గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pyr
Last Updated : శనివారం, 13 జూన్ 2015 (13:30 IST)

ఓటుకు నోటు ఎఫెక్ట్...! ఎక్కడి నాయకులు అక్కడే గప్ చుప్..!! బలమున్న చోటే పోటీ

ఎన్నికలు ఏవైనా ఎన్ని రాజకీయాలో.. ఎన్ని క్యాంపులో.. కోట్లాది రూపాయల ఖర్చు.. చివరకు ఎమ్మల్సీ ఎన్నికలైనా సరే.. ఇదే సీన్ మార్పేమి ఉండదు. పార్టీలకు శిబిరాలు తప్పవు. కానీ రాబోవు స్థానిక సంస్థల కోటాలోని ఎమ్మెల్సీ జరగబోవు ఎన్నికలలో పార్టీలు, ఆ పార్టీల నాయకులు తేలుకుట్టిన దొంగల్లా చాలా సైలెంట్ గా ఉన్నారు. ఓటుకు నోటు ఎఫెక్ట్ అన్ని పార్టీలకు తగిలింది. ఎక్కడి నాయకులు అక్కడే గప్ చుప్ అన్నచందంగా వ్యవహరిస్తున్నారు. బలమున్న చోటే పోటీ చేయాలని అధిష్టానాలు కూడా హితవు పలుకుతున్నాయి.  
 
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏ వాతావరణంలో జరిగాయో అందరికీ తెలిసిందే. అక్కడ ఒక ఎమ్మెల్సీ స్థానం కోసం నామినేటెడ్ ఎమ్మెల్యేను కొనుగోలు చేయబోయి రేవంత్ రెడ్డి అడ్డంగా బుక్కయ్యాడు. అదే ఉచ్చులో తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇరుక్కుని విల విలలాడుతున్నారు. ఇంకా బయట పడలేదు. ఓటుకు నోటు కేసు జాతీయ స్ఖాయిలో సంచలనం సృష్టిస్తోంది. ఇలాంటి సమయంలో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు రానే వచ్చాయి. 
 
దాదాపుగా ఎన్నికల గంట మోగిన అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి చాలా సైలెంట్ గా ఉంది. గత ఎన్నికలతో పోల్చుకుంటే పూర్తిభిన్నంగా ఎన్నికలు సాగుతున్నాయి. సాధారణంగా అయితే డబ్బుల ఎర, దౌర్జన్యాలు, శిబిరాలు నడుపుతారు. కానీ ప్రస్తుతం ఓటుకు నోటు ఎఫెక్ట్ తో ఎక్కడికక్కడ పార్టీలు కేవలం బలం ఉన్న చోట మాత్రమే తమ అభ్యర్థులను రంగంలోకి దింపాలని భావిస్తున్నారు. తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు ఇప్పటికే గుంటూరు జిల్లా నాయకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 
 
బలం ఉన్నన్ని చోట్లు మాత్రమే అభ్యర్థులను రంగంలోకి దింపాలని నిర్ణయించారు. ఇక వైఎస్ ఆర్ పార్టీ ప్రకాశం జిల్లాలో తెలుగుదేశానికి ఉన్న సభ్యులు 458 మాత్రమే కాగా, వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు 28 మంది ఎక్కువగా 486 మంది ఉన్నారు. నిజానికి ఈ సభ్యులంతా కట్టుగా ఉండి ఓట్లు వేస్తే వారిది పైచేయి అవుతుంది. అయితే ఈ జిల్లాలో ఉన్న 47 మంది ఇండిపెండెంట్ల ఓట్లు కీలకం అవుతాయి. సహజంగా ఇండిపెండెంట్లు అధికార పార్టీకి అనుకూలంగా వేస్తారనేది వైకాపా ముందుగానే అభ్యర్థని రంగంలోకి దింపడంపై ఆలోచనలో పడింది. సహజంగా అయితే వారిని కొనుగోలు చేయడానికి పోటీ పడే వారు. 
 
తెలుగుదేశం పార్టీ కూడా స్పష్టంగా మెజారిటీ ఉన్న చోట మాత్రమే పోటీలో దిగాలనే సందేశాలను పంపింది. దీంతో తమకు వచ్చే ఆదాయం, ఉచిత విహార యాత్రలు ఎగిరిపోయాయని స్థానిక సంస్థల ప్రతినిధులు తెగ ఫీలయిపోతున్నారట.