గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Selvi
Last Updated : శనివారం, 27 డిశెంబరు 2014 (17:04 IST)

2014 మోడీయిజమ్ : ఛాయ్‌వాలా ఈజ్ సూపర్ పీఎమ్!

2014 నరేంద్ర మోడీ ఇయర్. ఛాయ్‌వాలా ప్రధాని అయిన సంవత్సరం. అక్రమాలు, అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడి.. సామాన్యుడు.. ఛాయ్‌వాలా.. గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ ప్రధానమంత్రిని చేస్తూ సాదరంగా స్వాగతం పలికిన 2014.. రాష్ట్రంలోనే కాదు.. దేశ రాజకీయాల్లోనూ పెను మార్పులనే సృష్టించింది. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న యూపీఏ సర్కారును మోడీయిజం గద్దె దించింది. అవినీతికి చెక్ పెట్టే దిశగా మోడీ చేసిన ప్రచారం ప్రజలను పెద్దఎత్తున ఆకట్టుకుంది. అప్పటికే కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన ప్రజలకు మోడీ భాష్యం కొత్త ఊపిరినిచ్చింది. దేశ ప్రజలంతా రాజకీయాల్లోనూ వారసత్వం వద్దనుకున్నారు. సామాన్యులు రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. ఓటు వేసే తామంతా వెర్రివెంగళప్పలు కామని నిరూపించుకున్నారు. 
 
ప్రజలంటే రాజకీయ నేతలు, రాజకీయ వ్యవస్థలు భయపడేలా చేశారు. తమ చేతుల్లోనూ దేశ భవిష్యత్తును మార్చే సత్తా ఉందని నిరూపించుకున్నారు. అందుకే ప్రజల్లో ఏర్పడిన మార్పు.. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి శ్రీకారం చుట్టింది. ఛాయ్‌వాలాను ఏకంగా ప్రధానిని చేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలంటూ ప్రజలు మోడీకి తమ ఓటు హక్కు ద్వారా బాధ్యత అప్పగించారు.
 
ఇందులో భాగంగా... 2014 సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు పూర్తి మెజారిటీ సాధించిపెట్టిన నరేంద్ర మోడీ మే 26న దేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ట్విట్టర్లో రికార్డులు సృష్టించిన మోడీ.. తర్వాత ఫేస్ బుక్, ప్రభుత్వ వెబ్ సైట్‌ల పేరిట పాలనను పారదర్శకంగా ప్రజలకు చూపెట్టారు. ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం పేరిట ప్రారంభించిన వెబ్ సైట్‌లో ప్రజల అభిప్రాయాలను తెలియజేసేందుకు అవకాశం కల్పించారు. 
 
తన పర్యటనలు, తన అభివృద్ధి కార్యక్రమాలు వాటి వివరాలను, ఫోటోలను అప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూసుకుంటున్నారు. ప్రమాణ స్వీకారం రోజునే ఇతర దేశాలకు చెందిన ప్రముఖ నేతలను ఆహ్వానించారు. వారితో ద్వైపాక్షిక సంబంధాలకు అప్పుడే పునాది వేశారు. కానీ దురదృష్టవశాత్తు పాకిస్థాన్‌తో చర్చలకు నరేంద్ర మోడీ సుముఖం వ్యక్తం చేసినా... పాకిస్థాన్ తన బుద్ధేంటో చూపించింది. 
 
కానీ పొరుగు దేశాలతో మోడీ సత్సంబంధాల కోసం ఆ దేశాల్లో పర్యటించారు. బంగ్లాదేశ్‌తో ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగించేందుకు తగిన చర్యలు, చర్చలు సాగించారు. ఆస్ట్రేలియా, అమెరికా, జర్మనీ, జపాన్ వంటి అగ్రదేశాల్లో పర్యటించి, విదేశీ గడ్డపై తన వాక్చాతుర్యతను చాటుకున్నారు. ప్రధానిగా మోడీ విదేశీ పర్యటనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 
 
ఇక దేశంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో మొదలయ్యాయి. వీటిలో జన్ ధన్ యోజన పథకం, మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్, ప్లానింగ్ కమిషన్ అవుట్, టాయిలెట్స్ ఇన్ స్కూల్స్, దారిద్ర్యాన్ని రూపుమాపడం, స్వదేశంలోనే ఉత్పత్తి నిష్పత్తిని పెంచేందుకు వీలుగా జీరో డిఫెక్ట్-జీరో ఎఫెక్ట్ వంటి పథకాలను అమలుపరిచేందుకు నడుం బిగించారు. 
 
అంతేగాకుండా.. డిజిటల్ ఇండియా కోసం గ్రామాలను డిజిటల్ విలేజ్‌లుగా మార్చేందుకు శ్రీకారం చుట్టారు. ఎంపీలందరూ గ్రామాలను దత్తత తీసుకోవాలని హితవు పలికారు. సెలబ్రిటీలకూ కూడా గ్రామాలను దత్త తీసుకోవాలని పిలుపునిచ్చారు. 
 
మోడీ పిలుపు మేరకే సచిన్ టెండూల్కర్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఉన్న పుత్తరాజుకండ్రిగను దత్తపుత్రికగా స్వీకరించారు. స్వాతంత్య్రదినోత్సవం ప్రసంగంలో చేపట్టిన ఈ పథకాలన్నింటినీ మోడీ మెల్లమెల్లగా అమలు చేస్తూనే ఉన్నారు. వీటిలో స్వచ్ఛభారత్, పేదలకు ప్రధాని బ్యాంక్ అకౌంట్లు, గ్రామాలను దత్తత తీసుకోవడం వంటి పథకాలకు మంచి క్రేజ్ లభించింది. ఇలా మోడీ మాటలకే పరిమితం కాకుండా దేశాభివృద్ధి కోసం కొత్త కొత్త సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు రాజకీయాల్లో పెను మార్పు ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యారు.