శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : గురువారం, 8 అక్టోబరు 2015 (12:49 IST)

టీడీపీలోకి నాగం జనార్ధన్ రెడ్డి.. కాంగ్రెస్‌ గూటికి రేవంత్ రెడ్డి.. నిజమేనా?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలక నేతగా చెలామణి అయిన మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి తిరిగి సొంతగూటికి రానున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అదేసమయంలో ప్రస్తుతం టీ టీడీపీలో ఫైర్‌బ్రాండ్‌గా ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరుకోవచ్చన్న ఊహాగానాలు వినొస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు.
 
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి వైఖరిని తీవ్రంగా ఎండగట్టిన నాగం జనార్ధన్ రెడ్డి... సొంత పార్టీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆయన దాన్ని బీజేపీలో విలీనం చేసి ఆ కమలం తీర్థం పుచ్చుకున్నారు. గత ఎన్నికల్లో పాలమూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు. పైగా గత కొన్నిరోజులుగా పార్టీపరంగా కాకుండా, తన వ్యక్తిగత ఛరిష్మా పెంచుకునేలా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇది కమలనాథులకు ఏమాత్రం రుచించడం లేదు. దీంతో నాగం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అదేసమయంలో టీడీపీ నేతలు పలువురు ఆయనను తిరిగి సొంతపార్టీలోకి తీసుకొచ్చేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. దీనికి చంద్రబాబు కూడా పచ్చజెండా ఊపినట్టు వినికిడి.
 
ఈ విషయం తెలుసుకున్న పాలమూరు జిల్లాకే చెందిన రేవంత్ రెడ్డి షాక్‌కు గురయ్యారట. ఇప్పటికే టీ టీడీపీ అధ్యక్ష పీఠాన్ని ఆశపడి భంగపడిన రేవంత్ రెడ్డికి.. ఈ జిల్లాకే చెందిన నాగం జనార్ధన్ రెడ్డి పునరాగమనాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారట. దీన్ని పసిగట్టిన టీ కాంగ్రెస్ నేతలు రేవంత్‌ రెడ్డితో టచ్‌లోకి వచ్చారు. నిజానికి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలతో రేవంత్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం కావడం కూడా రేవంత్ రెడ్డికి కలిసొచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడే తనకున్న పరిచయాలతో  రేవంత్ తన నియోజకవర్గానికి భారీగా నిధులు ప్రభుత్వం నుంచి మంజూరు చేయించుకున్నారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా ఎన్నికల నాటికి రేవంత్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం.