శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Eswar
Last Modified: సోమవారం, 11 ఆగస్టు 2014 (16:59 IST)

నేతాజీకి భారతరత్న వద్దు... మా ఎన్టీఆర్ పేరుందా...? తమ్ముళ్లు...

ఈ ఏడాది ఐదుగురికి భారతరత్న పురస్కారాలు ప్రకటించాలని ఎన్డీఏ సర్కార్‌ భావిస్తోంది. వాజ్‌పేయ్‌ ముందురువరసలో ఉండగా, దళిత నేత కాన్షీరామ్‌ పేరు కూడా వినిపిస్తోంది. సుభాష్‌ చంద్రబోస్‌ పేరు ఖారారైనట్టు వార్తలొస్తున్నా కుటుంబసభ్యులు మాత్రం స్వీకరించేందుకు సిద్ధంగా లేరు.
 
ముందువరుసలో వాజ్ పేయి 
అవార్డు అందుకునే వారి జాబితాలో వాజ్‌పేయి పేరు ముందు వరసలో ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీ తరపున తొలిసారిగా ప్రధాని పదవి చేపట్టిన వాజ్‌పేయికు భారతరత్న ఇవ్వాలని యూపీఏ హాయంలోనే బీజేపీ నేతలు డిమాండ్‌ చేశారు. ఇప్పుడు అదే పార్టీ అధికారంలోకి రావడంతో దాదాపు ఆయన పేరు ఖాయంగా కనిపిస్తోంది.
 
జాబితాలో కాన్షీరాం, మాలవ్య, ధ్యాన్ చంద్? 
బహుజన సమాజ్‌ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, దళిత నాయకుడు కాన్షీరాం పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. స్వాతంత్ర్య సమరయోధుడు, బెనారస్‌ హిందూ యూనివర్శిటీ వ్యవస్థాపకుడు మదన్‌ మోహన్‌ మాలవ్యాకు కూడా పురస్కారం దక్కుతుందని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. 
 
ఎన్నికల ప్రచారంలో భాగంగా వారణాసిలో ప్రసంగించిన నరేంద్రమోడీ, మదన్‌ మోహన్‌ మాలవ్య గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. మాలవ్య హిందూ మహాసభలో కీలక పాత్ర పోషించారు. ఇక హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్‌ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. గతంలో సచిన్‌కు భారతరత్న ప్రకటించిన సమయంలోనే ధ్యాన్‌చంద్‌కు ఇవ్వకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి.
 
నిరాకరిస్తున్న నేతాజీ కుటుంబ సభ్యులు 
నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు కూడా ఈ ఏడాది భారతరత్న ఖరారు చేసినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. అయితే ఆయన కుటుంబసభ్యులు మాత్రం భారతరత్న పురస్కారం స్వీకరించేందుకు ఆసక్తి చూపడం లేదు. ఆయనకు ఏ స్థితిలో ఇవ్వాలనుకుంటున్నారో చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. చనిపోయిన తర్వాత అవార్డు ఇస్తున్నట్టు ప్రకటిస్తే ఆయన మరణించినట్టు ఆధారాలు చూపగలరా? అని వారు ప్రశ్నిస్తున్నారు. 
 
1992లో ప్రకటించినప్పుడు తలెత్తిన ఇబ్బందులే వస్తాయని గుర్తు చేస్తున్నారు. నిజానిజాలు తెలిసేవరకు పురస్కారాన్ని తీసుకోవాలనుకోవడం లేదని నేతాజీ కుటుంబ సభ్యులంటున్నారు. ఇటీవలే సుమారు 60 మంది నేతాజీ బంధువులు, ఇతర కుటుంబసభ్యులు ఒకే వేదికపైకి వచ్చారు. నేతాజీ అదృశ్యానికి సంబంధించి సిట్టింగ్‌ జడ్జి పర్యవేక్షణలో విచారణ జరిపించాలని మోడీకి లేఖ రాస్తూ డిమాండ్‌ చేశారు. నేతాజీ అదృశ్యంపై చిక్కు వీడితే అదే తమకు అతిపెద్ద బహుమతి అని వారంటున్నారు.
 
ఎన్టీఆర్ పేరు లేనట్లే... 
ఎన్టీఆర్‌కు కూడా భారతరత్న ఇవ్వాలన్న మిత్రపక్షం టీడీపీ వాదనను బీజేపీ సర్కార్‌ పట్టించుకున్నట్టు లేదు. ఈసారి సవరించిన జాబితాలో ఆయన పేరు లేదని తెలుస్తోంది. మరికొంతమంది జాతీయ నేతల పేర్లు కూడా పరిగణనలోకి తీసుకోవాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ వాదన వినే స్థితిలో ప్రభుత్వం ఉన్నట్లు కనిపించడం లేదు.