ఐనప్పటికీ ఎలాగొలా మళ్లీ ఉనికి చాటుకోవాలని హస్తం పార్టీ ఏపీలో తంటాలు పడుతోంది. విభజన చట్టంలో ప్రత్యేక హోదాను జోడించకుండా కేవలం ప్రకటనకే పరిమితం చేసి దాన్ని అమలు చేయాలంటూ గొడవ చేస్తోంది. ఐతే పార్లమెంటులో ప్రత్యేక హోదా తేనెతుట్టెను కదిపితే కమలం పార్టీకి షాక్ కొడుతుందనీ, మరిన్ని రాష్ట్రాలు తమకు కూడా ప్రత్యేక హోదా కావాలని రొద చేస్తాయని భయపడి మిన్నకుంటోంది. ఇప్పుడిదే కాంగ్రెస్ పార్టీకి కాస్త కలిసి వచ్చినట్లు కనిపిస్తోంది. 
 
అందుకే వీలున్నప్పుడల్లా ప్రత్యేక హోదా ఏపీకి తక్షణమే ఇవ్వాలంటూ ఆందోళన చేస్తోంది. తాజాగా రాష్ట్ర రాజధాని అమరావతి శంకుస్థాపన సమయంలో సీఎం చంద్రబాబు మనమట్టి... మన నీరు నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇది బాగా హిట్టయింది. ఇప్పుడిదే ఫార్ములాను ఏపీ కాంగ్రెస్ పార్టీ రివర్సులో ఉపయోగించాలనుకుంటోంది. ప్రత్యేక హోదా ప్రకటించనందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీలోని 16 వేల గ్రామాల నుంచి మట్టిని తెచ్చి ఆయనకు పార్సిల్ చేసి తమ యొక్క మట్టి సత్యాగ్రహం ద్వారా నిరసన తెలుపుతామని అంటున్నారు. మరి ఈ మట్టి సత్యాగ్రహం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.