గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ttdj
Last Updated : మంగళవారం, 2 ఆగస్టు 2016 (12:20 IST)

చంద్రబాబా... కుప్పంలో అభివృద్ధి ఎక్కడ...!.. పట్టించుకోని మొద్దబ్బాయ్!

నారా చంద్రబాబునాయుడు. ఈ పేరంటే తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లోను కాదు దేశంలో కూడా ఎవరూ ఉండరేమో. ఎందుకంటే 11 సంవత్సరాలపాటు ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేశారు.

నారా చంద్రబాబునాయుడు. ఈ పేరంటే తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లోను కాదు దేశంలో కూడా ఎవరూ ఉండరేమో. ఎందుకంటే 11 సంవత్సరాలపాటు ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాష్ట్ర రాజకీయాలనే కాదు దేశరాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఒకానొక దశలో దేశంలో సంక్షోభం వచ్చిన సమయంలో థర్డ్ ఫ్రంట్‌ కూటమిలో చేరి తెలుగుదేశం పార్టీని దేశరాజకీయాల్లోనే నిలబెట్టారు. 
 
అలాంటి చంద్రబాబునాయుడు ప్రస్తుతం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. పేరుకే కుప్పం ఎమ్మెల్యే అయినా ఆయన మాత్రం 13 జిల్లాలను అభివృద్ధి చేసే బిజీలో ఎప్పుడూ ఉంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనలో సొంత నియోజవర్గాన్ని బాబు పట్టించుకోవడం లేదన్న విమర్శలు లేకపోలేదు. ఎన్నో సంవత్సరాలుగా కుప్పంకు ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబునాయుడు అసలు ఆ నియోజవర్గంలో చేసిన అభివృద్థి ఏదైనా ఉందంటే పెద్దగా ఏమీ లేదంటున్నా ఆ ప్రాంత వాసులే. అసలు కుప్పం నియోజకవర్గం అభివృద్ధి చెందకపోవడానికి అసలు కారణమేంటి.
 
దివంగత నేత, నటుడు నందమూరి తారకరామారావు మరణం తర్వాత తెలుగు ప్రజలకు పరిచయమైన కొత్త ముఖం చంద్రబాబునాయుడే. అనతి కాలంలోనే తెలుగు రాష్ట్రప్రజలకు అతి చేరువైన నాయకుల్లో బాబు ఒకరు. చంద్రబాబునాయుడు మొదటి నుంచి చిత్తూరుజిల్లా కుప్పం నియోజవర్గం నుంచే ఎక్కువసార్లు పోటీ చేస్తూ వచ్చారు. కారణం ఆయన సొంత జిల్లా చిత్తూరు కావడం. దాంతో పాటు కుప్పంతో బాబుకు ఉన్న అనుబంధం అలాంటిది. కుప్పం నియోజవర్గాన్ని అభివృద్ధి చేసినా, చేయకున్నా ఆ నియోజవర్గ ప్రజలు మాత్రం బాబును ప్రజాప్రతినిధిగా చేస్తూనే ఉన్నారు. భారీ మెజారిటీతో గెలిపిస్తూనే ఉన్నారు.
 
సాధారణంగా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఎప్పుడూ తన నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో అన్న ఆలోచనలో ఉంటారు. అలాంటిది ఏకంగా ముఖ్యమంత్రే అయితే ఆ నియోజవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని అందరూ భావిస్తారు. అయితే అందుకు పూర్తి విరుద్ధం చంద్రబాబునాయుడు. అసలు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి తన సొంతజిల్లా కడపతో పాటు తన సొంత నియోజకవర్గం పులివెందులను ఏ విధంగా అభివృద్థి చేసుకున్నారో అందరికీ తెలిసిన విషయమే. అంతేకాదు కాంగ్రెస్‌పార్టీ నుంచి సిఎం అయిన నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి కూడా తన సొంత నియోజవర్గం వాయల్పాడును అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే.
 
