శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Selvi
Last Updated : గురువారం, 7 ఏప్రియల్ 2016 (18:54 IST)

నారా లోకేష్- బాలయ్యకు మంత్రి పదవి.. చంద్రబాబుకు కొత్త చిక్కు.. ఎలా డీల్ చేస్తారో?

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన కుమారుడు నారా లోకేష్‌కు మంత్రి పదవి ఇవ్వడంపై సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. లోకేష్‌కు మంత్రిపదవి ఇవ్వాలనుకున్న చంద్రబాబు ముందుగా ఆ మాటను పార్టీ నాయకుల చేత చెప్పించాలనుకున్నారు. అంతే సీనియర్ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మొదలుకుని బెజవాడ నేతల వరకు అంతా లోకేష్‌కు మంత్రి ఇవ్వాల్సిందేనని చెప్పుకొచ్చారు. 
 
నారా లోకేష్‌కు మంత్రి పదవి ఇస్తే బెటరే అని పార్టీలో అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబుకు ఓ చిక్కొచ్చి పడింది. కొందరు నాయకులు బాబు పాలసీనే ఫాలో అవుతున్నారు. తమ అభిమాన నటుడు బాలయ్యకు కూడా మంత్రిపదవి ఇవ్వాలంటున్నారు. ఇప్పటికే  ఏపీ క్రీడామండల చైర్మన్ పి.ఆర్.మోహన్ ఈ రాగం ప్రారంభించారు. 
 
నారా లోకేష్ కంటే ముందు.. హిందూపురం ఎమ్మెల్యే.. నందమూరి హీరో బాలయ్య బాబుకు మంత్రి పదవి ఇవ్వాలని మోహన్ పట్టుబడుతున్నారు. లోకేష్‌కు మంత్రి పదవి ఇవ్వాలంటూనే బాలకృష్ణ కూడా మంత్రి పదవికి అర్హుడేనంటూ మరోవాదన లేవనెత్తారు. ఇప్పుడు మోహన్ దారిలోనే మరికొందరు నేతలు కూడా బాలయ్య రాగం అందుకుంటే మాత్రం చంద్రబాబుకు తిప్పలు తప్పకపోవచ్చు. 
 
అటు లోకేశ్‌తోపాటు, ఇటు బాలయ్యకూ మంత్రిపదవి ఇస్తే అంతా కుటుంబపాలన అన్న విమర్శ కూడా రావచ్చు. ఇవ్వకపోతే బాలయ్య ఫ్యాన్స్‌కు నిరాశ తప్పదు. మరి ఈ విషయాన్ని చంద్రబాబు ఎలా డీల్ చేస్తారనేది వేచిచూడాల్సిందే.!