గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By tj
Last Updated : బుధవారం, 8 ఫిబ్రవరి 2017 (15:32 IST)

దీపతో జతకట్టేందుకు పన్నీరు సెల్వం రెడీ - డీఎంకేకి హ్యాండే..!

ప్రస్తుతం దేశ ప్రజలందరూ తమిళనాడు రాజకీయాలవైపే చూస్తున్నారు. ఏ క్షణం ఏ జరుగుతుందన్న ఆదుర్ధాలో ఉన్నారు. జయలలిత మరణించిన తర్వాత నుంచి ఇప్పటివరకు సైలెంట్‌గా ఉన్న పన్నీరు సెల్వం మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా ఫైరయ్యారు. శశికళ తీరును తప్పుబట్టారు. అమ్మ మరణంపై సందేహాలున్నాయని, శశికళ తనను బెదిరించి బలవంతంగా రాజీనామా చేయించారని పన్నీరుసెల్వం చెప్పుకొచ్చారు. 
 
ఉదయం నుంచి కూడా శశికళకు వ్యతిరేకంగానే అన్నీ జరుగుతూ వచ్చాయి. పన్నీరు సెల్వం మాత్రం తనవైపు ఎంతోమంది ఎమ్మెల్యేలు శశికళను భయపెట్టే ప్రయత్నం చేశారు. అయితే ఎమ్మెల్యేలలో శశికళ సమావేశం తర్వాత పన్నీరుసెల్వంకు పెద్దగా ఆదరణ లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ ప్రస్తుతం సమావేశానికి వెళ్ళిన ఎమ్మెల్యేలందరూ శశికళకు అనుకూలంగా వ్యవహరిస్తారన్న నమ్మకం కూడా లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
 
ఇదంతా పక్కనబెడితే జయలలిత వారసురాలిగా ప్రకటించుకుంటున్న ఆమె మేనకోడలు దీప మాత్రం శశికళ వ్యవహారంపై తీవ్రంగా స్పందిస్తున్నారు. శశికళ ముఖ్యమంత్రి పదవికి అనర్హురాలని చెబుతున్నారు. ముందు నుంచే వ్యతిరేకంగా ఉన్న దీప ఒక్కసారిగా పన్నీరు సెల్వంతో కలిసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే శశికళ వైఖరిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన పన్నీరు సెల్వం తనను పార్టీ నుంచి పంపించే అధికారం ఎవరికీ లేదని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. జయలలిత తనను పార్టీ కోశాధికారిగా చేసిందని, పార్టీ కోసం అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధం తప్ప పార్టీమారనని చెప్పారు పన్నీరు సెల్వం.
 
డీఎంకే పార్టీ పన్నీరు సెల్వం కలుపుకోవాలని చూస్తున్నా సరే. ఆయన మాత్రం ఆ పార్టీ వైపు మొగ్గు చూపడం లేదు. ఇక మిగిలింది దీప ఒక్కటే. జయ రాజకీయ వారసురాలిగా ఉన్న దీప తానేంటో నిరూపించుకుంటానని ఇప్పటికే ప్రకటించారు. దీంతో పన్నీరు సెల్వంను బుధవారం ఆమె కలిశారు కూడా. ఈ నేపథ్యంలో ఇద్దరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. కలిసికట్టుగా శశికళను ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే డిఎంకేతో పాటు దీప ఆరోపణలతో సతమతమవుతున్న శశికళకు పన్నీరుసెల్వం రూపంలో మరో ఉపద్రవం రావడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. 
 
131 మంది ఎమ్మెల్యేలు తన వెంటే ఉన్నారన్న ధీమాలో శశికళ మాత్రం ప్రస్తుతం ఉన్నారు. అయితే దీప, పన్నీరు సెల్వంలు మాత్రం అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను చీల్చే దిశగానే ప్రస్తుతం పావులు కదుపుతున్నారు. ఎన్నికల్లప్పుడే తనకు బాగా కావాల్సిన వారికి టిక్కెట్లు తీయించుకోవడంలో పన్నీరు సెల్వం సక్సెస్ అయ్యారని తెలుస్తోంది. వారందరినీ బయటకు తీసుకురావాలన్న ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే శశికళకు శాసనసభలో డిఎంకే పెట్టే అవిశ్వాసంలో ఇబ్బందులు తప్పవు. మొత్తం మీద తమ తమిళనాడు రాజకీయాలు గంట గంటకు మారుతున్నాయి.