గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Selvi
Last Updated : శనివారం, 22 ఆగస్టు 2015 (12:39 IST)

ప్రధానిగా మోడీకి తగ్గని క్రేజ్.. కానీ నరేంద్రుడి టీమ్‌పైనే ప్రజల అసంతృప్తి!?

దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రాభవం ఏమాత్రం తగ్గలేదు. అయితే ఎన్డీయే ప్రభుత్వం, మోడీ టీమ్ మాత్రం ప్రజల్లో అసంతృప్తి నెలకొందని ఇండియా టుడే గ్రూప్ -సిసెరో మూడ్ ఆఫ్ ది నేషన్ ఇటీవల నిర్వహించిన సర్వేలో తేలింది. 
 
లలిత్ మోడీ వ్యవహారంలో కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ సీఎం వసుంధరా రాజేలపై ఆరోపణలు, మధ్యప్రదేశ్‌లో వ్యాపం స్కామ్, భూసేకరణ చట్ట సవరణ, జీఎస్టీ పన్ను విధానం వంటివి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలను కుదిపేశాయి. ఇంకా మోడీ సూటూ-బూటూ పీఎంగా, తరచూ విదేశాల్లో పర్యటించే ప్రధానిగా రాహుల్ గాంధీ అభివర్ణించడం ఇతరత్రా అంశాలు తెలిసిందే. 
 
అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇండియా టుడే సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రధాని మోడీని వ్యతిరేకించే వారు పెద్దగా లేకపోయినా.. ప్రభుత్వంపై మాత్రం ఒకింత అసంతృప్తి కనిపించింది. అయినా ప్రధాని పీఠంపై మోడీకి ప్రత్యామ్నాయం.. మోడీనేనని ప్రజలు ఘంటా పథంగా చాటారు. 
 
ఇక ప్రధాని రేసులో అరవింద్ కేజ్రీవాల్, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మాయావతి స్వల్ప మార్కులే సంపాదించగలిగారు. అంతేకాదు.. తాజా సర్వేలో దేశ ప్రధానుల్లో మోడీ చేసినన్నీ విదేశీ పర్యటనలు ఎవ్వరూ చేయలేదని నిత్యం వస్తున్న విమర్శలను ప్రజలు లైట్‌గా తీసుకున్నారు. ఇంకా విదేశీ పర్యటనలు అవసరమేనని అవి దేశాన్ని ముందుకు తీసుకెళ్తాయని నొక్కి చెప్పేశారు. అలాగే మోడీ సర్కారు తెచ్చిన భూ సేకరణ చట్ట సవరణ బిల్లును పాస్ చేయించేది లేదన్న కాంగ్రెస్.. దాని మిత్ర బృందానికి ప్రతికూలంగా సర్వేలో ప్రజలు ఓటేశారు. 
 
ఈ సవరణ బిల్లు రైతు వ్యతిరేకమని ఒప్పుకుంటూనే.. దేశాభివృద్ధికి అత్యంత అవసరమన్నారు. మోడీ స్వచ్ఛ భారత్, జన్ ధన్ ఇతరత్రా పథకాలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మోడీ పాలనలో ప్రశాంతంగా ఉన్నామని ప్రజలు అంటున్నారు. మొత్తానికి నరేంద్ర మోడీపై ప్రజలు నమ్మకాన్ని కోల్పోనప్పటికీ.. నరేంద్రుడి టీంపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందని ఇండియా టుడే సర్వేలో తేలిపోయింది. మరి ప్రజా నాడికి తగ్గట్లు నరేంద్ర మోడీ పాలన కొనసాగిస్తారా? లేదా? ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా తన టీమ్‌లో మార్పులు చేర్పులు చేస్తారా? అనేది వేచి చూడాలి.