శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Selvi
Last Updated : మంగళవారం, 25 ఆగస్టు 2015 (19:00 IST)

చంద్రబాబు సైలెంట్.. జగన్ తంతూ అంతేనా.. హోదా గోవిందా!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీకి ప్రత్యేక హోదా రాదని స్పష్టం చేయడంపై ప్రతిపక్ష పార్టీ అయిన వైకాపా మండిపడుతోంది. కేంద్రంతో ఉన్న లోపాయకారీ ఒప్పందం వల్లే ప్రత్యేక హోదాపై చంద్రబాబు మౌనంగా, మిన్నకుండిపోయారని విమర్శించారు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకే రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద చంద్రబాబు తాకట్టు పెట్టారని జగన్ విమర్శించారు. 
 
దేశ రాజధాని ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు కానీ, కేంద్ర ప్రభుత్వ పెద్దలు కానీ ప్రత్యేక హోదాపై మాట్లాడకపోడం దారుణమన్నారు. ప్రత్యేక హోదా ప్రజల హక్కు అని, దాన్ని ఎలాగైనా సాధించుకుంటామన్నారు. అయితే జగన్ కూడా ప్రత్యేక హోదా విషయంలో సైలెంట్‌గానే ఉన్నారనే విమర్శలొస్తున్నాయి. ముఖ్యంగా ఆయనపై ఉన్న ఆస్తుల కేసు మెడలో గుదిబండలా మారిందనీ, అందువల్ల కేంద్రంతో నేరుగా ఢీకొనేందుకు కాస్త జంకుతున్నారనే వాదనలు కూడా వినబడుతున్నాయి.
 
జగన్ ప్రధాన ప్రతిపక్షంలో ఉండి ఏపీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమాత్రం పోరాటాలు చేయట్లేదని, ఒకవేళ అసెంబ్లీ ఏర్పాటైనా.. సమావేశాల్లో చర్చలు మినహా కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం జరిగే రచ్చే అధికంగా ఉందని ప్రజలు వాపోతున్నారు. రేపో ఎల్లుండో ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లోనూ ఇవే రిపీట్ అవుతాయనే విమర్శలు వస్తున్నాయి.
 
ప్రత్యేక హోదాపై తిరుపతిలో ప్రకటన చేసిన అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి.. ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. ప్రస్తుతం అధికారంలోకి వచ్చాక మాట మార్చి ప్యాకేజీలు ఇస్తాననడం.. హోదాపై నోరెత్తకపోవడం వంటివి చూస్తుంటే.. బీజేపీ కూడా మాటతప్పిన అపవాదును నెత్తినేసుకుని ఓటు బ్యాంకే కాదు.. వచ్చే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని రాజకీయ విశ్లేషకులు జోస్యం చెప్తున్నారు. ఏపీకి అన్యాయం చేసిన కాంగ్రెస్ తరహాలో బీజేపీ కూడా ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే.. అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. 
 
అలాగే చంద్రబాబుపై పదేపదే విమర్శలు గుప్పించే ప్రతిపక్ష నేత జగన్ కూడా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకపోతే.. ప్రజల ఆదరణను కోల్పోవడం ఖాయమని, పాలక పక్షాన్ని ధీటుగా ఎదుర్కొనలేకపోతే.. పరిస్థితి దారుణంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అసలు హస్తినలో తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులంటే హుందాగా వ్యవహరించే నేత, నాయకుడు కరువయ్యాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి ఏపీకి ప్రత్యేక హోదాను ప్రధాని మోదీ ప్రకటిస్తారో లేకుంటే పదేపదే ఏపీ నేతలను ఢిల్లీకి రప్పించుకుంటారో వేచి చూడాల్సిందే.