గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: శనివారం, 29 నవంబరు 2014 (14:01 IST)

జీవిత బీమా : మోదీ మార్పుల మాయాజాలం... నడ్డి విరిగేది ఎవరికి...?

గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలలో మార్పులు అనివార్యమని నరేంద్ర మోది పదేపదే చెబుతుంటే ఆ మార్పులతో జనానికి ఎక్కడలేని మేలు ఒనగూరుతుందని భావిస్తే అత్యాశే అవుతుంది. చాయ్‌వాలాగా జీవితాన్ని ప్రారంభించినా... సామాన్య ప్రచారక్‌గా జీవితాన్ని సాగించినా.. పాలకులు అయిన తరువాత వారు చేప్పే మార్పుల్లోని పరమార్థాలు వేరుగానే ఉంటాయనేది ఎందరో రాజకీయ నాయకుల ద్వారా నిరూపితమయ్యింది. మోదీ కూడా ఇందుకు భిన్నమేమి కాదు. ఆయన చెప్పే మార్పుల వెనుక కార్పొరేట్లు దాగి ఉన్నారనే విమర్శలు వస్తున్నాయి.
 
సవరణబిల్లుతో మోదీ ప్రభుత్వం బీమా రంగంలో మార్పులకు శ్రీకారం చుట్లాలని ప్రయత్నం చేస్తోంది. ఆ సవరణ బిల్లును లోక్ సభలో ఆమోదింప జేసుకుని రాజ్యసభ ముంగిటకు తీసుకు వచ్చారు. ఇందులో సారాంశం ఏమిటంటే విదేశీ పెట్టుబడుల వాటాను 24 నుంచి 49 శాతానికి పెంచడమే. దాని వలన వచ్చిన నష్టం ఏమిటీ...? అని రాగాలు తీసి కొత్త అర్థాలూ చెప్పేవారూ లేకపోలేదు. బీమా రంగాన్ని ఒక్కసారి పరిశీలిస్తే. 
 
1956కు ముందు కనీసం 200 ప్రైవేటు బీమా సంస్థలు భారతదేశంలో రాజ్యమేలుతున్నాయి. అయితే అవి ఎక్కడా ఎలాంటి పరిస్థితులలోనూ ప్రజల విశ్వాసాన్ని చూరగొనలేపోయాయి. బీమా రంగంలో ప్రజల భాగస్వామ్యాన్ని పటిష్టం చేసి దేశ మౌళిక స్థితిగతులను మార్చాలన్న ఉద్దేశ్యంతో అప్పటి ఆర్థిక మంత్రి పిడి దేశ్‌ముఖ్ నాటి ప్రధాని నెహ్రూ ఆమోదంతో ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. అదే భారతీయ జీవిత బీమా సంస్థ స్థాపనకు పునాది వేసింది. అందుకు అనుగుణంగానే 1956 సెప్టెంబర్ 1న రూ.5 కోట్ల మూలధనంతో భారత ప్రభుత్వం ఎల్ఐసిని స్థాపించింది. 
 
ఇందులో కనీసం 1.5 లక్షల మంది ఉద్యోగులు, 11.5 లక్షల మంది ఏజెంట్లు, 30 కోట్ల మంది పాలసీదారులు ఉన్నారు. మౌళిక వసతుల కల్పనకు జీవిత బీమా సంస్థను భాగస్వామ్యం చేశారు. దీనికి వచ్చే ప్రిమియంలో 90 శాతం మౌళిక వసతుల కల్పనకు వెచ్చించాలని చట్టం రూపొందించారు. 
 
ఈ ప్రకారం ఇప్పటివరకూ రూ. 5.73 వేల కోట్ల పెట్టుబడులు పెట్టారు. పైగా డివిడెండ్ రూపంలో ప్రతీఏడు కనీసం రూ. 500 కోట్ల పైచిలుకు చెల్లిస్తున్నారు. ప్రస్తుత పంచవర్ష ప్రణాళికలో కేంద్ర ప్రభుత్వానికి రూ. 3.27 లక్షల కోట్లు, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 7లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు. దాదాపు రూ. 2 లక్షల కోట్లు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టారు. మొత్తంపై ప్రభుత్వంలో రూ. 16 లక్షల కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఈ రోజుకు మహా నవరత్నాలయిన బిహెచ్ఈఎల్, కోల్ ఇండియా లిమిటెడ్, గెయిల్, ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్, ఎన్‌టిపిసి, ఆయిల్ అండ్ నాచురల్ గాస్ కార్పోరేషన్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లలో ఎల్ ఐ సి పెట్టుబడులు పెట్టింది. వాటి ఆర్థిక పరిపుష్టికి తన సహకారం అందిస్తోంది. 
 
