శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By chj
Last Modified: మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (13:59 IST)

నేడు జాతీయ సైన్స్ దినోత్సవం... ప్రపంచానికి భారతీయుల సైన్స్ సత్తా చాటిన రామన్ ఎఫెక్ట్

విశ్వవిఖ్యాత సైంటిస్టు ''భారతరత్న'' డాక్టర్‌ సి.వి. రామన్‌ తన అనన్య సామాన్య పరిశోధనా సామర్ధ్యంతో ఫిజిక్స్‌ రంగంలో ''రామన్‌ ఎఫెక్ట్‌'' కనుగొని చరిత్ర సృష్టించిన ఫిబ్రవరి 28నే జాతీయ సైన్స్‌ దినోత్సవంగా జరుపుకొంటున్నాం. మన దేశంలో 1987 ఫిబ్రవరి నుండి ప్ర

విశ్వవిఖ్యాత సైంటిస్టు ''భారతరత్న'' డాక్టర్‌ సి.వి. రామన్‌ తన అనన్య సామాన్య పరిశోధనా సామర్ధ్యంతో ఫిజిక్స్‌ రంగంలో ''రామన్‌ ఎఫెక్ట్‌'' కనుగొని చరిత్ర సృష్టించిన ఫిబ్రవరి 28నే జాతీయ సైన్స్‌ దినోత్సవంగా జరుపుకొంటున్నాం. మన దేశంలో 1987 ఫిబ్రవరి నుండి ప్రతీ సంవత్సరం జాతీయ సైన్స్‌ దినోత్సవంగా భారత ప్రభుత్వం, ప్రజలు నిర్వహిస్తున్నారు. 1928 ఫిబ్రవరి 28న సి.వి. రామన్‌ ''రామన్‌ ఎఫెక్ట్‌'' కనుగొని ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచాడు. 
 
మనదేశంలో పుట్టి, మనదేశంలోనే చదువుకొని, మనదేశంలోనే పరిశోధన చేసి, తన అత్యంత విశిష్ట కృషికి గుర్తింపుగా ఫిజిక్స్‌లో మొట్టమొదటిసారిగా నోబెల్‌ బహుమతిని పొంది చరిత్ర సృష్టించిన మహనీయుడు రామన్‌. నోబెల్‌ బహుమతి పొందిన మొట్టమొదటి శ్వేతేతర శాస్త్రజ్ఞుడు రామన్‌ కావడం గర్వకారణం. అంత వరకూ సైన్సులో నోబెల్‌ బహుమతులు అన్నీ తెల్ల జాతీయులైన పాశ్చాత్యులకే లభించాయి. కాని, రామన్‌ నూటికి నూరుపాళ్ళూ భారతీయునిగా ఈ గడ్డపై, యిక్కడ చదువుకొని, తలమానికమైన పరిశోధన జరిపి సైన్సులో భారతీయుల శక్తిసామర్ధ్యాలను చాటిచెప్పిన విశిష్ట వ్యక్తి రామన్‌. 
 
అంతకుముందు 1913లో సాహిత్యంలో మనదేశం నుండి నోబెల్‌ బహుమతి పొందిన విశ్వకవి రవీంద్రనాధ్‌ ఠాగూర్‌ అనంతరం సైన్సు రంగంలో విజయఢంకా మ్రోగించిన అఖండ ప్రజ్ఞాశాలి రామన్‌ కావడం అందరికీ గర్వకారణం. రామన్‌ పరిశోధనలు సైన్సులో ఒక క్రొత్త విభాగం. ''రామన్‌ స్పెక్ట్రోస్కోపీ'' ఆవిర్భావానికి, శాస్త్రరంగంలోను, ఇండిస్ట్రియల్‌ రంగంలోను క్రొత్తపుంతలు త్రొక్కడానికి దారితీసింది. రామన్‌కు 1954లో ''భారతరత్న'', 1957లో ''లెనిన్‌ శాంతి బహుమతి'' లభించాయి. సి.వి. రామన్‌ ఆప్టిక్స్‌లో కాంతి ప్రసరణపై జరిపిన పరిశోధనలకు నోబెల్‌ బహుమతి లభించింది.
 
మెర్క్యూరీ ల్యాంప్ నుండి ఏకవర్ణ కాంతి తరంగాలను ఒక పారదర్శక యానకం గుండా ప్రసరింపజేస్తే, యానక ధర్మాలపై ఆధారపడి ఆ కాంతిలో కొంత భాగం వివర్తనం చెంది, తక్కువ తరంగధైర్ఘ్యం గల కాంతిగా బహిర్గతమౌతుంది. సముద్ర జలంపై ఇదే ప్రక్రియతో నీలిరంగు కాంతి బహిర్గతమవుతుంది. దీనినే ‘రామన్ ఫలితం’ (రామన్ ఎఫెక్ట్) అంటారు. రామన్ ఫలితాన్ని ఉపయోగించి, యానక పదార్థం యొక్క నిర్మాణాన్ని విశ్లేషించవచ్చు. ఈ విధంగా ఎన్నో పదార్థాల స్ఫటిక నిర్మాణాలను అవగతం చేసుకోవటానికి రామన్ ఫలితం ఉపయోగపడింది. 
 
భారతదేశానికి సంబంధించి ముఖ్యమైన సమస్యల పరిష్కా రంలో, మిగతా దేశాలతో మన దేశాన్ని సమవుజ్జీగా నిలపడంలో, ప్రపంచస్థాయిలో అగ్ర నాయకత్వ స్థితికి చేర్చడంలో, ఇలా ఇంకా ఎన్నో సాధించాలనుకోవడంలో, సాధించడంలో శాస్త్ర సాంకేతిక రంగాల పాత్ర, శాస్తజ్ఞ్రుల పాత్ర విలువకట్టలేనిది. జాతీయ స్థాయిలో సైన్స్‌ స్ఫూర్తిని చాటడం, వ్యాప్తి చేయడం ఈ జాతీయ సైన్స్ డే ముఖ్య లక్ష్యం.