గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By PNR
Last Updated : మంగళవారం, 18 ఆగస్టు 2015 (09:44 IST)

నరేంద్ర మోడీవి కూడా ఉత్తుత్తి మాటలేనా... మాజీ సైనికులకిచ్చే మర్యాద ఇదేనా?

తమ ప్రాణాలను ఫణంగా పెట్టి దేశాన్ని శత్రువుల నుంచి రక్షిస్తున్న సైనికులకు మన పాలకులు తగిన గౌరవమిస్తున్నారా? దేశం కోసం కుటుంబాన్ని వదిలేసి వేలాది కిలోమీటర్ల అవతల ఎండ, వాన, కొండ కోన, మంచు మంట.. ఇలా దేన్నీ లెక్క చేయకుండా దేశ సరిహద్దుల వెంబడి కాపలా కాస్తున్న వారి కోర్కెలను మన పాలకులు తీర్చలేరా? వన్ ర్యాంక్.. వన్ పెన్షన్ స్కీమ్ కోసం మాజీ సైనికులు దేశ రాజధాని నడిబొడ్డున... పార్లమెంట్‌కు కూతవేటు దూరంలో గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తుంటే మన పాలకులకు పట్టదా?
 
 
నిజానికి ఈ విషయంలో ఇటు బీజేపీతో పాటు.. అటు కాంగ్రెస్‌కు భాగముంది. పదేళ్ళ నుంచి ఈ సైనికులు వివిధ దశల్లో ఆందోళన చేస్తున్నారు. కానీ, యూపీఏ పాలకులకు చెవికెక్కలేదు.. కంటికి కనిపించలేదు. దీన్ని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఓ అవకాశంగా తీసుకున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఆందోళన చేసే సైనికులకు హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆయన కూడా ఉత్తుత్తి మాటలతో యేడాదిన్నకాలం వెళ్ళదీశారే గానీ సైనికులకిచ్చిన హామీ గురించి పట్టించుకోలేదు. 
 
వాస్తవానికి మాజీ సైనికులు డిమాండ్‌ను అమలు చేస్తే కేంద్ర ప్రభుత్వ ఖజానాపై పడే భారం రూ.18 వేల కోట్లు మాత్రమే. గత యూపీఏ పదేళ్ళ పాలనలో వెలుగు చూసిన కుంభకోణాలతో పోల్చితే ఈ మొత్తం సముద్రంలో కాకిరెట్టకు కూడా సమానం కాదు. అయినా మన పాలకులు పట్టించుకోవడం లేదు కదా.. ఆందోళన చేస్తున్న వారికి పోలీసు లాఠీ దెబ్బలు రుచిచూపించారు. 
 
కానీ, పార్లమెంట్ నుంచి పంచాయితీ దాకా ప్రజా ప్రతినిధులంతా జీతాల్ని పెంచుకునేందుకు పార్టీలకతీతంగా ఒక్కతాటిపైకి వస్తారు. పార్లమెంట్‌లో ఎంపీలు పని చేసినా చేయకున్నా జీతభత్యాలు, అలవెన్సులు ఇవ్వాల్సిందే. ఉద్యోగులకు కూడా జీతాలకు తోడు ఆమ్యామ్యాలు అదనం. కానీ దేశం కోసం తమ ప్రాణాలను ఫణంగా పెట్టే సైనికులకు మాత్రం ఒక్కపైసా ఇచ్చేందుకు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. 
 
కేంద్ర ప్రభుత్వ అసంబద్ధ విధానాల వల్ల.. ఒకే ర్యాంక్ మీద రిటైర్ అయినా.. పెన్షన్ దగ్గర అనేక తేడాలు ఉన్నాయి. ఒకే ర్యాంక్‌లో రిటైరైనా.. పదేళ్ల క్రితం పని చేసిన వ్యక్తికి.. ఇప్పుడు పని చేసిన వ్యక్తికీ అందుతోన్న పెన్షన్‌లో చాలా తేడా ఉంది. దీన్ని సమంచేయమని కోరడం నేరమా? ప్రపంచంలో ఏ దేశమైనా తన సైనికుల్ని ఇలాగే ట్రీట్ చేస్తోందా? సైనికులు సరిహద్దుల వెంబడి కాపలా కాస్తుండటం వల్లే మనం హాయిగా నిద్రపోతున్నామని పదేపదే గుర్తు చేసే నరేంద్ర మోడీకి మాజీ సైనికులకిచ్చిన మాట గుర్తులేదు కావాలా?