గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pyr
Last Updated : బుధవారం, 16 సెప్టెంబరు 2015 (11:22 IST)

అమ్మో..! నెల్లూరు జిల్లానా...? వరుస దోపిడీలు... అంతరాష్ట్ర ముఠాల పనేనా..!?

అమ్మో...! నెల్లూరా..!! ఆదారిన పోవాలా..? అక్కడ ఎవరు దొంగో ఎవరు దొరో తెలియని స్థితి. అందునా రాత్రిళ్ళు ప్రయాణమా..! అయితే ఆలోచించాల్సిందే.. ఇదీ వరుస. నెల్లూరు జిల్లాలో రోడ్డు, రైలు మార్గాల ద్వారా ప్రయాణం చేయాలంటే జంకుతున్నారు. జాతీయ రహదారికి కావడంతో ఆ దారిన వెళ్ళాలంటే భీతిల్లుతున్నారు.
 
మొన్న రోడ్డున వెళ్ళే ద్విచక్రవాహనం.. నిన్న సింహపురి ఎక్స్‌ప్రెస్ సంఘటన, నేడు శేషాద్రి ఎక్స్‌ప్రెస్ సంఘటన. ఇవన్నీ దోపిడీలే. అందునా 15 రోజుల లోపునే ఈ సంఘటనలు జరగడం జనాన్ని భయపెడుతోంది. నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల సరిహద్దు జిల్లా కావడంతో దొంగలు రెచ్చిపోతున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి. 
 
పది రోజుల కిందట నెల్లూరు నుంచి చెన్నయ్ వైపు వెళ్లుతున్న ఓ మోటారు సైకిలిస్టును కొందరు దుండగులు అతనిపై దాడి చేశారు. మోటారు సైకిల్‌ను దోచుకెళ్లారు. ఇదిలా ఉండగానే నాలుగు రోజుల కిందట సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం చేస్తున్న ఓ ఐపీఎస్ అధికారిణిపైనే దొంగలు దాడికి దిగారు. ఆమె వద్ద నుంచి నగలు, నగదు దోచుకెళ్ళారు. ఈ రెండు కేసులు కనీసం ఓ కొలిక్కి రాక ముందే శేషాద్రి ఎక్స్‌ప్రెస్ సంఘటన ప్రయాణీకులను కలవర పెడుతోంది. పోలీసులకు సవాల్ విసురుతోంది. 
 
సిగ్నల్ దొరకకపోవడంతో ఆగిన శేషాద్రిపై మనుబోలు సమీపంలో దొంగలు దాడి చేశారు. ఎస్1, ఎస్2 బోగీలలో ప్రవేశించి మహిళలను బెదిరించారు. వారి వద్దనున్న 20 సవర్ల బంగారం, నగదు, సెల్‌ఫోన్లను దోపిడీ చేసి పారిపోయారు. ఈ వరుస సంఘటనలు జరగడంతో పోలీసులకు దిక్కుతోచని స్థితి ఏర్పడింది. 
 
నెల్లూరు జిల్లా ఇటు ఆంధ్రప్రదేశ్‌కు అటు తమిళనాడుకు సరిహద్దు ప్రాంతం కావడం అదే ప్రాంతంలో ప్రధాన జాతీయ దారి వెళ్ళుతుండడం, ప్రముఖ రైళ్ళన్నీ ఇదే దారిన ప్రయాణించడంతో దొంగలు ఈ ప్రాంతం అనువైనదిగా ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. దోపిడి చేసుకుని గంట కూడా ప్రయాణం చేయకుండానే రాష్ట్రాన్ని దాటిపోవచ్చు. రాష్ట్రాన్ని దాటిపోయిన తరువాత ఆ సంఘటనపై పోలీసులు అంతటి శ్రద్ధ వహించరు. అందుకే అంతరాష్ట్ర దొంగలు ఈ ప్రాంతాన్ని ఎన్నుకుని ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.