గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pyr
Last Updated : శుక్రవారం, 12 జూన్ 2015 (18:35 IST)

వైసీపీకి దూరంకానున్న బొబ్బిలి రాజులు.! బొత్సపై కినుకు.. కార్యకర్తలతో ఎమ్మెల్యే సుజన భేటీ

విజయనగరం జిల్లా వైసీపీ శాఖలో లుకలుకలు మొదలయ్యాయి. పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రాకను వ్యతిరేకిస్తున్న బొబ్బిలి రాజులు తిరుగుబావుటా ఎగరవేస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే సుజన క్రిష్ణ రంగారావు పార్టీ వీడే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కొంతకాలం బొత్సతో ఉన్నప్పటికీ వారు చాలా కాలంగా ఆయనను వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి తరుణంలో మళ్ళీ ఆయనను వైసీపీలో చేర్చుకోవడం, ఆయనతో కలసి పని చేయడం వారికి ఇష్టం లేదు. పైగా జగన్ పార్టీ పగ్గాలను సత్తిబాబుకు అందించడంతో వారు మరింత మండిపడుతున్నారు. శుక్రవారం ఉదయం కోటలో సుజన తన అనుచరులతో సమావేశమయ్యారు. భవిష్యత్తు కార్యచరణపై ఆలోచనలు జరిపారు. 
 
విజయనగరం జిల్లాలో బొబ్బిలి రాజులు వైఎస్ ఆర్ సీపీకి కీలక నేతలుగా ఉన్నారు. వారు ఆది నుంచి బొత్సను వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల బొత్స పార్టీలో చేరే సందర్భంలో కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే జగన వారికి నచ్చజెప్పి బొత్సను పార్టీలో చేర్చుకున్నారు. ఇక అప్పటికి మౌనంగా ఉన్న బొబ్బిలి రాజులు పార్టీ నుంచి వీడిపోయే ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు సమాచారం.
 
శుక్రవారం పలు మండలాలల కీలక నేతలతో ఆయన సమావేశమయ్యారు. అదే విధంగా ఆ సమావేశానికి సత్తిబాబుకు వ్యతిరేకంగా ఉన్న జడ్పీ మాజీ ఛైర్మన్ ఒకరు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఒక దశలో అక్కడి కార్యకర్తలు జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లు సమాచారం. కాంగ్రెస్ ను వీడి వస్తే తమకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నారని ఆరోపించినట్లు సమాచారం. 
 
అయితే బొబ్బిలి రాజులను శాంత పరిచేందుకు ఇటు సత్తిబాబు, వైసీపీ అధిష్టానం దూతలను రంగంలోకి దింపి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. బొబ్బిలి రాజులు మాత్రం తాము పార్టీని వీడుతున్నామా లేదా.. అనే అంశంపై మీడియాకు ఎటువంటి స్పష్టతా ఇవ్వలేదు.