శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By PNR
Last Updated : శనివారం, 22 ఆగస్టు 2015 (08:56 IST)

ఆపరేషన్ అమరావతి : ఇదే చంద్రబాబు సర్కారు లక్ష్యమా?

నవ్యాంధ్ర రాజధాని అమరావతితో పాటు దాని పరిసర గ్రామాల్లో ఉన్న భూములన్నింటినీ స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందుకోసం ఆపరేషన్ అమరావతి అనే పేరు కూడా పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ప్రభుత్వం ఇప్పటివరకు రాజధాని నిర్మాణం కోసం 33 వేల ఎకరాలను సేకరించింది. ఇది సరిపోదని చంద్రబాబు అండ్ కో భావిస్తోంది. అందుకే తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు (ఆపరేషన్ అమరావతి) భూసేకరణ చట్టాన్ని ప్రయోగించేందుకు సిద్ధమైంది. ఇన్ని వేల ఎకరాలను సేకరించి ఏం చేస్తారోనన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నా.. అనేక విమర్శలు వస్తున్నా.. చంద్రబాబు అండ్ కో మాత్రం తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకే ముందుకు అడుగులు వేస్తున్నారు. దీంతో అమరావతి గ్రామాల పల్లెల్లో ఆందోళన మొదలైంది. 
 
నిజానికి రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో 3,821 ఎకరాలను భూసేకరణ చట్టం ద్వారా సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు తొలి విడతగా ఐదు గ్రామాల్లో నోటిఫికేషన్ విడుదల చేశారు. నోటిఫికేషన్ ఇచ్చిన నాటి నుంచి 30 రోజుల్లో రైతులు భూములు ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. భూసేకరణ చేయాల్సిన గ్రామాల్లో విడతల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
 
అయితే భూసేకరణకు రైతుల నుంచి పూర్తి స్థాయి మద్దతు లభించడం లేదు. ఏడాదికి మూడు పంటలు పండే భూములు ఎలా వదలుకుంటామని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. బెజవాడ సీఆర్‌డీఏ కార్యాలయం వద్ద ఆందోళన కూడా చేపట్టారు. అభివృద్ధి పేరుతో తమ జీవితాలను నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. భూసేకరణ విషయంలో ప్రభుత్వ విధానాన్ని తప్పుబడుతున్నారు. రైతులను నిస్సహాయులను చేసి బలవంతంగా గుంజుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. 
 
దీంతో ఆందోళన చేస్తున్న రైతులకు అండగా నిలబడేందుకు జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చారు. నదీముఖ గ్రామాల్లో మూడు పంటలు పండే భూములను బలవంతంగా సేకరించరాదని, రైతులను ఒప్పించి, శాంతపరించి సేకరించాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై చంద్రబాబు అండ్ కో ఐక్యతతో విమర్శల దాడి చేస్తూ.. తాము అనుకున్న పనిని పూర్తి చేసేందుకే మొగ్గు చూపుతోంది. ఇదే విధంగా మూర్ఖంగా ప్రవర్తిస్తే మాత్రం టీడీపీ నేతలకు పుట్టగతులుండవని రైతులు హెచ్చరిస్తున్నారు. మొత్తంమీద ఆపరేషన్ అమరావతి ఇపుడు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇది ఏ పరిస్థితికి దారితీస్తుందో వేచిచూడాల్సిందే.