శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : శుక్రవారం, 20 మే 2016 (12:07 IST)

డీఎంకేను దెబ్బతీసిన అన్నాదమ్ముల వైరం.. దక్షిణాదిలో డీఎంకేను చావుదెబ్బ కొట్టిన అళగిరి

తమిళనాడు రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో విపక్ష డీఎంకేను అన్నదమ్ముల వైరం తీవ్రంగా దెబ్బతీశాయి. దీనికితోడు.. డీఎంకే భాగస్వామ్య పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కూడా కొంపముంచింది. ఫలితంగా డీఎంకే వరుసగా రెండోసారి కూడా అధికారానికి దూరమైంది. 
 
92 యేళ్ళ వయస్సులో కూడా కరుణానిధి ఆరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి... రికార్డు సృష్టించాలని ఉవ్విళ్లూరారు. అయితే, కరుణానిధి కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. దీనికి కారణం ఆయన ఇద్దరు కుమారులతో పాటు కాంగ్రెస్ పార్టీ. గురువారం వెల్లడైన ఆ రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో డీఎంకే 89 స్థానాలకే పరిమితం కావడానికి ప్రధాన కారణం అన్నదమ్ముల వైరమే.
 
ముఖ్యంగా కరుణ పెద్ద కుమారుడు అళగిరి, చిన్న కుమారుడు ఎంకే స్టాలిన్‌కు మధ్య ఎప్పటినుంచే అధికార యుద్ధం సాగుతోంది. ఫలితంగా ఈ యుద్ధం అళగిరిని పార్టీ నుంచి బహిష్కరించే స్థాయికి తీసుకెళ్లింది. దీంతో దక్షిణాది జిల్లాలో మంచిపట్టున్న అళగిరి ఈ అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. చివరకు ఓటు కూడా వేయలేదు. ఇది డీఎంకేను తీవ్రంగా దెబ్బతీసింది. 
 
నిజానికి.. తనను మళ్లీ పార్టీలో చేర్చుకుని తన అనుకూలురకు సీట్లు ఇస్తే పార్టీ విజయానికి కృషి చేస్తానంటూ అళగిరి ముందుకొచ్చినా స్టాలిన్ అంగీకరించలేదు. దాంతో అళగిరి తనకు బలమైన పట్టున్న మదురై జిల్లాతో పాటు తేని, విరుదునగర్‌, పుదుకోట, కోయంబత్తూరు తదితర జిల్లాల్లో అన్నాడీఎంకేకు అనుకూలంగా వ్యవహరించి డీఎంకేను దెబ్బతీశారు. వెరసి.. అన్నదమ్ముల వైరం పార్టీకి చేటు తెచ్చిపెట్టింది. 
 
అలాగే.. డీఎంకే 180 స్థానాల్లో పోటి చేసి 89 స్థానాల్లో గెలిచింది. ఆ పార్టీతో పొత్తులో భాగంగా కాంగ్రెస్‌ తాను పోటీ చేసిన 41 స్థానాల్లో గెలిచింది కేవలం ఎనిమిది చోట్లే. పొత్తు లేకుండా ఆ స్థానాల్లో కూడా డీఎంకేనే పోటీ చేసి ఉంటే కనీసం సగం సీట్లు గెలిచి ఉండేదని అంచనా. మొత్తంమీద 92 యేళ్ళ కరుణానిధి చివరి కోర్కె తీరకుండానే తన రాజకీయ శకాన్ని ముగించనున్నారు.