గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : గురువారం, 19 నవంబరు 2015 (10:28 IST)

వరంగల్ ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థికి కష్టాలు తప్పవా.. మంత్రుల్లో గుబులు!

వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా పోటీ చేస్తున్న పసుమర్తి దయాకర్‌కు కష్టాలు తప్పవా? ఈ స్థానంలో విజయావకాశాలపై పార్టీ అంతర్గత సర్వేలో వెల్లడైన ఫలితాలతో తెరాస మంత్రులు షాక్‌కు గురయ్యారా? అందుకే ఉప ముఖ్యమంత్రి కడియ శ్రీహరి... నిరాశతో వ్యాఖ్యలు చేశారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి ఓడిపోతే... సీఎం కేసీఆర్ పాలన బాగోలేనట్టుగానే భావించాలని కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేయడం ఇపుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.
 
టీఆరెస్‌ అధికారంలోకి వ‌చ్చిన 16 నెల‌ల త‌ర్వాత జ‌రుగుతున్న ఉపఎన్నిక‌ల కావ‌టంతో అధికార పార్టీ త‌మ మీద ఉన్న వ్యతిరేకతను అధిగమించడంతో పాటు... ప్రభుత్వం చేపట్టిన పధకాలను జ‌నంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే వరంగల్ పార్లమెంట్  ప‌రిధిలో ఉన్న ఏడు  సెగ్మెంట్లను మంత్రులంతా జ‌ల్లెడ ప‌ట్టారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైనే ప్రధానంగా దృష్టిసారించారు. కానీ సాధారణ ఎన్నిక‌ల్లో వ‌చ్చిన మెజార్టీ వ‌స్తుందా..? రాదా..? పార్టీ అభ్యర్థికి పరాభవం తప్పదా? అనే దానికంటే... క‌డియం శ్రీహ‌రికి ఎంత శాతం ఓట్లు వ‌చ్చాయో... ఇప్పుడు కూడా అదే స్థాయిలో అంతే శాతం ఓట్లు రావాలన్న ఆలోచనలో ఉంది అధికారపార్టీ. అందుకే పోలింగ్ పర్సెంటేజీ మీద ఎక్కువ దృష్టి పెట్టింది. 
 
ప్రతీ నియోజకవర్గానికి ఓ మంత్రిని బాధ్యుణ్ణి చేస్తున్న నేపథ్యంలో.. ఆయా నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఉన్న ఓట‌ర్లతో పాటు, వ‌ల‌స‌ వెళ్లిన వారిని వెనక్కు పిలిపించి ఓటు వేయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఓట‌ర్ల జాబితాకు అనుగుణంగా.. ఎవ‌రెవ‌రు ఎక్కడెక్కడ ఉన్నార‌న్న స‌మాచారాన్ని సేకరించారు. వారంద‌రిని పోలింగ్ రోజు కేంద్రానికి తీసుకువచ్చే పనిలో ఎమ్మెల్యేలు, పార్టీ నేత‌లు త‌ల‌మున‌క‌ల‌య్యారు. పోలింగ్ శాతాన్ని పెంచగలిగితే దాని ప్రభావంతో ఖచ్చితంగా మెజార్టీ కూడా పెరుగుతుంద‌న్న అంచ‌నాల‌కు తెరాస వ‌చ్చింది. దీంతో గులాబీ శ్రేణులు ఆ అంశం మీదే ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిచాయి.