మంగళవారం, 19 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Eswar
Last Modified: గురువారం, 31 జులై 2014 (13:55 IST)

ఆగస్టు 7న సోనియా, రాహుల్ గాంధీలు కోర్టు బోనులో నిలుచుంటారా...?

అప్పుడన్నీ ఆదేశాలే. కంటి చూపుతోనే వ్యవహారాలు చక్కబెట్టేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. మోడీ వచ్చీ రావడంతోనే.. ఆత్మరక్షణలో పడ్డారు. కోర్టు కేసులూ అదనంగా వచ్చి చేరాయి. ఇక ఢిల్లీ తల్లీకొడుకులు.. అదే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పోరుబాట పట్టారు.
 
ఆగస్టు 7 న గాంధీలు హాజరు కావాలి-కోర్టు 
హెరాల్డ్ కేసులో న్యాయస్థానంలో తేల్చుకునేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా, రాహుల్ సిద్ధమవుతున్నారు. బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి వేసిన కేసులో తల్లితనయులకు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఆగస్టు 7న స్వయంగా కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఛీటింగ్, నమ్మక ద్రోహానికి పాల్పడ్డారంటూ సుబ్రహ్మణ్యప్వామి చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సిందిగా న్యాయస్థానం కోరింది. ఈ ఆదేశాలను కాంగ్రెస్ అధినాయుకులు సవాలు చేస్తూ పిటిషన్‌ దాఖలు చేశారు.
 
నేషనల్ హెరాల్డ్ ఆస్తులను కాంగ్రెస్ సొంతం చేసుకుంది 
ఢిల్లీలోని విలువైన ఆస్తులను సొంతం చేసుకునేందుకు గాంధీలు ఇద్దరూ చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించారు. స్వాతంత్రానికి ముందే జవహర్ లాల్ నెహ్రూ ప్రారంభించిన నేషనల్ హెరాల్డ్ పత్రికకు చెందిన ఆస్తులు కూడా గాంధీ కుటుంబం సొంతం చేసుకున్న ఆస్తుల్లో ఉన్నాయని కోర్టుకు విన్నవించారు. ఈ కేసును విచారిస్తున్న మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ గోమతి మనోచా ప్రాథమికంగా నిందితులపై ఆధారాలున్నాయని అభిప్రాయపడ్డారు. 
 
న్యాయస్థానం ముందు నిందితులు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించారు. హాజరు కావాల్సిన నిందితులు కాంగ్రెస్ అధినాయకులు సోనియా, రాహుల్ కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
 
యంగ్ ఇండియన్‌కు కాంగ్రెస్‌ రూ.90 కోట్ల రుణం-స్వామి 
కాంగ్రెస్ పార్టీ తమ నేతలపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చుతూ వస్తోంది. బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందంటూ ప్రతిదాడికి దిగింది. రాజకీయ పార్టీల అన్నిరకాల ఆదాయాలకు పన్ను మినహాయింపు ఉంటుందని కంగ్రెస్ పార్టీ వాదిస్తోంది. అయితే చట్ట విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ యంగ్ ఇండియన్ అనే సంస్థకు 90 కోట్ల రూపాయిల రుణం ఇచ్చిందన్నది స్వామి ఆరోపణ. ఆ సంస్థలో గాంధీ కుటుంబానికి అత్యధిక షేర్లు ఉన్నాయి.. రాజకీయపార్టీలు వ్యాపార కార్యరలాపాలకు రుణాలు ఇవ్వకూడదనే నిబంధనను స్వామి ఉటంకిస్తున్నారు.
 
యంగ్‌ ఇండియా లాభాపేక్షలేని సంస్థ- కాంగ్రెస్‌ 
నేషనల్ హెరాల్డ్ సహా మూడు వార్తాపత్రికలను నడుపుతున్న అసోసియేటెడ్ జర్నల్‌ను యంగ్ ఇండియన్ సంస్థ కొనుగోలు చేసింది. ఆ పబ్లిషింగ్ కంపెనీకి ఉన్న వేలాది కోట్ల ఆస్తులను సొంతం చేసుకోవడమే ఈ వ్యవహారాల వెనుక ఉన్న ఉద్దేశమని స్వామి ఆరోపణ. అయితే యంగ్ ఇండియన్‌ లాభాపేక్షలేని సంస్థ అని, దాని డైరెక్టర్లెవరూ కనీసం పారితోషకం కూడా తీసుకోవడం లేదన్నది కాంగ్రెస్ వాదన. చివరకు ఈ కేసు ఏమలుపు తీసుకుంటుందోనన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.