శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: శనివారం, 28 ఫిబ్రవరి 2015 (14:16 IST)

స్పెషల్ స్టేటస్ నిల్... బాబుతో వేస్ట్... కేసీఆర్ తో బెస్ట్... భాజపా ఫార్ములా ఇదేనా...?

ఆశించిన ప్రకటన రాకపోవడంతో ఏపీ భంగపడింది. బడ్జెట్ 2015-16లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేక హోదాపై ప్రకటన వస్తుందేమోనని గంపెడాశలు పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిరాశే మిగిలింది. తెలుగుదేశం ప్రభుత్వానికి ఇది మరీ అశనిపాతంగా మారింది. అసలే పుట్టెడు ఆర్థిక లోటుతో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రను ప్రత్యేక హోదా రూపంలో కేంద్రం ఆదుకుంటుందనుకున్న చంద్రబాబు సర్కారుకు చుక్కెదురయ్యింది. ప్రత్యేక హోదాపై కేంద్రం మీనమేషాలు ఎందుకు లెక్కిస్తోంది... అనే దానిపై ఇప్పుడు చర్చ మొదలైంది. 

 
ప్రత్యేక హోదా అంశం ఆనాడు నేరుగా బిల్లులో పొందుపరచకుండా రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్ కేవలం ప్రకటనకే పరిమితం చేశారు. దీంతో దీని అమలు గాలిలోనే అన్న చందంగా అప్పుడే మారింది. ఐతే ఇప్పుడు ఆ హామీని నెరవేర్చేందుకు భాజపా మీనమేషాలు లెక్కిస్తోంది. రాష్ట్ర విభజన జరిగి 9 నెలలు గడిచినా దాని గురించి స్పష్టమైన ప్రకటన మాత్రం రాలేదు. వస్తుందో లేదో కూడా తెలియని స్థితి.
 
దీనంతటికీ కారణం... ఏపీలో భాజపా అధికారంలో లేకపోవడమే అనే వాదన వినిపిస్తోంది. ఒకవేళ అన్ని అడ్డంకులను, విమర్శలను అధిగమించి ఏపీకి పూర్తిస్థాయిలో వెన్నుదన్నుగా నిలిచినా అది తెదేపాకు రాజకీయంగా లాభిస్తుంది తప్ప భాజపాకు ఎంతమాత్రం సహాయపడదు. అందువల్ల వీటిపై ప్రత్యేక శ్రద్ధను భాజపా కనబరచడం లేదని విమర్శలు వినవస్తున్నాయి. ఇంకోవైపు దేశంలోనే ధనిక రాష్ట్రంగా విడివడిన తెలంగాణ అవతరించడంతో ఆ రాష్ట్రాన్ని ఏలుతున్న తెరాసతో పొత్తు పెట్టుకుంటే భవిష్యత్తులో మేలు జరుగుతుందన్న యోచనలో భాజపా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
 
ఏదేమైనా బడ్జెట్ 2014లో ఏపీ విషయంలో కేంద్రం పట్టింపులేని ధోరణితో ఉందనీ, అవసరమైతే అస్త్రశస్త్రాలను సంధించేందుకు సిద్ధంగా ఉన్నామని తెదేపా ఎంపీ శివప్రసాద్ ప్రకటించారు. అసలు హామీలు ఎప్పుడు నెరవేరుస్తారో తెలియని అయోమయ స్థితి ఉందని గుంటూరు ఎంపి జయదేవ్ అన్నారు. వ్యవహారం చూస్తుంటే తెదేపా వర్సెస్ భాజపా అయ్యేందుకు మరెంతో దూరం లేదని తెలుస్తోంది. చూడాలి ఏం జరుగుతుందో...?!!