శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By PYR
Last Modified: శనివారం, 14 ఫిబ్రవరి 2015 (11:51 IST)

అటు తెలంగాణ.. ఇటు ఆంధ్రప్రదేశ్... నడుమ నాగార్జున సాగర్

అటు తెలంగాణ.. ఇటు ఆంధ్రప్రదేశ్.. నడుమ ఓ పెద్ద జలాశయం. ఇది నిన్న మొన్నటిది కాదు.. అరశతాబ్దానికిపైగా చరిత్ర కలిగిన సాగరం. అదే నాగార్జున సాగర్.. నిన్న మొన్నటి వరకూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అన్నదాతల పాలిట వరంలా... ఆంధ్రప్రదేశ్ కు వెలుగులు నింపిన ఆశాకిరణంలా నిలిచింది. మరినేడో వివాదానికి కేంద్ర బిందువులా తయారైంది. అందులో అటుగంటుతున్న నీరు తమవంటే తమవని రెండు తెలుగు రాష్ట్రాలు తన్నుకుంటున్నాయి. ఇంతకీ ఇంతటి వివాదానికి కారణమైన సాగర్ చరిత్ర ఏంటో ఓ సారి చూద్దాం.
 
తెలంగాణలోని నల్గొండ జిల్లా, ఆంద్ర ప్రదేశ్లోని గుంటూర్ జిల్లాల మధ్య కృష్ణా నదిపై నిర్మింపబడిన జలాశయాన్ని నాగార్జున సాగర్.ఇది ఒక బహుళార్థసాధక ప్రాజెక్టు.  1955 డిసెంబర్ 10న నాటిప్రధాని జవహర్ లాల్ నెహ్రూ శంకుస్ధాపన చేసారు. 1967 నాటికి ఈ డ్యాంకు చెందిన కుడి, ఎడమ కాల్వలకు అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని నీటిని విడుదల చేశారు.

కుడి కాలువని జవహర్ కాలువ గా నామకరణం చేశారు. ఈ కాలువ కింద గుంటూరు, ప్రకాశం జిల్లాలకు నీరు విడుదలవుతుంది. కుడి కాలువ పొడవు: 203 కి.మీ.
జిల్లా ఆయకట్టు, ఎకరాల్లో
గుంటూరు జిల్లా 6,68,230
ప్రకాశం జిల్లా 4,43,180
మొత్తం 11,11,410
 
ఎడమ కాలువను లాల్ బహదూర్ కాలువ గాను పేరు పెట్టారు. ఎడమ కాలువ ద్వారా నల్గొండ, కృష్ణా, ఖమ్మం జిల్లాలకు సాగునీరు సరఫరా అవుతుంది. ఎడమ కాలువ పొడవు: 179 కి.మీ.

జిల్లా ఆయకట్టు, ఎకరాల్లో
నల్గొండ జిల్లా 3,72,970
ఖమ్మం జిల్లా 3,46,769
కృష్ణా జిల్లా 4,04,760
మొత్తం 11,24,500
 
విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం

నది దిగువకు నీరు విడుదలయ్యే చోట నిర్మించిన కేంద్రంలో  810 మె.వా.
కుడి కాలువకు నీరు విడుదలయ్యే చోట  90మె.వా.
ఎడమకాలువకు నీరు విడుదలయ్యే చోట  60 మె.వా.
మొత్తం ఉత్పత్తి  960 మె.వా.
 
రాష్ట్ర విభజనతో చిక్కులు
అంతవరకూ ఇరు ప్రాంతాలలో పంటల సాగునకు దన్నుగా నిలిచిన నాగార్జున సాగర్ వివాదాలకు నిలయంగా మారింది. రాష్ట్ర విభజన సమయంలో కుడి కాలువను ఆంధ్రప్రదేశ్ కు, ఎడమ కాలువను తెలంగాణకు కేటాయించారు. విద్యుత్ ఉత్పత్తి రెండు ప్రాంతాలకు కేటాయించారు. సాగు భూముల దామాషా ప్రకారం నీటిని కూడా పంచుకోవాలని నిర్ణయించారు. ఈ బాధ్యత మాత్రమే కృష్ణ బోర్డు ఇచ్చారు. ప్రాజెక్టు నిర్వహణ వంటి బాధ్యతలను కేంద్రమే తీసుకుంది.

ఇంత కాలం నీటిని వినియోగించుకున్నారు. అయితే లెక్కల ప్రకారం గుంటూరు, కృష్ణ, ప్రకాశం జిల్లాలకు రావాల్సిన సాగు నీరు మార్చి చివర వరకూ రావాలని ఆంధ్రప్రదేశ్ వాదిస్తోంది. కనీసం 7 వేల క్యుసెక్కల నీరు రావాల్సి ఉండగా కేవలం 2 వేల క్యుసెక్కుల నీరు విడుదల చేసి తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లోని రైతులకు తీరని అన్యాయం చేస్తోందని ఆంధ్రప్రభుత్వం ఆరోపిస్తోంది.

అయితే ఇప్పటికే తీసుకోవాల్సిన నీటికంటే ఎక్కువ నీటిని విడుదల చేసుకున్నారని ఇంకా ఉన్న నీరు విడుదల చేసుకుంటే తమ పంట పొలాలు, తాగునీటికి కష్టాలు ఏర్పడుతాయని తెలంగాణ వాదిస్తోంది. అయితే ప్రస్తుతానికి 832 అడుగుల నీటి మట్టం మాత్రమే ఉంది. అయితే ఇందులో మరో 30 అడుగుల లోతులో 55 టీఎంసీల నీరు మాత్రమే ఉందని తెలంగాణ చెబుతోంది, ఉన్న నీటిని విడుదల చేయడానికి వీలు లేదని వాదిస్తోంది. ఆంధ్రప్రదేశ్ మాత్రం విడుదల చేయకపోతే ఆంధ్ర రైతు తీరని నష్టాలను చవి చూడాల్సి వస్తోందని వాదిస్తోంది.

ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల అధికారులు పోలీసులు శుక్రవారం సాక్షాత్తు నాగార్జున సాగర్ మీదనే కలబడ్డారు. తగువు తీర్చి బాగాలు పంచాల్సిన కేంద్రం ఛోద్యం చూస్తూ నిలబడింది. చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన సాగర్ తెలుగు రాష్ట్రాలకు మధ్య వివాదాలకు కేంద్రంగా నిలుస్తోంది. ఈ వివాదం ఎటు దారి తీస్తుందో...