బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: సోమవారం, 27 అక్టోబరు 2014 (18:33 IST)

'బ్లాక్' మనీ లీడర్ల లిస్ట్... 2019 వరకూ మోడీ సర్కార్ రిలీజ్ చేస్తుందా...?

ఇప్పుడు దేశంలో ప్రతి ఒక్కరూ చర్చిస్తున్న అంశం నల్లడబ్బు. విదేశాల్లో మనదేశంలోని బడా బాబులు కోట్ల రూపాయలు దాచుకున్న డబ్బును వెలికి తెచ్చేందుకు ప్రయత్నిస్తామని ఎన్డీఎ ప్రభుత్వం గత ఎన్నికల సమయంలోనే చెప్పింది. అన్నమాట ప్రకారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ తొలి దఫా ప్రకటించిన జాబితాలో రాజకీయ నాయకుల పేర్లు లేకపోవడం చర్చనీయాంశమైంది. కేవలం ముగ్గురు పేర్లను మాత్రమే ప్రస్తావించడంతో మిగిలిన వారు ఎవరన్న సస్పెన్స్ సాగుతోంది.
 
ఐతే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మొదటి జాబితాలో వ్యాపారవేత్తలే ఉన్నారు. రాజకీయ నాయకుల పేర్లు విడుదల అనేది మెల్లమెల్లగా సాగుతుందనే వాదనలు వినబడుతున్నాయి. కేంద్రం విడుదల చేసిన పేర్లలో డాబర్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రదీప్ బర్మన్, రాజ్ కోట్‌కు చెందిన పారిశ్రామిక వేత్త పంకజ్ చిమన్ లాల్, గోవాకు చెందిన గనుల యజమాని రాధా ఎస్ టింబ్లోల పేర్లను కేంద్రం తెలిపింది. 
 
మరోవైపు.. భారతీయ నల్లధన కుబేరుల జాబితాలో నలుగురు కాంగ్రెస్ నేతలున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నలుగురిలో ఓ వ్యక్తి మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో జూనియర్ మంత్రిగా పనిచేశారని కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం. మిగిలిన ముగ్గురిలో మహారాష్ట్ర కాంగ్రెస్‌లో కొనసాగుతున్న ఓ కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులుండగా, ఉత్తర ప్రదేశ్‌కు చెందిన మాజీ పార్లమెంట్ సభ్యుడు ఒకరు ఉన్నట్టు సమాచారం. 
 
కాగా నల్లధనం ఖాతాదారుల పేర్ల వెల్లడిలో భాగంగా ముగ్గురి పేర్లను కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ రూపంలో వెల్లడించగా, ఇందులో డాబర్ కంపెనీ మాజీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ప్రదీప్ బర్మన్ పేరును పేర్కనడాన్ని ఆ సంస్థ తీవ్రంగా ఆక్షేపించింది. ఇదే అంశంపై సంస్థ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. 
 
ప్రదీప్ బర్మన్ ఎన్ఆర్ఐగా ఉన్నప్పుడే ఖాతా ఓపెన్ చేశారు. చట్టబద్ధంగా ఈ ఖాతా తెరవడానికి అనుమతి ఉంది. మేము అన్ని చట్టాలను అనుసరించాం. ఖాతాకు సంబంధించిన అన్ని వివరాలు చట్టం ప్రకారం, ఆదాయపన్ను శాఖకు అనుగుణంగానే ఉన్నాయి. అంతేకాక సరైన క్రమంలోనే పన్నులు చెల్లిస్తున్నాం. కాబట్టి, విదేశీ ఖాతా ఉన్న ప్రతి వ్యక్తిపై అదే రంగు పులమడం దురదృష్టకరం. దీనికి సంబంధించి వివరణ సుప్రీంకోర్టుకే తెలియజేస్తామని ఆ సంస్థ తన ప్రకటనలో పేర్కొంది. అలాగే మిగిలిన ఇద్దరు వ్యక్తుల పేర్లను కూడా ఈ జాబితాలో చేర్చడాన్ని డాబర్ సంస్థ తప్పుబట్టింది. 
 
ఐతే నల్లధన ఖాతాదారులు ఎలా సమర్థించుకుంటారన్నది తర్వాతి విషయం కానీ... ఇక వచ్చే ఐదేళ్లలోపు రాజకీయ నాయకుల చిట్టా నల్లధన కుబేరుల జాబితాలో మెల్లగా జాలువారుతూ ఉంటుందనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. చూడాలి మరి.