ఇంతటి పెద్ద బీమా సంస్థ పరిపుష్టిని కొల్లగొట్టేందుకు కార్పోరేట్ రంగ సంస్థలు వ్యూహం రచించాయి. ఇందులో భాగంగానే 2001లో జరిగిన కొన్ని సంస్కరణల కారణంగా బీమా రంగంలో పలుమార్పులు వచ్చాయి. బీమా రంగంలో 24 స్వదేశీ ప్రైవేటు బీమా సంస్థల్లో 26 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనుమతించారు. దీనికి వంకలు కూడా చెప్పారు. గ్రామీణ ప్రాంతాలలో భారతీయ బీమా సంస్థ అంత బలంగా లేదనీ, అందుకోసం ఈ పెట్టుబడులను అనుమతిస్తున్నట్లు చెప్పారు. పైగా దేశంలోకి 800 బిలియన్ డాలర్ల నిధులు వరదలా వస్తాయని నమ్మబలికారు. 
 
కానీ వాస్తవానికి ఈ 14 ఏళ్ళ అనుభవంలో గ్రామీణ ప్రాంతాలలో ప్రైవేటు సంస్థలేవి లక్ష్యాల సమీపానికి కూడా రాలేకపోయాయి. చివరకు భారతీయ జీవిత బీమా సంస్థనే ముందుంది. పైగా విదేశీ నిధులు 800 కాదు కదా కనీసం 80 బిలియన్ డాలర్లు కూడా రాలేదు. పైగా ఈ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన కంపెనీలన్నీ విదేశాలలో పూర్తిస్థాయిలో చేతులెత్తేసినవే. ఇక అమెరికాలో అయితే బెయిల్ అవుట్ అయినవే.  వీటికే మరింత అవకాశం కలిగిస్తూ విదేశీ పెట్టుబడులను 26 శాతం నుంచి 49 శాతానికి పెంచుతూ సవరణ బిల్లులో ప్రతిపాదించారు. దీని అర్థం ఏమిటి? కేవలం 26 శాతంతోనే జనాన్ని ఊదరగొట్టి ప్రీమియంలను పెంచుకున్నా సంస్థలు ఆ తరువాత చేతులెత్తేసి నష్టాలను చవిచూపించారు. రెండింతలు, మూడింతలు అవుతాయని చెప్పి మూడేళ్ల లోపే కట్టిన ప్రీమియంలో సగం మాత్రమే చేతిలో పెట్టిన సంస్థలు ఎన్నో ఉన్నాయి. 
 
అయినా సరే ప్రభుత్వం అదే సంస్థలకు అనుకూలంగా 26 శాతం పెట్టుబడులను 49 శాతానికి పెంచే ప్రయత్నాలు మొదలుపెట్టేసింది. ఇదే జరిగితే భారతీయ జీవిత బీమా సంస్థకు పరోక్షంగా ఎదురుదెబ్బ తప్పదు. ఎల్ఐసి ప్రీమియం ద్వారా వచ్చే సొమ్ము 90 శాతం మౌళిక వసతుల కల్పనకు ఉపయోగపడుతుంటే, ప్రైవేటు సంస్థ ద్వారా వచ్చే ప్రీమియం ఒక్క శాతం కూడా దేశానికి ఉపయోగపడదు. నేరుగా విదేశాలకు వెళ్ళిపోతుంది. ఈ లెక్కన అంతర్జాతీయ మార్కెట్టులో రూపాయ మరింత బక్కచిక్కి పోతుంది. ఇది మరిన్న దుష్పలితాలు దారి తీస్తుంది. మరోవైపు ప్రజల సొమ్ముకు భరోసా ఎక్కడా కనిపించదు. విదేశీ పెట్టుబడులకు కేంద్రప్రభుత్వం పూచీగా ఉండాల్సి వస్తుంది. ఇలా ప్రమాదాలున్నా బీమా సవరణ బిల్లుకు ఎందుకు అనుతిస్తున్నారో ఏలిన వారికే తెలియాలి.

- పుత్తా యర్రంరెడ్డి, సీనియర్ పాత్రికేయులు