అయితే చంద్రబాబునాయుడు మాత్రం 11 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినా, ఎక్కువ సంవత్సరాలు కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేసినా అభివృద్ధి మాత్రం పెద్దగా జరగలేదని కుప్పం నియోజవర్గ ప్రజలే చెప్పుకుంటున్నారు. చంద్రబాబునాయుడు ఎప్పుడూ పరిపాలనా వ్యవహారంతో బిజీగా ఉంటారు. దీంతో కుప్పం నియోజకవర్గ అభివృద్ధి బాధ్యతను కుమారుడు నారా లోకేష్‌కు అప్పగించారు. నారా లోకేష్‌కు ఏపీ రాజకీయాల్లో ఒక పేరుంది. అదే మొద్దబ్బాయ్‌.. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ పేరుకు తగ్గట్లే నారా లోకేష్‌ వ్యవహార శైలి ఉంది. ఎలాగంటారా... కుప్పం నియోజకవర్గ బాధ్యతను తండ్రి అప్పజెబితే ఏ మాత్రం పట్టించుకోలేదు నారా లోకేష్‌.
 
అప్పుడప్పుడు కుప్పం నియోజకవర్గంలో పర్యటించి కార్యకర్తలు, నాయకుల బంధువుల వివాహాలకు హాజరై వెళ్ళిపోతున్నారు. అంతేతప్ప అభివృద్ధిపై మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు లేకపోలేదు. కుప్పం నియోజకవర్గం అటు తమిళనాడు, ఇటు కర్ణాటక రాష్ట్రాలకు దగ్గరి ప్రాంతం. తెలుగుప్రజలతో పాటు తమిళీయులు కూడా ఎక్కువమందే ఉన్నారు. అయితే కుప్పం పట్టణం మాత్రమే అంతో ఇంతో అభివృద్ధి చెందింది తప్ప నియోజవర్గంలోని ఏ మండలం కానీ పెద్దగా అభివృద్ధి చెందలేదని ప్రజలే బహిరంగంగా చెప్పుకుంటున్నారు. 
 
తినడానికి తిండి లేదు కానీ మీసాలకు సంపంగె నూనె అన్న చందంగా తయారైంది చంద్రబాబు అభివృద్ధి పరిస్థితి. కుప్పం నియోజకవర్గం అభివృద్ధి లేదు కానీ, కుప్పంలో అత్యాధునిక హంగులతో విమానాశ్రయాన్నే నిర్మించడానికి సిద్ధమయ్యారు. విమానాశ్రయం కోసం పేదల భూములపై పడ్డారు అధికారులు. అయితే ఆందోళనలు ఉదృతం కావడంతో విమానాశ్రయ పనులు ఆగిపోయాయి. ముందు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయండి.. మళ్లీ విమానాశ్రయం గురించి ఆలోచిస్తారని కుప్పం వాసులే చంద్రబాబుపై ఆగ్రహంతో ఉన్నారు. తాజాగా కోట్ల రూపాయలు అభివృద్ధికి విడుదల చేశారు బాబు. 
 
అయితే ఇంత వరకు ఒక్కరూపాయంటే ఒక్కరూపాయి ఖర్చు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనేలేదు. అసలు చంద్రబాబునాయుడు ఎమ్మెల్యే అయిన తరువాత కుప్పంకు ఎన్నిసార్లు వచ్చారనేది వేళ్లపై లెక్కించి చెప్పేస్తున్నారు కుప్పం నియోజకవర్గం ప్రజలు. ఇది చంద్రబాబునాయుడు కుప్పం అభివృద్ధి. బాబు ఇలాగే కుప్పం ప్రజలను అభివృద్ధికి ఆమడదూరంలో ఉంచితే వారు కూడా వచ్చే ఎన్నికల్లో వారి ప్రతాపాన్ని చూపించేందుకు సిద్ధమవుతారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.