శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By IVR
Last Updated : గురువారం, 12 జూన్ 2014 (18:06 IST)

లోకేష్ కు బాబు 2019 లైన్? జగన్ 30 అన్నారట... జూ.ఎన్టీఆర్ ఎటు పవన్ ఎటు?

తెలుగుదేశం పార్టీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ కు కీలక బాధ్యతలు అప్పగించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. పార్టీపై పట్టు పెంచుకునేందుకు పరిపాలనకు సంబంధించిన విషయాలపై అవగాహన పెంచుకునేందుకు లోకేష్ కు చంద్రబాబు మార్గం సుగమం చేశారు. గత కొన్ని రోజులుగా నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలతో సంబంధం లేకుండా విడిగా పర్యటనలు చేసి తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం నిర్వహించారు.
 
అక్కడక్కడా ప్రచారంలో ఆయన తప్పడుగులు వేసినా ఏ మాత్రం వెరవకుండా ముందుకే సాగారు. గతంలో తెర వెనుకే ఉండి మంత్రాంగం నడిపిన లోకేష్ ఇప్పుడు ఏ మాత్రం వెరవకుండా బహిరంగంగా పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందు తన నివాసంలో నిర్వహించిన అధికారిక సమీక్షల్లో కూడా లోకేష్ ను కూడా కూర్చోపెట్టుకున్నారు.
 
ఢిల్లీ నుంచి కేంద్ర నాయకులు ఎవరైనా వచ్చినా కూడా చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా వారితో జరిగే సమావేశాల్లో పాల్గొంటున్నారు. మంగళవారం నాడు చంద్రబాబు నాయుడును ఆయన నివాసంలో బాబా రాందేవ్ కలిశారు. ఈ భేటీలో కూడా చంద్రబాబు నాయుడు తన తనయుడు లోకేష్ ను కూర్చోబెట్టుకున్నారు. ఓ వైపు కేంద్ర నాయకులతోపాటు అందరికీ లోకేష్‌ను పరిచయాలు చేయటం ద్వారా అనధికారికంగా చంద్రబాబు నాయుడు తన కొడుకును ‘రాజకీయ వారసుడి’గా ప్రకటించినట్లుగా ఉందని తెలుగుదేశం పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. 
 
ఆంధ్రప్రదేశ్ కు చెందిన  ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా తన పాత్ర ఉండేలా చేసుకునేందుకు లోకేష్ తన స్నేహితుడు అయిన అభీష్ట్‌ను చంద్రబాబు వద్ద ఓఎస్డీగా నియమించేలా చేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవహారాలపై లోకేష్ ఇప్పటికే ఇంచుమించు పట్టు సాధించినట్లు చెప్పవచ్చు. పార్టీలో ప్రజల్లో బలం ఉన్న అసలైన నాయకులను పక్కన పెట్టి కార్పొరేట్ అధిపతులను పక్కన చేర్చుకోవటంలో లోకేష్ కీలక పాత్ర పోషించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 
 
ప్రస్తుతం చంద్రబాబు కోటరీలో కీలకంగా వ్యవహరిస్తున్న సుజనా చౌదరి, గరికపాటి మోహన్ రావు, నారాయణ విద్యా సంస్థల అధిపతి నారాయణ, సీఎం రమేష్ తదితరులు అంతా లోకేష్ కు అత్యంత సన్నిహితంగా ఉన్నవారే. వీరంతా కూడా లోకేష్ మనుషులుగానే పార్టీలో ప్రచారం ఉంది. ఈ కారణంతోనే వారికి చంద్రబాబు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. 
 
ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబునాయుడు అధికారంలోకి రావటంతో రాబోయే రోజుల్లో అటు పార్టీలోనూ… ఇటు ప్రభుత్వంలోనూ లోకేష్ పాత్ర గణనీయంగా పెరిగే అవకాశం ఉందని తెలుగుదేశం శ్రేణులు అంచనా వేస్తున్నారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ కీలక నేతగా అవతరిస్తాడని అందరూ భావించారు. కానీ చంద్రబాబు, లోకేష్ లు వ్యూహాత్మకంగా ఎన్టీఆర్ ను పూర్తిగా పక్కన పెట్టడంలో విజయం సాధించారు. 
 
అందుకే గత ఎన్నికల ప్రచార సమయంలో కనీసం జూనియర్ ఎన్టీఆర్ ను ఫోన్ చేసి పిలువటానికి కూడా ఆసక్తి చూపని చంద్రబాబు… పవన్ కళ్యాణ్ ను మాత్రం ఇంటికి వెళ్లి మరీ ప్రచారానికి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఇది తెలుగుదేశం పార్టీలో ఒకింత దుమారం రేపిన సంగతి తెలిసిందే. లోకేష్ కేవలం చంద్రబాబు కుమారుడిగానే కాకుండా… బాలకృష్ణ అల్లుడు కూడా కావటంతో ఎన్టీఆర్ కుటుంబ సభ్యుడిగా పార్టీపై ఆధిపత్యం పోకుండా చేసుకునేందుకే చంద్రబాబు ముందస్తు వ్యూహం రచించారని పార్టీ నేతలు ఆంతరంగిక సంభాషణల్లో వ్యాఖ్యానిస్తున్నారు. 
 
ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు కూడా ఇదే విషయాన్ని నిర్ధారించేలా సాగుతున్న సంగతి తెలిసిందే. కనుక 2019 ఎన్నికలకు అప్పుడే లోకేష్ బాబుకు చంద్రబాబు లైన్ క్లియర్ చేస్తున్నారన్నమాట. ఐతే ఇక్కడ ట్విస్ట్ ఏమంటే, జగన్ మోహన్ రెడ్డి 2019 నుంచి తదుపరి 30 ఏళ్లు తానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతానని జోస్యం చెపుతున్నారట. అంటే... నారా లోకేష్ ఎట్టి పరిస్థితుల్లో గెలవలేరన్నదే ఆయన నమ్మకం కాబోలు. లేదంటే జూనియర్ ఎన్టీఆర్ నేరుగా వెళ్లి పవన్ తెదేపాకు ప్రచారం చేసినట్లు వైకాపాకు చేస్తారేమో...? చూద్దాం పొలిటికల్ డ్రామాలు.