శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ttdj
Last Modified: మంగళవారం, 3 మే 2016 (13:05 IST)

నగరి నియోజకవర్గ అభివృద్ధిలో రోజా చివరి స్థానం... ఎప్పుడు చూసినా అక్కడే... ఎక్కడ...?

సినీనటి రోజా.. ఒకప్పుడు రోజా పేరు చెబితే చాలు తెలుగు ప్రేక్షకులు ఈలలు వేస్తూ గోల సృష్టించేవారు. అయితే రోజా ఎప్పుడైతే రాజకీయాల్లోకి అడుగుపెట్టారో ఆ తరువాత అభిమానులు ఆమెకు దూరమైపోయారు. రాజకీయాల్లో మహామహులు ఉన్నచోట తనేంటో నిరూపించుకునేందుకు ప్రయత్నించార

సినీనటి రోజా.. ఒకప్పుడు రోజా పేరు చెబితే చాలు తెలుగు ప్రేక్షకులు ఈలలు వేస్తూ గోల సృష్టించేవారు. అయితే రోజా ఎప్పుడైతే రాజకీయాల్లోకి అడుగుపెట్టారో ఆ తరువాత అభిమానులు ఆమెకు దూరమైపోయారు. రాజకీయాల్లో మహామహులు ఉన్నచోట తనేంటో నిరూపించుకునేందుకు ప్రయత్నించారు రోజా. ఒక పార్టీ అని కాదు ఉన్న అన్ని పార్టీల్లోను తిరుగేశారు. ఆమెను ప్రత్యర్థులు అనే మాట ఐరన్‌ లెగ్‌. చివరకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో అసెంబ్లీ సీటును సంపాందించి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అది కూడా అతి తక్కువ మెజారిటీతోనే.
 
రాజకీయ ఉద్దండుడిగా పేరొందిన గాలి ముద్దుక్రిష్ణమనాయుడు మీదే రోజా గెలుపొందడం అప్పట్లో చర్చనీయాంశమైంది. స్కెచ్చులు వేయాలన్నా, ఎటువంటి వ్యక్తినైనా ఓడించాలన్నా ముద్దుక్రిష్ణమనాయుడుకు వెన్నెతో పెట్టిన విద్య. అయితే అనూహ్యంగా ముద్దుక్రిష్ణమ నాయుడు 2014 ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. అసలు రోజా ఎట్టిపరిస్థితుల్లోను గెలవదన్న రాజకీయ విశ్లేషకుల అంచనాలే ఒక్కసారిగా తారుమారయ్యాయి. రోజా గెలుపొందడమే కాదు గెలిచిన తరువాత కన్నీటి బాష్పాలతో పుత్తూరు(నగరి) నియోజవర్గ ప్రజలకు హామీల మీద హామీలిచ్చారు. 
 
తాను ఎమ్మెల్యేగా నగరి నియోజకవర్గాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తానన్నారు. అవసరమైతే తన సొంత డబ్బును ఖర్చుపెట్టి గ్రామాలను అభివృద్ధి పథంలోకి నడిపిస్తానని హామీలు ఇచ్చారు కూడా. ఎన్నికలు పూర్తయి, రోజా గెలిచి సరిగ్గా రెండు సంవత్సరాలవుతోంది. అయితే అటు నగరి గాని, ఇటు పుత్తూరులో గాని జరిగిన అభివృద్ధి శూన్యమని చెప్పుకోవచ్చు. అసలు ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తరువాత అతి తక్కువసార్లు తన నియోజకవర్గంలో పర్యటించింది రోజా. ఎప్పుడూ హైదరాబాద్‌లో రాజకీయం లేకుంటే జడ్జిగా పలు కార్యక్రమాల్లో నటించడం ఇది రోజా పని. తన పర్సనల్‌ విషయాల్లో ఎప్పుడూ బిజీగా ఉండే రోజా అసలు తాను ఎమ్మెల్యేగా గెలుపొందానా అనే విషయం ఒక్కోసారి మరిచిపోతుంటుందని ఆమె సన్నిహితులే చెబుతుంటారు. 
 
నగరి ఎమ్మెల్యే అయిన తరువాత రోజా ఎక్కువగా స్పందించింది నగరి మున్సిపల్ ఎన్నికల్లోనే. తనతో పాటు తన పార్టీకి చెందిన వారు ఛైర్‌ పర్సన్‌‌గా ఉండాలన్న ఉద్దేశంతో దగ్గరుండి మరీ టిడిపి వార్డు మెంబర్లను కొనుక్కుని ఛైర్‌ పర్సన్‌‌ను గెలిపించుకున్నారన్న విమర్శలు లేకపోలేదు. ఆ తరువాత మున్సిపల్‌ ఛైర్ పర్సన్‌ శాంత కుమారి భర్త కె.జె.కుమార్‌ వ్యవహారంలో చిన్నదాన్ని పెద్దది చేసి అప్పట్లో రాద్దాంతం చేశారనే విమర్శలు సైతం వచ్చాయి.
 
టిడిపి సీనియర్‌ నేత గాలి ముద్దుక్రిష్ణమనాయుడు కావాలనే సంబంధం లేని కేసులు తన అనుచరులపై పెట్టి జైల్లోకి పంపించే ప్రయత్నం చేస్తున్నారని రోజా అప్పట్లో పెద్దఎత్తున ఆందోళన చేశారు. ఆ తరువాత నగరికి గాని, పుత్తూరుకు గాని అతి తక్కువ సార్లు వచ్చారు రోజా. అది కూడా అభివృద్ధి పనులను ప్రారంభించడానికి కాదు. కార్యకర్తలతో మాట్లాడడానికి మాత్రమే. దీంతో చిత్తూరుజిల్లాలోనే అభివృద్ధి జరగని ప్రాంతంగా చివరి స్థానంలో ఉన్నది నగరేనని ఆ ప్రాంత వాసులు చెప్పుకుంటున్నారు. 
 
ఇదిలావుంటే నగరి సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వంతో పోరాడి నిధులను రాబడతారు అనుకుంటే ఏకంగా.. రోజా సిఎం పైనే అసభ్య పదజాలాన్ని వాడి సస్పెండ్‌‌కు గురయ్యారు. అయితే ప్రస్తుతం ఆ సస్పెన్షన్‌ కాస్త సుప్రీంకోర్టులో నడుస్తూనే ఉంది. ఎమ్మెల్యేగా తమనేదో ఉద్దరిస్తుందని ఓట్లు వేసి గెలిపించిన నగరి ప్రజలకు రోజా చివరకు చుక్కలు చూపిస్తున్నారు. రోజా నియోజకవర్గం వైపు రాకపోవడంతో  సమస్యలను ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు నగరి ప్రజలు. ఉన్న మూడు సంవత్సరాల్లోనైనా రోజా నగరి నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తారా అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు అక్కడి వాసులు. 
 
రోజా నియోజవర్గంలో పర్యటించకపోవడంతో ఇక ముద్దుక్రిష్ణమనాయుడు నియోజకవర్గం అంతా కలియతిరుగుతున్నారు. వారానికి రెండుసార్లు నియోజవర్గంలోనే తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ముద్దుక్రిష్ణమనాయుడు ఇలానే ప్రజలతో కలిస్తే వచ్చే ఎన్నికల్లో రోజా గెలవడం దుర్లభమని రాజకీయ విశ్లేషకులు ఇప్పుడే చెప్పేస్తున్నారు. అయితే రోజా రానున్న మూడు సంవత్సరాల్లో నగరి నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తుందో వేచి చూడాల్సిందే.